అదుపే పొదుపు

21 Dec, 2015 23:18 IST|Sakshi
అదుపే పొదుపు

ఉమన్ ఫైనాన్స్
 
మహిళలు తమ జీవితంలోని ఎన్నో దశలను విజయవంతంగా దాటుతూ కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. ఆ దశలన్నింటిలోనూ ‘మనీ మేనేజ్‌మెంట్’ ముఖ్యమైనది. కలలు, లక్ష్యాలు ప్రతి గృహిణికీ ఉంటాయి. అయితే కొంతమంది కలలు అలాగే మిగిలిపోతుంటాయి. దీనికి కారణం వారి వారి ఆర్థిక వనరులను సరిగా నిర్వహించకపోవడమే. ప్రతి మహిళా కుటుంబానికి వచ్చే ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడు నిశితంగా ‘అవసరాలను’ గమనించుకుంటూ, ‘కోరికలను’ వాయిదా వేసుకుంటూనో లేదా తగ్గించుకుంటూనో ఉండాలి. తద్వారా అనవసరపు ఖర్చులను తగ్గిస్తూ ఆ మొత్తాలను పొదుపు-మదుపు కోసం కేటాయించవచ్చు. మన జీవన విధానంలో వాడే వస్తూత్పత్తులు, సేవల విషయంలో కొంత జాగ్రత్త, కొన్ని మెళకువలు పాటిస్తే మన వద్ద కొంత మిగులు ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకు కొన్ని  జాగ్రత్తలు తీసుకోవాలి.

కుటుంబానికి అవసరమయ్యే వస్తువుల చిట్టాను ముందుగానే రాసుకోవాలి. దానికి అనుగుణంగా తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు ఎక్కడ దొరుకుతాయో అక్కడ వాటిని కొనుగోలు చేయాలి.ఇప్పటికే కుక్కర్, వాషింగ్‌మెషీన్, మిక్సీ ఇలాంటి వస్తువులను వాడుతుంటే అదనపు ఫీచర్స్ కోసం వాటిని అదే పనిగా మారుస్తూ కొత్తవి కొనడం వల్ల సౌకర్యం పెరిగినా, పొదుపు తగ్గిపోతుందనే విషయం గమనించాలి.ఇంటి భోజనానికి మించినది లేదు. కాని మనలో కొద్దిమంది కుటుంబమంతా కలిసి నెలలో ఎక్కువసార్లు హోటళ్లకు వెళుతుంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యం, పొదుపు ఇబ్బందిలో పడతాయి.
     
అంతగా వాడని, ఎక్కువ కాలం నిరుపయోగంగా ఉండే వస్తువులను తొందరపడి కొనుగోలు చేయకపోవడం మంచిది. ఉదా: ఎక్కువ సామర్థ్యం గల ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్ ఉండగా లాండ్‌లైన్, జిమ్‌కు వెళ్తూ కూడా ఇంట్లో వ్యాయామ పరికరాలు మొదలైనవి. వినోదం, విహారం..  ఉల్లాసాన్ని నింపేవే గాని ఎక్కువసార్లు వాటికి అదే పనిగా డబ్బులు కేటాయిస్తే ఆదాయానికి గండి తప్పదు. బ్లాక్‌లో టిక్కెట్స్ కొన్నా, ప్రయాణానికి తగిన విధంగా ముందుగా ప్లాన్ చేసుకోకున్నా అవి అధిక ధరలతో ఉంటాయి.

నీరు, కరెంటు.. ఇలా ఎన్నో విషయాల్లో కొంతమంది చేసే దుబారా వల్ల వారు ఇబ్బంది పడుతుంటారు, కుటుంబాన్ని, ఇతరులను కూడా ఇబ్బంది పెడుతుంటారు. చిన్న చిన్న విషయాలే కదా అంటే.. చిల్లు చిన్నదైనా నీరు వృథా అవుతుంది కదా! అలాగే ఎంత సంపాదిస్తున్నా ఖర్చు అనే చిల్లు ద్వారా మన ఆదాయం వృథాగా పోతుంది. ఒకవైపు అవసరమైన ఖర్చులకు నగదు కేటాయిస్తూ మరోవైపు అనవసరమైన  ఖర్చులను తగ్గిస్తూ ప్రతి నెల ఆదాయంలో కనీసం 20 నుండి 30 శాతం ‘పొదుపు-మదుపు’ ప్రక్రియకు మళ్లించగలిగితే మన ఆర్థిక లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చు.
 
అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యలు, లేదా ఇతరత్రా ఖర్చులను అధిగమించాలంటే సరియైన భీమా పథకాలను తీసుకుంటూ, 3 నుండి 6 నెలల ఆదాయాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. స్నేహితులను, బంధువులను చూసి భావోద్వేగాలను అదుపు చేసుకోలేక అదే పనిగా వస్తూత్పత్తులు, సేవలు, రుణాలు తీసుకుంటూ వెళితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మన కలలని సాకారం చేసుకోవడం కోసం మన ‘పొదుపు-మదుపు’లను ప్రణాళికాబద్ధంగా కొనసాగించడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందగలుగుతాము.
 
రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’
 

మరిన్ని వార్తలు