బ్యాండేజీ తీయకుండానే మందులు వేస్తారు!

15 Feb, 2020 11:59 IST|Sakshi

గాయమైనప్పుడు రోజూ కట్టు కట్టించుకోవడం అనేది నరకప్రాయం అంటే అతిశయోక్తి కాదేమో. కట్టు తీసే ధాటికి చర్మంపై ఒత్తిడి పెరిగి విపరీతమైన మంట లేదా నొప్పి ఖాయం. బాగా తీవ్రమైన గాయాలైతే ఒకే మందుతో అది మానదు కూడా. మానుతున్న కొద్దీ మందుల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. అంటే మళ్లీ మళ్లీ కట్టు విప్పాలన్నమాట. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఎంచక్కా బ్యాండేజీ తీయకుండానే కావాల్సిన మందులేసేందుకు హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ శాస్త్రవేత్తలు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. కావాల్సిన మందులు ఉన్న చిన్న చిన్న సంచీలను తొలిసారి కట్టు కట్టేటప్పుడే చర్మంపై ఉంచేయడం ఇందులో ముఖ్యాంశం. ఈ సంచీలన్నింటినీ కలుపుతూ ఓ తీగ ఉంటుంది.

ఈ తీగ సాయంతో ఒక స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ ద్వారా కావాల్సిన మందు సంచీ తెరుచుకునేలా చేయవచ్చు. అది కూడా వైర్‌లెస్‌ పద్ధతిలో అన్నమాట. ఇంకోలా చెప్పాలంటే నర్సు అవసరమే లేకుండా ఎక్కడి నుంచైనా మందు వేయవచ్చునన్నమాట. ఈ పద్ధతిలో మందులు వేయడం సంప్రదాయ పద్ధతుల కంటే చాలా మెరుగైందని, గాయం లోపలికంటా మందులు వెళ్లిపోతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కనెక్టికట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తే ప్రొఫెసర్‌ అలీ తమయోల్‌ అంటున్నారు. మధుమేహంతో బాధపడుతున్న ఎలుకల చర్మం పూర్తిగా §ð బ్బతిన్న గాయాలు కూడా ఈ కొత్త బ్యాండేజీ ద్వారా మెరుగ్గా నయమయ్యాయని ఆయన చెప్పారు. పరిశోధన వివరాలు అడ్వాన్స్‌డ్‌ ఫంక్షనల్‌ మెటీరియల్స్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు