చిరువాక!

9 Jun, 2020 06:13 IST|Sakshi
అండుకొర్ర పంట( సిరిధాన్య పంటల విత్తనాలు)

చిరుధాన్య పంటల ఏరువాక సాగుకు ఆరుద్ర కార్తె అనుకూలం

ఎకరానికి 3 కిలోల విత్తనం చాలు

ఇసుక/నూకలు కలిపి విత్తుకోవాలి

కార్తెలను అనుసరించి పంటలను సాగు చేస్తే మంచి దిగుబడులు

మృగశిర కార్తె రాకకు ముందు నుంచే అడపా దడపా వానలు కురుస్తున్నాయి. ఏరువాక పౌర్ణమితో అన్నదాతలు పనులు సాగించారు. నేలతల్లికి ప్రణమిల్లి అరకలు కట్టడం ప్రారంభించారు. వర్షాధారపంటల సమయమొచ్చిందని గ్రామాల్లో కోయిల కుహు కుహూలు వినిపిస్తున్నా.. చాలా మంది రైతుల ఇంట కాలు దువ్వి రంకేసే ఎద్దులే లేకుండా పోయాయి. పూర్తిగా ఎద్దులతోనే సేద్యం చేసే కాలం మళ్లీ రావాలని అందరూ కోరుకుందామని అంటున్నారు వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె మండలం టి.వెలంవారిపల్లె గ్రామ అభ్యుదయ రైతు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు కొమ్మూరి విజయకుమార్‌. వెన్నెల రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వ్యవస్థాపకులు అయిన ఆయన చిరుధాన్యపు పంటల వర్షాధార సాగులో మెళకువలు ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే..   

‘సోమవారం నుంచి మృగశిర కార్తెలోకి ప్రవేశించాం. తొలకరి చినుకులు పడుతున్నందున ముందస్తు సేద్యాలు (దుక్కులు) చేసుకుంటే మంచిది. సేద్యం వలన భూమి గుల్లబారుతుంది. గడ్డి గింజలు మొలుస్తాయి.
 మృగశిర కార్తె (ఈ నెల 21న) అమావాస్యతో ముగుస్తుంది. 22 నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభవుతుంది. ఆరుద్రలో వానాకాలపు పంటలు ఆనందంగా సాగు చేసుకోవచ్చు. చిరుధాన్యాలు సాగుచేసే రైతులంతా ముందస్తుగా భూమిని తేలికగా దున్నుకోవాలి. లోతు దుక్కి అవసరం లేదు. ఆరుద్ర కార్తె ప్రారంభమైన వెంటనే చిరుధాన్యపు పంటలను సాగు చేసుకోవచ్చు.


ఆరుద్రలోనే ఆరికలు
చిరుధాన్యాల్లో ఏకైక దీర్ఘకాలిక పంట ఆరిక (అరిక). పంట కాలం 150 నుంచి 160 రోజులు. చలి ముదరక ముందే పంట చేతికి రావాలి. అందుకే ఈ పంటను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆరుద్ర కార్తెలోనే విత్తుకోవాలి. ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరం. చిరుధాన్య పంట ఏదైనా ఒంటరిగా కాకుండా కచ్చితంగా అంతరపంటలు కూడా వేసుకోవాలి.
ఆరికలో అంతర పంటలుగా కంది, సీతమ్మ జొన్న, అలసందలు, అనుములు, ఆముదాలు సాగు చేసుకుంటే అదనపు ఆదాయం వస్తుంది. అలాగే చేనిమటిక, గోగులు కూడా వేసుకోవచ్చు. అంతర పంటలు వేసినా ఆరిక ధాన్యం ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

జడ కొర్ర, ఎర్ర కొర్ర మేలు  
కొర్ర పంటకు తేలికపాటి సేద్యం సరిపోతుంది. విత్తనాలు ఎకరాకు మూడు కిలోలు వేసుకోవాలి. పంట కాలం 80–90 రోజులు. జడకొర్ర, ఎర్రకొర్రలు మంచి దిగుబడిని ఇస్తాయి. ఎకరాకు 6–9  క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పంటకు పశువుల ఎరువు లేదా పొలంలో గొర్రెలు, ఆవులను మంద కట్టిస్తే ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పురుగుమందులు, రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు.

రుచికరం.. సామ భోజనం
చిరుధాన్యపు పంటల్లో రాజుగా పేరు పొందింది సామ. సామ బియ్యపు భోజనం చాలా రుచికరంగా ఉంటుంది. పంట కాలం 100–115 రోజులు. ఎకరాకు మూడు కిలోల విత్తనం సరిపోతుంది. దిగుబడి 5–7 క్వింటాళ్లు వస్తుంది.

బరిగెలు బంగారం
బరిగెల (ఒరిగెల) గింజలు బంగారు వర్ణంలో ఉంటాయి. విత్తిన 70 రోజులకే పంట చేతికి వస్తుంది. తేలికపాటి సేద్యం చేస్తే సరిపోతుంది. విత్తనం  ఎకరాకు మూడు కిలోలు చాలు. దిగుబడి 8–10 క్వింటాళ్లు వస్తుంది. పశువులు ఈ మేతను బాగా ఇష్టపడతాయి.

ఊద.. ఎరువును బట్టి దిగుబడి
ఊదల పంట కాలం 120 రోజులు. ఎకరాకు మూడు కిలోల విత్తనం సరిపోతుంది. పశువుల ఎరువు, చెరువుమట్టి తోలి పంట పెడితే 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పశువుల ఎరువు ఎక్కువ పొలానికి తోలి సాగు చేస్తే రెట్టింపు దిగుబడి వస్తుంది. ఊద గడ్డి పశువులు ఇష్టంగా తింటాయి. సేంద్రియ సేద్యంలో ఈ పంటకు ఎలాంటి చీడపీడలు ఆశించవు.

అండుకొర్రలు.. ఎప్పుడైనా విత్తుకోవచ్చు
అండుకొర్రల అసలు పేరు అంటుకొర్రలు. పూర్వం నుంచి కర్ణాటక రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లో పండించేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాచుర్యం పొందింది. ఎకరం సాగుకు 3 కిలోల విత్తనం చాలు. ఈ పంటను ఏడాది పొడవునా ఎప్పుడైనా విత్తుకోవచ్చు. పంట కాలం 100–105 రోజులు. జిగురు చౌడు భూములు మినహా అన్ని రకాల నేలల్లో అండుకొర్ర పండుతుంది.

ఎకరానికి ఆరికలు 4 కిలోలు, మిగతావన్నీ 3 కిలోల విత్తన మోతాదు వేసుకోవాలి. విత్తే సమయంలో కిలో విత్తనానికి 4 కిలోల ఇసుక గానీ లేదా 4 కిలోల బియ్యపు నూకలు గానీ కలిపి గొర్రుతో వెద పెట్టడం గానీ, చల్లుకోవడం గానీ చేయాలి. చిరుధాన్య విత్తనాలను నానబెట్టి గానీ గానీ, నారు పోసి గానీ సాగు చేయకూడదు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు నాణ్యమైన రైతువారీ విత్తనం వేసుకోవడం ఉత్తమమ’ని విజయకుమార్‌ (98496 48498) సూచిస్తున్నారు.

– మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, అగ్రికల్చర్, వైఎస్సార్‌ జిల్లా

మరిన్ని వార్తలు