గుండెపోటును గుర్తుపట్టడం ఎలా?

20 Jan, 2017 00:33 IST|Sakshi
గుండెపోటును గుర్తుపట్టడం ఎలా?

హెపటైటిస్‌–బి అంటున్నారు...చికిత్స లేదా?
నా వయసు 23 ఏళ్లు. నేను ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాను. రొటీన్‌ హెల్త్‌ చెక్‌అప్‌లో భాగంగా నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. అయితే వాటికి సంబంధించిన రిపోర్టులలో నాకు హెపటైటిస్‌–బి ఉన్నట్లు తేలింది. అసలు నాకు ఈ అనారోగ్య సమస్య రావడానికి కారణమేమిటి? దీనివల్ల నాకేమైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా? నా సమస్యకు శాశ్వతమైన చికిత్స అందుబాటులో ఉందా? మానసికంగా కుంగిపోతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చూపండి.
– అజయ్‌కుమార్, హైదరాబాద్‌
హెపటైటిస్‌–బి అనేది ఒక వైరస్‌ వల్ల వచ్చే వ్యాధి. ఇది నేరుగా మన శరీరంలోని కాలేయంపై ప్రభావం చూపుతుంది. నిజానికి ఈ అనారోగ్యానికి గురైనప్పటికీ... అంటే శరీరంలో వైరస్‌ ఉన్నప్పటికీ వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశాలు చాలా తక్కువ. ఇది వైరస్‌ ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి వ్యాధి సోకిన వారి నుంచి ఇది మీకు సంక్రమించి ఉంటుంది. ఒకవేళ ఏదైనా లక్షణాలు కనిపించినప్పటికీ అవి సాధారణ జ్వరం, ఫ్లూ లాగే అనిపిస్తాయి. కాబట్టి నిర్దిష్టంగా వైద్య పరీక్షలలో తేలినప్పుడు తప్ప, అది హెపటైటిస్‌–బి అని చెప్పడం కష్టమవుతుంది. ఇక మీకు హెపటైటిస్‌–బి సోకినప్పటికీ మీరు ఎలాంటి మానసిక ఆందోళనకు గురి కానవసరం లేదు. కాకపోతే మీరు ‘లివర్‌ పనితీరు’, అల్ట్రాసౌండ్‌ అబ్డామెన్‌ లాంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే హెపటైటిస్‌–బి ప్రొఫైల్‌లో డీఎన్‌ఏ ఆధారిత పరీక్ష చేయించుకోవడం ద్వారా మీ శరీరంలో వైరస్‌ క్రియాశీలతను అంచనా వేయవచ్చు. దాదాపు 60 శాతం పేషెంట్లలో ఈ వైరస్‌ సాధారణ స్థాయిలో ఉండడం వల్ల కేవలం టాబ్లెట్స్‌తోనే వ్యాధి నయమవుతుంది.

ప్రస్తుతం ఈ వ్యాధికి మంచి వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. దీనికి వ్యాక్సిన్‌తో కట్టడి చేయవచ్చని మీరు గుర్తుంచుకోండి. మీరు వెంటనే డాక్టర్‌ను కలిసి, తగిన చికిత్స తీసుకోండి. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా హెపటైటిస్‌–బి నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం మంచిది. తద్వారా భవిష్యత్తులో ‘హెపటైటిస్‌–బి’ వైరస్‌ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రాకుండా ముందే జాగ్రత్త వహించవచ్చు.
డా. రవిశంకర్‌ రెడ్డిగ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,మ్యాక్స్‌క్యూర్‌హాస్పిటల్స్,సెక్రటేరియట్,హైదరాబాద్‌

గుండెజబ్బును ముందుగా తెలుసుకొనేదెలా?
మా నాన్నగారి వయసు 49 ఏళ్లు. ఈ మధ్య అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కొద్దిసేపట్లోనే కన్నుమూశారు. ఆయనకు ఇదివరకు ఎలాంటి గుండెజబ్బుల లక్షణాలు కూడా కనిపించలేదు. గుండెజబ్బును ముందుగానే తెలుసుకోవడం ఎలా?  
– చిన్నారావు, అమలాపురం
మీ నాన్నగారికి వచ్చిన గుండెపోటును సడన్‌ కార్డియాక్‌ డెత్‌ లేదా సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ అంటారు. అప్పటివరకు చురుకుగా పనిచేసిన మనిషి... హఠాత్తుగా గుండెపట్టుకుని విలవిలలాడుతూ పడిపోవడం, కుటుంబ సభ్యులో, స్నేహితులో తక్షణం ఆసుపత్రికి తరలించే లోపే మనకు దక్కకుండా పోవడం వంటి ఉదంతాలు  సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ జరిగినప్పుడు కనిపిస్తాయి.
ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది?
గతంలో ఒకసారి గుండెపోటు బారిన పడ్డవారు
గుండె కండరం బలహీనంగా ఉన్నవారు
కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర ఉన్నవారు
కుటుంబంలో గుండె విద్యుత్‌ సమస్యలు ఉన్నవారు
గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు
పైన పేర్కొన్న వారితో పాటు ఇప్పటికే గుండెజబ్బు తీవ్రంగా ఉన్నవారిలో కూడా అకస్మాత్తుగా మరణం సంభవించవచ్చు.
రక్షించే అవకాశం ఉంది!
గుండెపోటు అన్నది క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లిపోయే సమస్య.  అయితే ఎవరికైనా గుండెపోటు వస్తున్న ఘడియల్లో తక్షణం స్పందించి వారిని వేగంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లగలిగితే వారిని రక్షించే అవకాశాలూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ హార్ట్‌ ఎటాక్‌ పై అవగాహన కలిగి ఉంటే మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహనను పెంచుకోవాలి.

గుండెపోటును గుర్తుపట్టడం ఎలా?
ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే... వెంటనే వాళ్లు స్పృహలో ఉన్నారా, శ్వాస తీసుకుంటున్నారా లేదా అన్న అంశాలను చూడాలి. అవసరాన్ని బట్టి గుండె స్పందనల్ని పునరుద్ధరించే ప్రథమ చికిత్స (కార్డియో– పల్మనరీ రిససియేషన్‌–సీపీఆర్‌) చేయాలి. సీపీఆర్‌ వల్ల కీలక ఘడియల్లో ప్రాణం పోసినట్లు అవుతుంది. చాలా దేశాల్లో సీపీఆర్‌పై శిక్షణ ఉంటుంది. గుండె స్పందనలు ఆగిన వ్యక్తికి  సీపీఆర్‌ ఇచ్చి అంబులెన్స్‌ వచ్చే వరకు రక్షించగలిగితే దాదాపు కోల్పోయిన జీవితాన్ని నిలబెట్టినట్లవుతుంది.  అందుకే సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వడం, ఆ ప్రక్రియపై అవగాహన కలిగించడం అవసరం.
డాక్టర్‌ హేమంత్‌ కౌకుంట్ల కార్డియో థొరాసిక్‌ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌.

మరిన్ని వార్తలు