ఆ ఒక్క ఆవు

20 Sep, 2018 00:10 IST|Sakshi

చెట్టు నీడ

ఓ గ్రామంలో ఇద్దరు సోదరులు ఉన్నారు. అన్న దగ్గర తొంభై తొమ్మిది ఆవులు, తమ్ముడి దగ్గర ఒకే ఒక్క ఆవు ఉన్నాయి. తమ్ముడు ఆ ఒక్క ఆవు పాలు పితికి ఇంటికి అవసరమైనంత వాడుకుని మిగిలిన వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు గడుపుతున్నాడు. తొంభై తొమ్మిది ఆవులున్న అన్నయ్యకు మాత్రం తన దగ్గరున్న ఆవులకు మరొక ఆవును కలిపి వంద ఆవులకు యజమానిని అని చెప్పుకోవాలని తాపత్రయం. ఇందుకోసం తన తమ్ముడి దగ్గరున్న ఆ ఒక్క ఆవుని సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఓ రోజు తమ్ముడి ఇంటికి వెళ్లాడు. ‘‘తమ్ముడూ.. నీదగ్గరున్న ఆ ఆవు కాస్తా ఉన్నట్టుండి తప్పిపోయిందనుకో ఏం చేస్తావు’’ అని అడిగాడు. అప్పుడు తమ్ముడు.. ‘‘ఏముంది..  కష్టంగానే అనిపిస్తుంది. ఉన్న కాస్త పొలంతోనే సరిపెట్టుకుంటాను’’ అన్నాడు. దాంతో అన్నయ్య ‘‘నిజమేరా నువ్వన్నది. నువ్వు ఒక ఆవును ఉంచుకోవడమూ, అసలు ఆవే లేకపోవడమూ ఒక్కటే.

నన్ను చూడు. తొంభై తొమ్మిది ఆవులున్నాయి కదా, మరొక్క ఆవుగానీ ఉంటే నేను వంద ఆవులకు యజమానినవుతాను. ఆ మాట ఈ ఊళ్లో ఉన్నవారందరూ చెప్పుకోవాలని నా ఆశ’’ అని అన్నాడు. అందుకు ఆ తమ్ముడు ‘‘అవునన్నా.. అప్పుడు నిన్నందరూ వంద ఆవుల యజమాని అంటారు. కనుక నా దగ్గరున్న ఈ ఒక్క ఆవునీ నువ్వే తీసేసుకో.. నిన్నలా అనుకోవడం నాకానందమే’’ అని చెప్పాడు. అందుకోసమే ఎదురుచూస్తున్న అన్న ఎంతో ఆనందించాడు. జెన్‌ గురువులు ఈ కథను చెప్తూ మనిషి మనసు ఇలానే ఆలోచిస్తుంది. తమ దగ్గర ఎంత ఉన్నా సరే,  ఇంకా ఇంకా కావాలనే కోరుకుంటుంది తప్ప తృప్తి పడదు. ఇలాంటి మనసు నరకం లాంటిది. అదే ఉన్న దానితోనే సంతృప్తి పడే వారి మనసు స్వర్గమే అవుతుంది. కాబట్టి మీరు మనసును స్వర్గధామం చేసుకోండి అని వారు చెప్పేవారు. 
– యామిజాల జగదీశ్‌
 

మరిన్ని వార్తలు