కేశ సౌందర్యం

21 Jan, 2016 23:23 IST|Sakshi
కేశ సౌందర్యం

బ్యూటిప్స్

కేశాలకు తగినంత పోషణ, నూనె లేనప్పుడు నిర్జీవంగా మారుతాయి. వీటికి తోడు కేశాలకు ఎక్కువ వేడి తగులుతున్నట్లయితే చివర్లు చిట్లుతాయి. ఈ స్ల్పిట్స్ పోవాలంటే కనీసం నెలకు ఒక రోజు చిట్లిన చివర్లను కత్తిరించుకోవాలి. గోరు వెచ్చని నూనె పట్టించి మర్దన చేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత వీలయినంత వరకు హెయిర్ డ్రైయర్‌లు వాడకపోవడమే మంచిది. రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్ స్పూను ఆముదాన్ని గోరువెచ్చగా చేసి తలకు, జుట్టు చివర్ల వరకు పట్టించి, ఉదయం తలస్నానం చేస్తుంటే కేశాలు తుమ్మెద రెక్కల్లా మారుతాయి.

ఒక టీ స్పూను ఆముదం, అంతే మోతాదులో ఆవనూనె, ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి మర్దన చేసి జుట్టుకంతటికీ చివరి వరకు పట్టించాలి. తరువాత వేడినీటిలో ముంచిన టవల్‌ను తలకు చుట్టి అరగంట తర్వాత తలస్నానం చేస్తుంటే చుండ్రు బాధించదు. ఆలివ్ ఆయిల్ చక్కటి హెయిర్ కండిషనర్. ఒక టేబుల్ స్పూను గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే పొడిబారిన కేశాలు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. ఏ హెయిర్ స్టయిల్ వేసుకోవాలన్నా సాధ్యమవుతుంది. జుట్టు చక్కగా అమరుతుంది. కేశాలు పొడిబారుతుంటే మందార ఆకులను రుబ్బి తలకు ప్యాక్ వేసి తలస్నానం చేయాలి. కరివేపాకులను కాని వాటి రసాన్ని కాని కొబ్బరి నూనెలో వేసి మరిగించి తలకు పెట్టుకుంటే జుట్టు నల్లబడుతుంది. తలస్నానం చేయడానికి ముందు రోజు రాత్రి తాజా కరివేపాకు రసాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి మర్దన చేయాలి. ఇది జుట్టును నల్లబరచడంతోపాటు జుట్టు కుదుళ్లను పటిష్టం చేస్తుంది. దీంతో హెయిర్ ఫాలింగ్ కూడా తగ్గుతుంది. ఆవు పాల వెన్న వాడుతుంటే జుట్టు నల్లబడుతుంది. ప్రతి రోజూ కొద్దిగా ఆవు వెన్నను భోజనంలో తీసుకుంటూ వారానికి రెండు సార్లు వెన్నతో తలకు మసాజ్ చేసుకుంటుండాలి.

 

మరిన్ని వార్తలు