ఒంటి  దుర్వాసనతో కుంగి పోతున్నాను

10 Oct, 2018 00:52 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

హెయిర్‌ అండ్‌ స్కిన్‌ కౌన్సెలింగ్‌

నాకు చాలా ఎక్కువగా చెమట పడుతుంటుంది. చెమట దుర్వాసన కూడా ఎక్కువేనని ఫ్రెండ్స్‌ అంటున్నారు. ఈ సమస్య నన్ను చాలా వేధిస్తోంది.  నలుగురిలో కలవలేక  మానసికంగానూ కుంగిపోయేలా చేస్తోంది. నా సమస్యకు పరిష్కారం సూచించండి.  – ఆర్‌. వేణుప్రసాద్, రాజమండ్రి 
చెమట పట్టడంతో ఒంటి నుంచి దుర్వాసన రావడం అన్నది కొందరిలో సాధారణం కంటే మరింత ఎక్కువ. ఇలా చెమట కారణంగా ఒంటి నుంచి దుర్వాసన రావడానికి  అనేక అంశాలు దోహదం చేస్తాయి. ఉదాహరణకు... 
∙ఇక స్థూలకాయంతో ఉన్నవారు, ఇతర చర్మ సమస్యలు / ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి దుర్వాసన సమస్య అధికం. ముఖ్యంగా ఇంటెర్‌ట్రిగో, ట్రైకోమైసోసిస్, ఎరిత్మా సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య మరీ ఎక్కువ. 
∙ఇక కొందరిలో దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం, గౌట్, మూత్రపిండాలు, కాలేయం సమస్యలు, టైఫాయిడ్‌ ఉన్నప్పుడు కూడా వారి నుంచి చెడువాసన వస్తుంటుంది. అలాగే శుభ్రత విషయంలో బద్దకంగా ఉండేవారిలోనూ, మద్యం సేవించేవారి దగ్గర్నుంచి, పెన్సిలిన్, బ్రోమైడ్స్‌ వంటి మందుల వాడకం వల్ల కూడా మేని నుంచి దుర్గంధం వెలువడటం అనే సమస్య తలెత్తవచ్చు. 

ఆహారం వల్ల... 
కొందరు తీసుకునే ఆహారంలో వేపుళ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, కొన్ని రకాల ఆకుకూరలు, కెఫిన్‌ ఉన్న పానీయాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.  దుర్వాసన తొలగించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు ముందుగా తమకు ఏ కారణం చేత ఒంటి నుంచి దుర్వాసన వస్తోందో తెలుసుకోవాలి. సాధారణంగా ఆ సమస్య (అండర్‌లైయింగ్‌ ప్రాబ్లమ్‌)ను పరిష్కరించుకుంటే మేని దుర్వాసన సమస్య ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. ఇక అందరూ పాటించదగ్గ సూచనలు ఇవి... ∙ప్రతిరోజూ రెండుసార్లు స్నానం చేయడం ∙  బాహుమూలాలను సబ్బుతో బాగా శుభ్రం చేసుకోవడం ∙చెమట అధికంగా పట్టే ప్రదేశాలను పొడిగా, శుభ్రంగా ఉంచుకోవడం ∙తొడుక్కునే దుస్తులు చెమటను పీల్చుకునేవి, శుభ్రమైనవి, పొడిగా ఉండేవి ధరించడం   ∙బాక్టీరియా సంఖ్యను తగ్గించేది, చర్మతత్వానికి సరిపడే డియోడరెంట్స్‌ వాడటం 

∙అలాగే వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా వాసనకు కారణమయ్యే బాహుమూలాల్లోని వెంట్రుకలను తొలగించుకోవాలి. యాంటీసెప్టిక్‌ సబ్బులను స్నానానికి ఉపయోగించాలి. శరీర దుర్వాసనను పెంచే ఆహారపదార్థాలైన ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలి ∙తాజా ఆహారం తీసుకోవడం, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలాంటి  జాగ్రత్తలు తీసుకుంటే కేవలం ఒంటి దుర్వాసన సమస్యే కాకుండా, ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. 

శరీరానికి పూసే లేపనాలతో... 
సాధారణంగా చెమటలు పట్టేవారు యాంటీపెర్‌స్పిరెంట్స్, డియోడరెంట్స్‌ అనే శరీరానికి పూసే లేపనాలతో తమ శరీర దుర్వాసనను తగ్గించుకుంటుంటారు. యాంటీ పెర్‌స్పిరెంట్స్‌ అన్నవి పేరును బట్టి చెమట పట్టడాన్ని తగ్గించవు. కానీ ఇందులో ఉండే అల్యూమినియమ్‌ క్లోరోహైడ్రేట్, అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియమ్‌ ఫీనాల్‌ సల్ఫొనేట్, అల్యూమినియమ్‌ సల్ఫేట్, జిర్కోనియమ్‌ క్లోరో హైడ్రేట్స్‌ వంటి లవణాలు ఉంటాయి. ఇవి చెమటగ్రంథి ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేసి, చెమట తక్కువగా పట్టేలా చేస్తాయి. వాటి ప్రభావం తగ్గాక మళ్లీ చెమటపడుతుంది. ఇలా తాత్కాలికంగా చెమటగ్రంథిని మూసేస్తుంది కాబట్టి దీన్ని యాంటీపెర్‌స్పిరెంట్స్‌ అంటారు. అందుకే యాంటీపెర్‌స్పిరెంట్స్‌ను శరీరంలో చెమట ఎక్కువగా స్రవించే ప్రాంతాల్లో పూస్తారు. ఇక డియోడరెంట్స్‌ విషయానికి వస్తే వీటిని అటు బాహుమూలాలతో పాటు చర్మంపైన ఏ ప్రాంతంలోనైనా పూయవచ్చు. డియోడరెంట్స్‌లో ఉండే అమోనియమ్‌ అలమ్, పొటాషియమ్‌ అలమ్‌ తాత్కాలికంగా చెమటలోని వాసన కలిగించే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. వాటి ప్రభావం తొలిగాక ఆ బ్యాక్టీరియా మళ్లీ పుడుతూనే ఉంటుంది.

ఎలాంటి  షాంపూ  వాడితే  మేలు?
మార్కెట్‌లో చాలారకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి కదా. వాటిలో ఏది ఎంచుకోవాలా అనే అంశంపై మాకు కొంచెం అయోమయంగా ఉంది. సాధారణంగా మంచి షాంపూను ఎంచుకోవడానికి ఎలాంటి మార్గదర్శకాలు పాటించవచ్చో వివరించండి.  – డి. మాధవీలత, హైదరాబాద్‌ 
సాధారణంగా అందరి వెంట్రుకలూ ఒక్కలా ఉండవు కాబట్టే... అందరి షాంపూ అవసరాలూ ఒకేలా ఉంటాయని చెప్పలేం. మన అవసరాలను బట్టి మార్కెట్లోకి రకరకాల షాంపూలు అందుబాటులోకి వచ్చాయి.ఇంకా వస్తున్నాయి. మన  అవసరాలను బట్టి మనం ఎలాంటి షాంపూలను ఎంచుకోవచ్చో చూద్దాం. 
అందరూ వాడదగ్గవి: ఇందులో శుభ్రపరిచే సామర్థ్యం (క్లెన్సింగ్‌ ఎబిలిటీ) నార్మల్‌గా ఉంటుంది. నార్మల్‌ హెయిర్‌ కోసం వాడాల్సిన ఈ షాంపూలు సాధారణంగా లారిల్‌ సల్ఫేట్‌ అనే నురగవచ్చే పదార్థంతో తయారవుతాయి. ఇందులో ఆ రసాయనంతో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు ఉత్పత్తిదారులు రకరకాల సుగంధ ద్రవ్యాలను చేర్చి వాటిని మంచి సువాసన వచ్చేలా రూపొందిస్తారు. ఇవి ఎవరైనా వాడవచ్చు. కాబట్టి మార్కెట్‌లో ఉన్న రకరకాల బ్రాండ్స్‌ను వాడుతూ (ట్రై చేస్తూ)  మీకు ఏది అనువైనదో, సౌకర్యమో అది వాడుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఛాయిస్‌ షాంపూను మీ సంతృప్తి మేరకు కొనసాగించవచ్చు. 
పొడి వెంట్రుకలు ఉండేవారికి: వెంట్రుకలు చాలా పొడిగా ఉండేవారికోసం తయారయ్యే షాంపూల్లో  రోమాన్ని శుభ్రపరిచే రసాయనాలు మరీ తీవ్రంగా లేకుండా చూస్తారు. అంటే మైల్డ్‌ క్లెనింగ్‌ ఏజెంట్స్‌ను ఉపయోగించి చేస్తారు. దాంతో పాటు వెంట్రుక కండిషనింగ్‌ కోసం అందులో సిలికోన్‌ వంటి ఏజెంట్స్, కెటాయినిక్‌ పాలిమర్స్‌ను కలుపుతారు.  వాటిని ఉపయోగించాక ఆ సిలికోన్‌ పొడి వెంట్రుకల మీద సమంగా విస్తరించి ఒక కోటింగ్‌లా ఏర్పడుతుంది. కాబట్టి పొడి వెంట్రుకలు ఉన్నవారికి  సిలికోన్, కెటాయినిక్‌ పాలిమర్స్‌ ఇంటి ఇన్‌గ్రేడియెంట్స్‌ ఉన్నవి మంచి షాంపూలుగా పరిగణించవచ్చు. మీరు పొడి వెంట్రుకలు కలవారేతే... పేన చెప్పిన  ఇన్‌గ్రేడియెంట్స్‌ షాంపూలో ఉన్నాయో లేవో చూసి తీసుకోవచ్చు. 

జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి: ఇక జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి అవసరమైన షాంపూలను మాడుపైన, వెంట్రుకపైన ఉన్న అదనపు సీబమ్‌ను తొలగించేలా డిజైన్‌ చేస్తారు. ఇందులో క్లెన్సింగ్‌ ఏజెంట్‌గా లారిల్‌ సల్ఫేట్‌తో పాటు అదనపు నూనెవంటి స్రావాలను తొలగించడానికి సల్ఫోసక్సినేట్‌ వంటి రసాయనాలు ఉండేలా తయారు చేస్తారు. అయితే జిడ్డు కురులు ఉన్నవారికి రూపొందించే షాంపూలలో కండిషనింగ్‌ తక్కువగా ఉండేలా చూస్తారు. కాబట్టి పైన పేర్కొన్న కాంబినేషన్స్‌ ఉన్నవి జిడ్డు కురుల వారు ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే కురులు మరీ నిర్జీవంగా మారిపోతాయి. పీచులా కనిపించే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ఎంత తరచుగా వాడాలన్నది కేవలం మీ విచక్షణ (డిస్క్రిషన్‌) మేరకే ఉంటుంది. 
డాక్టర్‌ స్వప్నప్రియ
డర్మటాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు