ఎక్కువ వెయిట్స్ వేసుకుని ఎక్సర్‌సైజ్ చేస్తున్నాను. ఇది మంచిదేనా?

25 Jul, 2013 05:15 IST|Sakshi
 నేను ఇటీవల ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టి  రోజూ క్రమం తప్పకుండా చేస్తున్నాను. కండలు బాగా పెరగాలనే ఉద్దేశంతో ఎక్కువ వెయిట్స్ వేసుకుని ఎక్సర్‌సైజ్ చేస్తున్నాను. ఇది మంచిదేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. 
 - సంతోష్‌కుమార్, కందుకూరు
 
 మీరు రోజూ క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేయడం మంచి విషయం. అయితే మీరు ఎక్కువ బరువులు ఎత్తుతూ, తక్కువ రిపిటీషన్స్‌తో చేసే వ్యాయామం వల్ల కండలు ఆరోగ్యకరంగా పెరగవన్న అంశాన్ని గుర్తుపెట్టుకోండి. హెవీ వెయిట్స్‌తో కండరం మీద భారం పడేలా చేయడం కంటే తక్కువ బరువులతో కండరం అలసిపోయేవరకు ఎక్సర్‌సైజ్ చేయడమే మంచిది. కండరాలు బాగా పెరగాలంటే దానికి మరింత ఎక్కువగా ప్రోటీన్ పొందేలా స్టిమ్యులేట్ చేయాలి. ఇది చేసే క్రమంలో సౌకర్యంగా ఉండేంత బరువును మాత్రమే ఎత్తుతూ... కండరం అలసిపోయేవరకు ఎక్సర్‌సైజ్ చేయడం మంచిది. 
 
కొత్తగా వ్యాయామం మొదలుపెట్టిన చాలామంది మీలాగే కండరాలు త్వరత్వరగా పెరగాలనే ఉద్దేశంతో బరువులను వెంటవెంటనే పెంచుకుంటూ పోతారు. బరువు పెరుగుతున్న కొద్దీ రిపిటేషన్స్ తగ్గుతాయి. దాంతో మీరు ఆశించినట్లుగా కండరం పెరగడం జరగదు. కాబట్టి మీరు చేస్తున్న ఎక్సర్‌సైజ్‌ను కనీసం 20 సార్లు (ఇరవై కౌంట్) చేసేందుకు వీలైనంత బరువును మాత్రమే ఎత్తండి. ఇలా తక్కువ బరువుతో ఎక్కువ కౌంట్ చేయడం వల్లనే కండరం ఆరోగ్యంగా పెరుగుతుందని గుర్తుంచుకోండి.
 
మరిన్ని వార్తలు