ముక్కు బిగదీసుకుపోతోంది.. అదేపనిగా  తుమ్ములు... 

14 Jun, 2018 00:22 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 29 ఏళ్లు. నేను గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారడం, ముక్కులు బిగదీసుకుపోతున్నాయి. వాసనలు తెలియడం లేదు. చాలామంది డాక్టర్లను కలిశాను. సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి.  – సంతోష్‌దేవ్, సంగారెడ్డి 
మీరు ‘అలర్జిక్‌ రైనైటిస్‌’ అనే సమస్యతో బాధపడుతున్నారు. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటువాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి.
లక్షణాలు : ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్‌లకు ఇన్ఫెక్షన్‌ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నేసల్‌ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. 
నివారణ : ∙అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం ∙సరైన పోషకాహారం తీసుకోవడం  ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ∙చల్లని వాతావరణానికి దూరంగా ఉండటం ∙పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం. 
చికిత్స : హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి  కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్‌ రైనైటిస్‌ పూర్తిగా తగ్గుతుంది. హోమియోలో ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. 
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

ఆపరేషన్‌  తర్వాత కూడా  కిడ్నీలో రాళ్లు... 
నా వయసు 32 ఏళ్లు. నాకు గతంలో కిడ్నీలో రాళ్లు వచ్చాయి. శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. ఆ తర్వాత మళ్లీ కొంతకాలంగా నడునొప్పి రావడంతో డాక్టర్‌ను సంప్రదించాను. వారు స్కాన్‌ తీయించి, మళ్లీ కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడకుండా చేసేలా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వండి. 
– ఎల్‌. కృష్ణమూర్తి, మేదరమెట్ల 

మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి, శరీరంలోని లవణాల సమతుల్యతను కాపాడతాయి. ఎప్పుడైతే మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటికరూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరతాయో, అప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రవ్యవస్థలో భాగమైన మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం... ఇలా ఎక్కడైనా రాళ్లు ఏర్పడవచ్చు. కిడ్నీలో రాళ్లను  శస్త్రచికిత్స ద్వారా తొలగించినప్పటికీ 50% మందిలో ఇవి మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ కాన్‌స్టిట్యూషనల్‌ హోమియో చికిత్స ద్వారా వీటిని మళ్లీ ఏర్పడకుండా చేసే అవకాశం ఉంటుంది. 

కారణాలు : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మరికొన్ని ఇతర కారణాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కొందరిలో మూత్రకోశ ఇన్ఫెక్షన్స్, మూత్రమార్గంలో అడ్డంకులు ఏర్పడటం, ఒకేచోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శరీరంలో విటమిన్‌–ఏ పాళ్లు తగ్గడం వంటి ఎన్నో అంశాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇవేకాకుండా కిడ్నీలో రాళ్లను ప్రేరేపించే అంశాలు... ఆహారంలో మాంసకృత్తులు, ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకోవడం; సాధారణం కంటే తక్కువగా (అంటే రోజుకు 1.5 లీటర్ల కంటే తక్కువగా)  నీళ్లు తాగడం వంటి వాటితో కిడ్నీలో రాళ్లు రావచ్చు. ఇక కొన్ని ఇతర జబ్బుల వల్ల... ముఖ్యంగా హైపర్‌ కాల్సీమియా, రీనల్‌ ట్యూబులార్‌ అసిడోసిస్, జన్యుపరమైన కారణాలతో, ఆస్పిరిన్, యాంటాసిడ్స్, విటమిన్‌–సి ఉండే కొన్ని మందులు, క్యాల్షియమ్‌ సప్లిమెంట్లతోనూ కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. 
లక్షణాలు : విపరీతమైన నడుమునొప్పి, కడుపునొప్పి, వాంతులు, మూత్రంలో మంట వంటివి కిడ్నీలో రాళ్లు ఉన్నప్పటి ప్రధాన లక్షణాలు. కొందరిలో ఒకవైపు నడుమునొప్పి రావడం, నొప్పితో పాటు జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడటాయి. దీనివల్ల నడుము, ఉదరమధ్య భాగాల్లో నొప్పి, ఇక్కడి నుంచి నొప్పి పొత్తికడుపు, గజ్జలకు, కొన్నిసార్లు కాళ్లలోకి పాకడం జరుగుతుంది. మరికొందరిలో కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ, నొప్పి లేకుండానే కిడ్నీలో రాళ్లు ఉండవచ్చు. వీటిని సైలెంట్‌ స్టోన్స్‌ అంటారు. 
చికిత్స : హోమియోలో కిడ్నీలో రాళ్లను తగ్గించేందుకూ, మళ్లీ ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం పడకుండా, రాళ్లను నియంత్రించేందుకూ అవకాశం ఉంది. 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

కాళ్లు లాగుతున్నాయి
నా వయసు 47 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? – డి. కమలబాయి, నిజామాబాద్‌ 
మీకు ఉన్న సమస్య వేరికోస్‌ వెయిన్స్‌. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్‌ వెయిన్స్‌ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేకదిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల  రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. శరీరంలోని ఇతర భాగాలలోనూ కనిపించినా 80 శాతం కేసుల్లో వేరికోస్‌ వెయిన్స్‌ కాళ్లపైనే కనిపిస్తాయి. 
కారణాలు : ∙ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. 
లక్షణాలు : ∙కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం  చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం. 
చికిత్స : వేరికోస్‌ వెయిన్స్, వేరికోసిల్‌ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో  అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్‌ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు  పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, 
ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా