సమ్మర్‌ క్విజ్‌

2 Mar, 2017 00:49 IST|Sakshi
సమ్మర్‌ క్విజ్‌

పిల్లలకు పరీక్షలు సమ్మర్‌లో ఎలాగూ ఉంటాయి. టీచర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. సమాధానాలు ఇవ్వడానికి మన పిల్లలు తపస్సు కంటే తక్కువేమీ చెయ్యరు. ‘‘అసలు తపస్సెందుకు? బాగా చదువుకుంటే ఈజీగానే రాయొచ్చు కదా’’ అని పేరెంట్స్‌ అంటారు. అయితే ఈ సమ్మర్‌ క్విజ్‌లో ఎంత మంది పేరెంట్స్‌ పాసవుతారో చూద్దాం.

25 ప్రశ్నల్లో 15కు సరైన సమాధానాలిస్తే యావరేజ్‌.
20 సమాధానాలు ఇస్తే గుడ్‌.
25కు 25 ఇస్తే ఎక్సలెంట్‌!


1. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అసౌకర్యంగా ఫీలవుతుంటాం. ఎందుకు?
మన శరీర నార్మల్‌ ఉష్ణోగ్రత 98.4 ఫారన్‌హీట్‌. ఆ ఉష్ణోగ్రత వద్ద జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతుంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నా మన శరీర ఉష్ణోగ్రత స్థిరంగా 98.4 ఫారెన్‌హీట్‌ ఉంటుంది. అలాగే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా మన ఒంటి వేడి అంతే ఉంటుంది. ఏ సీజన్‌లోనైనా శరీర ఉష్ణోగ్రత ఒకేలా ఉంచే బాధ్యతలను మెదడులోని హైపోథలామస్‌ నిర్వహిస్తుంటుంది. అయితే వేసవిలో కొన్నిసార్లు ఎండ పెరుగుతూ పోతున్న కొద్దీ మన ఒంటి ఉష్ణోగ్రత 99.9 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరే అవకాశం ఉంది. అలా ఉష్ణోగ్రతల స్థాయి మించితే జ్వరంగా పరిగణిస్తుంటారు. వైద్య పరిభాషలో ‘హైపర్‌థెర్మియా’ అనవచ్చు. మనం ముందుగానే అనుకున్నట్లుగా శరీర సాధారణ ఉష్ణోగ్రత వద్ద మనలోని జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి. కానీ ‘హైపర్‌థెర్మియా’లో అలా జరగదు. కాబట్టి మనకు నీరసంగా, నిస్సత్తువగా, చికాకుగా ఉంటుంది.  

2.ఎండవేడిమితో జ్వరం వస్తే ఏంచేయాలి?
ఒళ్లు సాధారణ వేడి కంటే ఎక్కువగా ఉంటే... జ్వరం మందులు, తగిన విశ్రాంతి, ద్రవాహారాలతో నార్మల్‌కు తీసుకువస్తారు.

3.ఈ సీజన్‌లో మజిల్‌ క్రాంప్స్‌ ఎందుకు వస్తుంటాయి?
మన కండరాలు సక్రమంగా పనిచేసేందుకు ఖనిజాలు, లవణాలు, నీరు సమపాళ్లలో అవసరం. అయితే వేసవిలో మన ఒళ్లు వేడెక్కకుండా చూసేందుకు, మన ఒంటి ఉష్ణోగ్రత సమపాళ్లలో ఉండేలా చూసేందుకు ఒంటి నుంచి చెమట స్రవిస్తుంది. ఒంటిపై విస్తరించిన ఈ చెమట ఆవిరైపోయే క్రమంలో ఒంటి నుంచి ఉష్ణోగ్రతను తీసుకెళ్తుంది కాబట్టి ఒళ్లు చల్లబడుతుంది. అయితే ఇలా చెమట పట్టే క్రమంలో కేవలం నీళ్లు మాత్రమే కాకుండా... మన ఒంట్లోంచి మెగ్నీషియమ్, పొటాషియమ్‌ వంటి లవణాలు కూడా బయటకు వెళ్తాయి. వాటి స్థాయులు తగ్గడం వల్ల కండరాలు బిగుసుకుపోతాయి. ఎండలో క్రికెట్‌ ఆడే సమయంలో ఒంట్లోంచి చెమటలతో పాటు లవణాలు పోవడం వల్ల పెద్ద పెద్ద ఆటగాళ్లు కూడా కాళ్లు, పిక్కలు పట్టేసి, ఆడలేకపోవడాన్ని చూస్తుంటాం. మజిల్‌ క్రాంప్స్‌ని నివారించడానికి రోజూ 8 – 12 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. లవణాలను భర్తీ చేసుకోడానికి మెగ్నీషియమ్, పొటాషియమ్‌ వంటివి పుష్కలంగా ఉండే అరటిపండ్లు, కొబ్బరిబొండాలు తీసుకోవాలి. చల్లటి ప్రదేశంలో ఉంటే ఒంట్లోంచి నీళ్లు కోల్పోవడం జరగదు. అలా డీ–హైడ్రేషన్‌ను నివారించడం వల్ల మజిక్‌ క్రాంప్స్‌ను కూడా నివారించవచ్చు.

4.ఈ సీజన్‌లో ద్రవాహారం ఎందుకు ప్రిఫర్‌ చేస్తుంటారు?
ముందుగా చెప్పినట్లుగా ఈ వాతావరణంలో కండరాలు బిగుసుకుపోవడం (మజిల్‌క్రాంప్స్‌)తోపాటు శరీర జీవక్రియలకూ ఆటంకం కలుగుతుంది. అందుకే... ఒంటికి తగినన్ని నీళ్లు, ఖనిజ లవణాలూ అందాలి. కాబట్టి ద్రవాహారం, పండ్లరసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తాగాలి.

5. తీసుకోకూడని ద్రవాహారాలు కూడా ఉంటాయా?
టీ, కాఫీలు, కెఫిన్‌ పాళ్లు ఎక్కువగా ఉండే  కూల్‌డ్రింక్స్‌. అవి ద్రవరూపంలో ఉన్నప్పటికీ డీ–హైడ్రేషన్‌కు దారి తీస్తాయి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చినా చాలా మితంగా తీసుకోవాలి. ఇక ఆల్కహాల్‌ అయితే ఒంట్లోని నీళ్లను విపరీతంగా తోడేస్తుంది.  

6.ఒళ్లు మరీ వేడెక్కిపోయినప్పుడు జరిగే అనర్థాలేమిటి?
ఇప్పటికే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఎండలో ఎక్కువ సేపు ఉంటే ఒంట్లోని నీరు ఆవిరై పోయి తలనొప్పి, వికారం (నాసియా), వాంతులురావచ్చు. నాడి వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగం పెరగడం (ఆయాసం), అయోమయం, కొద్దిపాటి విషయాలకే అతిగా ఉద్రేకపడటం, మాట ముద్దగా రావడం, స్పృహ తప్పడం వంటివి జరగవచ్చు. కొందరిలో ఫిట్స్‌ రావడం వంటి తీవ్రమైన పరిణామాలూ సంభవించవచ్చు.  

7. జ్వరాన్ని తగ్గించుకోవడం ఎలా?
ఒళ్లు బాగా వేడెక్కినప్పుడు ఆ వ్యక్తిని చల్లగా ఉన్న చోటికి తరలించాలి. చల్లటి నీళ్లలో ముంచిన టవల్‌తో ఒంటిని తుడవాలి. మెడ, బాహుమూలాలు, గజ్జలలో తడి గుడ్డ వేయాలి. తగినన్ని నీటిని తాగించాలి.

8. వేసవిలో చన్నీళ్ల స్నానం మంచిదేనా?
మంచిదే. చన్నీళ్ల వల్ల చర్మం చల్లబడగానే ఆ ప్రాంతాలను వెచ్చబరచడానికి రక్తప్రసరణ పెరుగుతుంది. ఇది గుండె పంపింగ్‌ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అలాగని నీళ్లు మరీ చల్లగా ఉండరాదు. గోరువెచ్చగా ఉండాలి.

9.డీహైడ్రేషన్‌కు గురైతే సమస్యలేమిటి?
డీహైడ్రేషన్‌కు గురైతే కండరాలు బిగుసుకుపోవడం, మూత్రసంబంధమైన సమస్యలు, కిడ్నీ దెబ్బతినడం, ఫిట్స్‌ రావడం, స్పృహతప్పిపడిపోవడం వంటివి జరుగుతాయి.

10.కార్డియాలజీ, హైబీపీ, డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి వేసవిలో జాగ్రత్తలు?
కార్డియాలజీ, హైబీపీ, డయాబెటిస్‌తో బాధపడేవారు... మరింత నీరు నష్టపోకుండా చూసుకోవాలి. ఇది వారి ప్రధాన జాగ్రత్త. వాళ్లు ఈ సీజన్‌లో పొటాషియమ్‌ ఎక్కువగా ఉండే పండ్లను మితంగా తీసుకోవాలి.

11. వేసవిలో దోమలూ పెరుగుతాయి. ఈ డబుల్‌ డేంజర్‌ని అధిగమించడం?
చిన్న నీటి గుంత ఉన్నా దోమలు గుడ్లు పెడతాయి. అందుకే ఇంటి చుట్టూ తాగేసిన కొబ్బరి బొండాలు, టైర్ల వంటివి లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. కిటికీలకు, డోర్స్‌కు మెష్‌ అమర్చుకోవాలి. ఇంకా అవసరమైతే మస్కిటో రిపల్లెంట్స్‌ వాడాలి.

12.అసలే ఉక్క. పైగా తలపై హెల్మెట్‌... తప్పదా?
హెల్మెట్‌... ప్రాణరక్షణ కల్పించే ఉపకరణం. వేసవి నెపంతో దాన్ని వాడకపోవడం సరికాదు. హెల్మెట్‌ ఎండదెబ్బ నుంచి కూడా రక్షణనిస్తుంది. తక్కువ బరువుండే హెల్మెట్‌లు లేదా ఇటీవల వస్తున్న గాలి తగిలే బ్రీతింగ్‌ హెల్మెట్స్‌ వాడవచ్చు.

13.ఈ సీజన్‌లో చంకలు, గజ్జల్లో జబ్బులు పెరుగుతాయా?  
చంకలు, గజ్జల వంటి శరీర భాగాల్లో చర్మం ముడుతలు పడుతుంది, గాలి ధారాళంగా చేరదు, తడి పూర్తిగా ఆరదు. దాంతో ఫంగస్‌ అభివృద్ధి అయ్యి... గడ్డలు, ఫాలిక్యులైటిస్, లింఫెడినైటిస్, ఇన్ఫెక్షన్స్, ర్యాష్‌ వస్తుంటాయి. అందుకే ఈ సీజన్‌లో ఒంటికి అతుక్కుపోయినట్లుగా ఉండే దుస్తులను వేసుకోవద్దు. చెమ్మను పీల్చుకునే కాటన్‌ దుస్తులు మేలు. ఒంటికి సరిపడే పౌడర్‌ను వాడటం కూడా మంచిదే.

14.వేడి వల్ల గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యలు ఉంటాయా?
వేసవిలో సాధారణంగా ఆకలి మందగించి, దాహం పెరుగుతుంది. దాహార్తి తీర్చుకునే ప్రయత్నంలో బయట అపరిశుభ్రమైన ద్రవాలను తీసుకుంటే నీళ్ల విరేచనాలకు దారితీయవచ్చు. వేడిమి వల్ల కలిగే డీ–హైడ్రేషన్‌కు నీళ్ల విరేచనాలు తోడయితే దేహం విపరీతంగా నీటిని కోల్పోతుంది.

15.మరి వాటిని అధిగమించడం ఎలా?
►వేసవిలో చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు భోజనం తినాలి
►మసాలా ఆహారం బాగా తగ్గించాలి ∙ఆకుకూరలు, తాజాపండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి ∙జీర్ణక్రియకు ఉపయోగపడే మెంతులు, సోంపు గింజలు, కొత్తిమీర, అల్లం ఎక్కువగా వాడాలి.

16.మైగ్రేన్‌ తలనొప్పి ఎక్కువయ్యే అవకాశాలుఉన్నాయా?
అవును... అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చే మార్పు మైగ్రేన్‌కు ట్రిగరింగ్‌ ఫ్యాక్టర్‌. అందుకే ఈ సీజన్‌ మైగ్రేన్‌ ఉన్నవారికి శాపంగా మారవచ్చు. అందుకే మైగ్రేన్‌ ఉన్న వారు బయటికి వెళ్లేటప్పుడు డార్క్‌ సన్‌ గ్లాసెస్‌ లేదా హ్యాట్స్‌ వాడాలి.

17. పాదరక్షల విషయంలో జాగ్రత్తలు?
ఫుల్‌షూస్‌ తొడుక్కుంటే చెమట బాధిస్తుంటుంది. నైలాన్‌ సాక్స్‌ వేసుకుంటే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, సెగ గడ్డలు రావచ్చు. అందుకే ఈ సీజన్‌లో ఫ్లిప్‌ ఫ్లాప్‌ షూస్, సాఫ్ట్‌ సోల్‌ పాదరక్షలు ధరించాలి. ఫుల్‌షూ ధరిస్తే, శుభ్రమైన కాటన్‌ సాక్స్‌ వాడాలి.

18.చలవ కళ్లజోడు షేడ్స్‌ డార్క్‌గా ఉండటం వల్ల కనుపాపను మరీ విప్పార్చుకుని చూస్తాం. దాంతో కంట్లోకి మరింత రేడియేషన్‌ వెళ్లడం నిజమేనా?
అల్ట్రా వయొలెట్‌ రేడియేషన్‌ను తగ్గించేందుకు అవసరమైన సన్‌ గ్లాసెస్‌ వాడటం వల్ల ఎలాంటి హాని ఉండదు. అయితే అసలే వెలుగును ప్రసరింపజేయని మెర్క్యురీ గ్లాసెస్, నాణ్యత లేని అద్దాలు వద్దు.

19.ఎండాకాలం నల్లబడకుండా ఉండాలంటే?
బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. ఇంట్లో ఉన్నా సరే... డాక్టర్‌ సలహా మేరకు మీ ఒంటికి సరిపడే సన్‌స్క్రీన్‌ రాస్తే మేలు.

20.ఇళ్లలో ఉన్నా వేడిమి అనర్థాలు తప్పవా? వాటిని తప్పించుకోవడం ఎలా?
వాతావరణంలో వేడిమి ఇంట్లోనూ ప్రభావం చూపుతుంది. ఆర్థిక స్తోమతను బట్టి గది చల్లగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుని సమశీతోష్టంగా ఉంచుకోవాలి. కిటికీలకు వట్టివేళ్లు, నేరుగా సూర్యకిరణాలు రాకుండా కర్టెన్లు అమర్చుకుంటే వేసవి అనర్థాలను తప్పించుకోవచ్చు.

21.దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవారు ఏమైనా జాగ్రత్తలు పాటించాలా?
వేసవిలో తాపానికి తగినంతగా తినకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో నీళ్ల పాళ్లు ఎక్కువగా ఉండే సుమతులాహారం తీసుకోవాలి. పుచ్చ, దోస, కీర వంటివి తీసుకోవడం ద్వారా రోగనిరోధకశక్తి తగ్గకుండా చూసుకోవాలి.

22.వేసవిలో వర్కవుట్స్‌ ఎలా ఉండాలి?
వేసవిలో వర్కవుట్స్‌ మానాల్సిన అవసరం లేదు. నేరుగా ఎండ పడే చోట, ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వర్కవుట్స్‌ చేయరాదు. చల్లటి వేళ వ్యాయామం చేయవచ్చు, స్విమ్మింగ్‌ చేయవచ్చు. అయితే మధ్యాహ్నం స్విమ్మింగ్‌ చేయవద్దు. ఇండోర్‌ జిమ్‌ లేదా స్విమ్మింగ్‌ పూల్‌ను ఎంచుకోవాలి.

23.పోలీసులు, గృహనిర్మాణ రంగం, ఫీల్డ్‌ వర్కర్లు వంటి ఎండలో తిరగాల్సిన వారికి జాగ్రత్తలు?
ఎండలో బయటకు వెళ్లే వారు నాణ్యమైన కళ్లజోడుతోపాటు చర్మానికి సన్‌స్క్రీన్‌ వాడాలి. ఒళ్లంతా కప్పి ఉంచే కాటన్‌ దుస్తులను ధరించాలి. ∙మరీ సుదీర్ఘంగా ప్రయాణం చేయకుండా, మధ్య మధ్య కొంత బ్రేక్‌ తీసుకోవాలి. ∙చల్లటి మంచినీళ్ల బాటిల్‌ వెంట ఉంచుకోవాలి.

24.గొడుగు గుడ్డ నల్లరంగులోనే ఉండటం వల్ల ప్రత్యేక ప్రయోజనం ఉంటుందా?
కాంతిలో ఏడు రంగులు ఉంటాయి. ఈ ఏడు రంగులకూ వేర్వేరు ఫ్రీక్వెన్సీ ఉండటం వల్ల ఇవి ఏర్పడతాయి. అలా రేడియేషన్‌ ద్వారా కాంతిలోని ఆ ఏడు రంగులూ కలగలసి ప్రయాణం చేస్తాయి. ఈ క్రమంలో  నల్లటి వస్తువు (బ్లాక్‌ బాడీ) కాంతిలోని అన్ని ఫ్రీక్వేన్సీలనూ తనలో ఇముడ్చుకుంటుంది. అందుకే అన్ని రేడియేషన్‌లనూ ఇముడ్చుకునే వస్తువును బ్లాక్‌ బాడీ అంటారు. అదే తెల్ల వస్తువు... అన్ని రేడియేషన్లనూ వెనక్కు మళ్లేలా రిఫ్లెక్ట్‌ చేస్తుంది. గొడుగుకు నల్ల గుడ్డ ఉపయోగిస్తే... కాంతి నుంచి వచ్చే ప్రతి కిరణపు రేడియేషన్‌ను ఆ గుడ్డ పూర్తిగా గ్రహిస్తుంది. కాబట్టి రేడియేషన్‌ అంతకంటే కిందికి ప్రవహించదు.

25.బయటి నుంచి ఇంట్లోకి రాగానే నీళ్లు తాగకూడదంటారు. అది అపోహేనా?
బయటి నుంచి లోపలికి రావడం అంటే... ముందుగా చెప్పినట్లుగా ఆ సమయంలో మన నాడి కాస్త వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. మన శ్వాసక్రియలు, గుండె వేగం కూడా కాస్త ఎక్కువే. అందుకే అవి ఒకింత నెమ్మదించాక నీళ్లు తాగడం మంచిది.
డాక్టర్‌ వేదశ్వి రావు వెల్చాల
కన్సల్టెంట్‌ – ఇంటర్నల్‌ మెడిసిన్
కిమ్స్‌ హాస్పిటల్స్, కొండాపూర్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు