ఆర్థిక ప్రణాళిక.. 30కి ముందే

26 Sep, 2014 23:14 IST|Sakshi
ఆర్థిక ప్రణాళిక.. 30కి ముందే

ఏది చేసినా.. ముప్పయ్‌ల ముందే. ఎందుకంటే చాలామందికి అసలైన బరువు, బాధ్యతలు ముప్పయ్‌ల తర్వాతే మొదలవుతాయి. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, సొంత ఇల్లూ, కారు వగైరా కలల సాకారానికి కూడబెట్టుకోవడం ఇలా ఒకదాని తర్వాత మరొకటి వచ్చి పడిపోతుంటాయి. ఈ చట్రంలో చిక్కుకున్న తర్వాత కీలకమైన బీమా మొదలైన ఆర్థికపరమైన జాగ్రత్తలపై దృష్టి పోదు. ఒకవేళ వెళ్లినా.. ఇప్పుడెక్కడ కుదురుతుంది.. తర్వాత చూద్దాంలే అని వాయిదా వేసేస్తుంటారు. కాబట్టి, ముప్పయ్‌ల ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, క్రమశిక్షణ అలవర్చుకుంటే ఆ తర్వాత ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడనక్కర్లేదు. అలాంటి వాటిల్లో కొన్నింటి గురించి ఈ కథనం..
 
టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా ..

కుటుంబానికి ఆర్థికపరమైన భరోసా కల్పించేందుకు ఉపయోగపడే అచ్చమైన జీవిత బీమా పాలసీలు.. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు. తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజీ ఇస్తుంటాయి. అయితే, వయస్సుతో పాటు తీసుకునే కవరేజీని బట్టి కట్టాల్సిన ప్రీమియంలూ పెరుగుతుంటాయి. కనుక, లేటు వయస్సులో కాకుండా కాస్త ముందుగానే టర్మ్ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియాలతో సరిపోతుంది. అదే ఆన్‌లైన్‌లోనైతే పాలసీ మరింత చౌకగా లభిస్తుంది. ఉదాహరణకు 28 ఏళ్ల వ్యక్తి ముప్పై ఏళ్ల వ్యవధి కోసం 50 లక్షల బీమా పాలసీ ఆన్‌లైన్లో తీసుకుంటే ఏడాదికి సుమారు రూ. 5,550 కడితే సరిపోతుంది.

అదే ముప్పై అయిదేళ్ల వ్యక్తి పాతికేళ్ల వ్యవధికి అదే పాలసీ తీసుకోవాలంటే ఏటా రూ. 7,150 కట్టాల్సి వస్తుంది. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. వైద్య ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల కోసం ఆరోగ్య బీమా పాలసీలు తప్పనిసరిగా మారుతున్నాయి. కాస్త ముందుచూపుతో అవసరానికి అనుగుణమైన కవరేజీని ఎంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. వీటి వల్ల ఆదాయ పన్నుపరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి.
 
ఇన్వెస్ట్‌మెంట్ క్రమశిక్షణ..

ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల గురించి తెలుసుకోవడం, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే అలవాటును అలవర్చుకోవడం.. ఇరవైలలో నేర్చుకోవాల్సిన ఆర్థిక క్రమశిక్షణ పాఠాల్లో కొన్ని. ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో ఎంత ముందుగా మొదలుపెడితే లక్ష్యం సాధించడం అంత సులువవుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, షేర్లు, ఫండ్లు, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు, రిస్కు సామర్ధ్యాలను బట్టి అనువైనవి ఎంచుకోవచ్చు. రిస్కులు పెద్దగా ఇష్టపడని వారు ఎఫ్‌డీలు, పీఎఫ్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.  

రిస్కులు లేకుండా నిలకడైన రాబడి అందించే సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంటు కూడా ఒకటి. అత్యంత తక్కువగా రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేసేందుకు ఇందులో వీలుంటుంది. కాబట్టి ఏ ఆదాయవర్గానికి చెందిన వారైనా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఆదాయం పెరిగే కొద్దీ పన్నుల పరిధిలోకి వచ్చినా.. పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్లపై కొన్ని మినహాయింపులూ పొందడానికి వీలుంటుంది. అదే, కాస్త రిస్కు తీసుకోగలిగిన వారు దీర్ఘకాలికంగా ఎక్కువ రాబడులు ఇవ్వగలిగే సత్తా ఉన్న స్టాక్‌మార్కెట్లవైపు చూడొచ్చన్నది నిపుణుల సలహా.
 
ఖర్చులపై అదుపు..

వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి దశలోనూ బడ్జెట్ చాలా కీలకమైనది. కానీ, అప్పుడప్పుడే ఆదాయాలు కళ్లకి కనిపించే ఇరవైలలో నచ్చినది కొనడం తప్ప పొదుపు, బడ్జెట్ మొదలైనవి పెద్దగా పట్టవు. అయితే, ఏది అవసరం ఏది అనవసరం అన్నది తెలుసుకోవడం, ఖర్చులను అదుపు చేసుకోవడం ఎంత ముందుగా నేర్చుకుంటే అంత మంచిది. బడ్జెట్ ప్రాధాన్యాన్ని గుర్తెరగడం ముఖ్యం. బడ్జెటింగ్ కోసం, ఖర్చులను ట్రాక్ చేసేందుకు స్మార్ట్‌ఫోన్లలో ప్రస్తుతం ప్రత్యేకమైన యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మనీవైజ్, మైయూనివర్స్, మనీలవర్ తదితర యాప్స్ ఇందుకు ఉపయోగపడతాయి.
 
అత్యవసర నిధి..

ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం ముంచుకు వస్తుందో చెప్పలేం. సంక్షోభం తలెత్తకుండా ఆపడం మన చేతుల్లో ఎలాగూ ఉండదు కాబట్టి వచ్చినప్పుడు కనీసం ఎదుర్కొనడానికి సరిపడా డబ్బయినా చేతిలో ఉంచుకోగలగాలి. అందుకే అత్యవసర నిధి అంటూ ఒకటి ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. కనీసం, ఆరు నుంచి ఎనిమిది నెలల ఖర్చులకు సరిపడేంత మొత్తం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
 

మరిన్ని వార్తలు