నా ఇంటి ప్రతి ఇటుకలో ఆయన ఉన్నాడు

8 Jul, 2017 01:49 IST|Sakshi
వైఎస్‌ఆర్‌ఆశీస్సులు తీసుకుంటున్న వడ్లోజు

నాది యాదగిరి గుట్ట. గుట్టపైన ఉన్న దేవుడు అంటే నాకు ఎంత భక్తో వై.ఎస్‌. అంటే అంత అభిమానం. ఆ జ్ఞాపకాలే నాకు ఊపిరి. ఆయనపై ప్రేమతో నేను కట్టుకున్న ఇంటి ప్రతి ఇటుక మీద  వై.ఎస్‌.ఆర్‌ లోగో ఉండేలా చూసుకున్నాను. ఆ మహానేత లేకున్నా  జ్ఞాపకాలతో అభిమానిగా జీవిస్తున్నాను. 1984లో నా తొమ్మిదో తరగతి అయ్యాక వై.ఎస్‌.ను చూడాలని ఇంట్లో చెప్పకుండా కడప వెళ్లాను. సార్‌ అక్కడ లేడని చెప్పడంతో పులివెందులకు వెళ్లి ఆయననుకలిశాను.

ఎక్కడ నుంచి వచ్చావు అని నన్ను వివరాలడిగారు. నా తలపై నిమురుతూ అరె... ఇంత దూరం ఎందుకు వచ్చావు... ఎప్పుడు కలవాలన్నా హైదరాబాద్‌లో కలువు అంటూ విజిటింగ్‌ కార్డు ఇచ్చారు. తన పెద్దన్నను పిలిచి రైల్వేస్టేషన్‌కు చేర్చి టికెట్‌ ఇప్పించి పంపమన్నారు. అలా ఆనాటి నుంచి వైఎస్‌ కుటుంబంతో నా అనుబంధం కొనసాగుతోంది. ఆయన వస్తేనే పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టాను. ఆయన రాలేకపోయిన ప్రతిసారి పెళ్లి వాయిదా వేసుకున్నాను. చివరికి ఆయన కేవీపీతో కలిసి వచ్చి రెండు గంటలపాటు నా పెళ్లి పూర్తయ్యే వరకు కూర్చున్నారు. జనం ఎంత మంది ఉన్నా నేను వైఎస్‌ఆర్‌ జిందాబాద్‌ అన్న నినాదం చేయగానే గుర్తించి వెంకట్‌ వచ్చావా అంటూ ఆత్మీయంగా పలకరించేవారు.

ఏం చేస్తున్నావు అంటూ అడిగేవారు. నా ఉపాధి కోసం దేవస్థానంలో దుకాణం ఇప్పించాడు.  2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి వైఎస్‌ సీఎం కావాలని యాదగిరిగుట్ట శ్రీ లకీ‡్ష్మనారసింహస్వామి పాదాల వద్ద రక్తాభిషేకం చేశాను. విషయం తెలిసి నన్ను మందలించారు. ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించినప్పుడు నాలుగు రోజులు నిద్రాహారాలు మాని పావురాల గుట్టలో తిరిగాను. ఆయన మరణం నా గుండెలను పీల్చివేసింది. యాదాద్రి లడ్డూ అంటే ఆయనకు విపరీతమైన ఇష్టం. యాదాద్రి లడ్డూ బాగుందయ్యా అనేవారు.  వై.ఎస్‌.ఆర్‌ చనిపోయినప్పటికీ ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాను.
– వడ్లోజు వెంకటేష్, యాదాద్రి భువనగిరి జిల్లా

మరిన్ని వార్తలు