స్త్రీలోకం

21 Sep, 2019 01:07 IST|Sakshi

►ఇండోనేషియాలో భర్త నిర్బంధంలో ఉన్న హీనా బేగమ్‌ అనే హైదరాబాద్‌ యువతికి (23) ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం విముక్తిని ప్రసాదించి ఇండియా తీసుకువస్తోంది. తన అల్లుడు తన కూతుర్ని ఇల్లు కదలకుండా చేసి హింసిస్తున్నాడని, అతడి చెర నుంచి విడిపించి ఆమెకు ప్రాణభిక్ష ప్రసాదించాలని హీనా తల్లి చేసిన విజ్ఞప్తిపై తక్షణం స్పందించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ.. ఇండోనేషియా సహకారంతో హీనాను (ఆమె రెండున్నరేళ్ల వయసున్న కొడుకుతో పాటు) భర్త నుంచి కాపాడి ఇండియా విమానం ఎక్కించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది.

►ఆస్ట్రేలియాలో ఉంటున్న బాలీవుడ్‌ నటి ఈషా షర్వాణీ (34)తో ఆదాయం పన్ను అధికారులం అంటూ మోసపూరితమైన ఫోన్‌ సంభాషణలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమె అకౌంట్‌ నుంచి మూడు లక్షల రూపాయలను ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు! అరెస్టు నుంచి తప్పించుకోడానికి పెనాల్టీ కట్టాలని వారు చెప్పడంతో ఈషా తన మేనేజర్‌తో చేత ఆన్‌లైన్‌లో అంత మొత్తాన్నీ వారికి బట్వాడా చేయించారు. ఆ తర్వాత కొద్దిగంటలకే మోసం బయటపడి, పోలీసులకు చిక్కిన ఆ ముగ్గురూ భారతీయులే కావడం విశేషం.

►నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించిన వెబ్‌ సిరీస్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌’లో కథానాయికగా నటించిన రాధికా అప్టే ‘బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ యాక్ట్రెస్‌’ కేటగిరీ కింద ‘ఎమ్మీ’ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. సెప్టెంబర్‌ 23న లాస్‌ ఏంజిల్స్‌లోని మైక్రోసాఫ్ట్‌ థియేటర్‌లో విజేతలను ప్రకటిస్తారు. టీవీ కార్యక్రమాలకు, టీవీ నటీనటులు, సాంకేతికనిపుణులకు గత 70 ఏళ్లుగా ఎమ్మీ అవార్డులు ఇస్తున్నారు

►పాకిస్తాన్‌లో మానవ హక్కుల కార్యకర్త గులాలై ఇస్మాయిల్‌ ప్రాణాపాయంలో పడ్డారు. దేశంలో మహిళలపై హింస ఎక్కువైందని, బలవంతపు పెళ్లిళ్లు, పరువు హత్యలు జరుగుతున్నాయని ఆరోపణలు చేసి ‘దేశంలో హింసను ప్రేరేపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకి’గా ముద్ర పడిన గులాలై తాజాగా పాక్‌ సైన్యం దురాగతాలపై నోరు విప్పడంతో ఆమెకు, ఆమె కుటుంబానికి వేధింపులు, బెదరింపులు మొదలయ్యాయి. దాంతో గులాలై దేశం విడిచి యు.ఎస్‌. పారిపోయారు.

►జయలలిత జీవిత చరిత్రపై వస్తోన్న ‘తలైవి’ చిత్రం కోసం జయలలితగా నటిస్తోన్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు లాస్‌ ఏంజిల్స్‌లోని జేసన్‌ కాలిన్స్‌ స్టుడియోలో ఆ చిత్ర సాంకేతిక నిపుణులు ‘ప్రోస్థెటిక్‌ మెజర్‌మెంట్స్‌’ (కృత్రిమ ఆకృతి కొలతలు) తీసుకుంటున్నారు. కంగనాను అచ్చు జయలలితలా మలిచేందుకు ఈ కొలతలు ఉపయోగపడతాయి. తమిళ్, తెలుగు, హిందీ మూడు భాషల్లో చిత్ర నిర్మాణం జరుగుతోంది. దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా