తల్లి రుణం

15 Mar, 2019 02:13 IST|Sakshi

చెట్టు నీడ 

‘‘ప్రవక్తా వృద్ధాప్య భారంతో నడవలేక మంచానికే పరిమితమైన మా అమ్మను నా భుజాలపై కూర్చోబెట్టుకుని హజ్‌ యాత్ర చేశాను. మా అమ్మ రుణాన్ని తీర్చుకున్నట్లేనా’’ అని అతడు అడిగాడు.

ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (సఅసం) తన సహచరులతో ఏదో పనిలో నిమగ్నమై ఉన్నారు. అటుగా ఒక మహిళ ప్రవక్త (స) వారి సమక్షంలోకి వచ్చింది. వెంటనే ప్రవక్త (స) లేచి నిలబడి తన భుజంపై ఉన్న దుప్పటిని తీసి పరిచి ఆమెను కూర్చోబెట్టారు. ఆమెతో ఎంతో గౌరవభావంతో మాట్లాడారు. ఒక సహచరుడు అక్కడున్న వారితో ఆమె ఎవరా అని అడగ్గా ప్రవక్త (స)కు పాలుపట్టిన తల్లి అని మరో సహచరుడు చెప్పారు. ప్రవక్త (స) మాతృమూర్తి ఆయన బాల్యంలోనే కన్నుమూశారు. ఆయనను దాయీ హలీమా అనే మహిళ పాలు పట్టి పెద్దచేశారు. పాలుపట్టిన తల్లిని చూడగాలే లేచి నిలబడటం, ఆమెకు తన భుజంపై దుప్పటిని తీసి పర్చి కూర్చోబెట్టడం ఎంతో ఆదర్శనీయం.ఒకసారి ప్రవక్త (స) సమక్షంలోకి ఆయన అనుచరుడు వచ్చి ‘‘ప్రవక్తా వృద్ధాప్య భారంతో నడవలేక మంచానికే పరిమితమైన మా అమ్మను నా భుజాలపై కూర్చోబెట్టుకుని హజ్‌ యాత్ర చేశాను. మా అమ్మ రుణాన్ని తీర్చుకున్నట్లేనా’’ అని అడిగాడు.

దానికి ప్రవక్త ‘‘మీ అమ్మ నిన్ను ప్రసవిస్తున్నప్పుడు బాధ భరించలేక పెట్టిన ఒక్క కేక రుణం కూడా తీరలేదు’’ అని చెప్పి పంపారు.పై రెండు సంఘటనలతో తల్లి స్థానం ఎంత గొప్పదో బోధపడుతుంది.ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (స) సతీమణి హజ్రత్‌ ఆయిషా (రజి) దగ్గరికి ఒక మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను వెంటపెట్టుకొని వచ్చింది. ఎన్నో రోజులుగా పస్తులున్నామని, తన ఆకలి బాధను తెలియజేసిందా మహిళ. అప్పుడు ఆయిషా (రజి) ఇంట్లో తినడానికి ఏమీలేవు ఒకే ఒక్క ఖర్జూరం పండు తప్ప. ఆ ఖర్జూరాన్ని ఆయిషా (రజి) ఆమెకు అందించారు. ఆ మహిళ ఆ ఖర్జూరాన్ని అందుకొని రెండు సమాన భాగాలు చేసి తన ఇద్దరు కూతుళ్లకు పంచి తాను మాత్రం పస్తులుండిపోయింది. ఈ వృత్తాంతాన్ని ఆయిషా (రజి) ఆమె భర్త ముహమ్మద్‌ (స) ఇంటికి రాగానే వినిపించారు. అప్పుడు ప్రవక్త (స) ఆ మహిళ త్యాగాన్ని ఎంతగానో ప్రశంసించారు. ‘‘తాను పస్తులుండి తన ఆడ పిల్లల ఆకలి తీర్చిన ఆ మహిళకు ఆ ఆడ పిల్లలే నరకానికి అడ్డుగోడలవుతారు. స్వర్గానికి బాటలవుతార’ని ప్రవక్త చెప్పారు. 
ముహమ్మద్‌ ముజాహిద్‌ 

>
మరిన్ని వార్తలు