పిల్లలకు దేశభక్తి కధలు

15 Aug, 2015 00:51 IST|Sakshi
పిల్లలకు దేశభక్తి కధలు

‘మం చి’   ఎ జెండా
 
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మంచివోయ్...
అనే కొత్త పాఠానికి ఎంతోమంది గురువులు.
వాళ్ల కథలే... మచ్చుకు ఇవి కొన్ని.
మన పిల్లలకు స్ఫూర్తినివ్వాలని...
నిజమైన స్వాతంత్య్రం స్వార్థం నుంచి విముక్తేనని...
అందమైన స్వేచ్ఛ... పంచుకోవడంలో ఉందని...
దేశం కోసం పోరాటం కిసాన్‌లు, జవాన్‌లే కాదు...
ఇన్సాన్‌లు కూడా చెయ్యొచ్చని చెప్పడానికే... ఈ మంచి కథలు.
మంచితనం ఎంత నలిగితే అంత మంచిది.
ఎంత అరిగితే అంత మంచిది.
రేపటి భారతదేశానికి రెపరెపలాడే ఊపిరే మన ‘మంచి’ పిల్లలు.
మంచితనానికి గులామ్ అవడమే దేశభక్తికి సలామ్ కొట్టడం.
 

 చిన బాలశిక్ష
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో బాబర్ అలీ అప్పట్లో తొమ్మిదేళ్ల చిన్నారి. స్కూలు నుంచి వస్తున్నప్పుడు పొలాల్లో పనులు చేసే తన ఈడు పిల్లలను గమనించాడు. వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. సొంతగా స్కూలు పెట్టాడు. తాను స్కూలు నుంచి రాగానే, ఆ పిల్లలను పోగేసి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. తన ఇంట్లో జామచెట్టు కింద పెట్టిన ఆ స్కూలు నిర్వహణ కోసం పాకెట్ మనీ ఖర్చు చేసేవాడు. పన్నెండేళ్ల కిందట మొదలైన ఆ స్కూలులో ఇప్పుడు 300 మంది చదువుకుంటున్నారు. ఆ స్కూలులో ఫస్ట్‌బ్యాచ్ విద్యార్థుల్లో ఆరుగురు ఇప్పుడు అందులోనే పాఠాలు చెబుతున్నారు. ‘చిన బాలశిక్ష’ను బోధించిన బాబర్ అలీకి జైహింద్ చెబుదాం.
     
ఆపద్బాంధవులు... ఆ టీటీఈలు!
ఆగస్టు 4... మంగళవారం అర్ధరాత్రి. మధ్యప్రదేశ్‌లో వంతెన దాటుతున్న రెండు రైళ్లు నిమిషాల వ్యవధిలో పట్టాలు తప్పాయి. ఈ సమాచారం తెలియగానే  ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) వద్ద కలకలం రేగింది. ప్రమాదం పాలైన రెండు రైళ్లలో ఒకటైన కామాయని ఎక్స్‌ప్రెస్ మంగళవారం మధ్యాహ్నమే ఎల్టీటీ నుంచి బయలుదేరి వెళ్లింది. రెండో రైలు జనతా ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం అక్కడకు చేరాల్సి ఉంది. ఆ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి క్షేమ సమాచారం కోసం వారి బంధువులంతా ఎల్టీటీ వద్దకు వెల్లువెత్తారు. పరిస్థితి గమనించిన ఇద్దరు టీటీఈలు..ఏకే సిన్హా, ఆర్.శర్మ అప్పటికప్పుడే తాత్కాలిక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబరు ద్వారా వందలాది ఫోన్‌కాల్స్‌కు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. డ్యూటీ టైమ్ తర్వాత వాళ్లిద్దరూ ఇళ్లకు వెళ్లిపోవచ్చు. కానీ, బాధ్యత ఎరిగిన వారిద్దరూ రోజంతా చేసిన పని చాలామందికి ఊరటనిచ్చింది. బాధ్యత ఎరిగిన ఈ భారతీయులిద్దరికీ సలాం చేద్దాం.
     
ప్రాణం పోసిన ప్రయాణం
ప్రయాణంలో తారసపడిన స్నేహితుడు శ్రీకుమార్‌కు ప్రాణాన్నే పోశాడు. శ్రీకుమార్ కేరళలోని పుదుక్కొడతు గ్రామంలో ఎరువుల వ్యాపారి. నాలుగేళ్లుగా లివర్ సిరోసిస్‌తో బాధపడుతూ కాలేయ దాత కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి సమయంలో అనుకోకుండా ఒక బస్సు ప్రయాణంలో అజీజ్ దేవుడిలా తారసపడ్డాడు. ఇంట్లో వాళ్లను ఒప్పించి మరీ, శ్రీకుమార్‌కు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేశాడు. జూలై 15న సర్జరీ తర్వాత శ్రీకుమార్ కొత్తగా ప్రాణం పోసుకున్నాడు. ‘ప్రాణ’మైత్రికి ఆదర్శంగా నిలిచిన అజీజ్‌కు సలాం చేద్దాం.
     
మెడిసిన్ బాబా  జిందాబాద్..!
ఢిల్లీలో ఓంకార్‌నాథ్ శర్మను స్థానికులంతా ‘మెడిసిన్ బాబా’గా పిలుచుకుంటారు. బ్లడ్‌బ్యాంకులో టెక్నీషియన్‌గా పనిచేసి, రిటైరైన ఓంకార్‌నాథ్ వయసు ఇప్పుడు 79 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన రోజూ ఇంటింటికీ తిరిగి, వాడగా మిగిలిపోయిన మందులను అడిగి తెచ్చుకుంటాడు. వాటిలో కాలంచెల్లిన వాటిని తీసేసి, పనికొచ్చే మందులను వాటిని కొనుక్కోలేని నిరుపేదలకు ఉచితంగా పంచిపెడుతుంటాడు. పేద రోగులకు తనవంతుగా నిస్వార్థసేవ చేస్తున్న ఈ ‘మెడిసిన్ బాబా’కు జిందాబాద్ చెబుదాం.
     
 ఫ్లైయింగ్ వాకర్స్
 తమిళనాడులోని తిరుచ్చి దగ్గర్లోని మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద బాలిక స్వాతి. బాగా చదువుకుని ప్లస్‌టూలో మంచి మార్కులు సాధించిన మెరిట్ స్టూడెంట్. ఆగస్టు 8న ఆమెకు కోయంబత్తూరులో తమిళనాడు అగ్రికల్చరల్ వర్సిటీలోని అణ్ణా అరంగమ్‌లో అడ్మిషన్ కౌన్సెలింగ్. అయితే, పొరపాటున ఆమె, ఆమె తల్లి చెన్నైలోని అణ్ణా వర్సిటీకి చేరుకున్నారు. క్యాంపస్‌లో అడ్రస్ వెదుక్కుంటున్న తల్లీకూతుళ్లను గమనించారు అక్కడి వాకర్స్. జరిగిన పొరపాటును అర్థం చేసుకున్నారు. వెంటనే డబ్బులు సేకరించి, కోయంబత్తూరుకు టికెట్టు కొని, స్వాతిని, ఆమె తల్లిని విమానంలో పంపారు. ఈలోగా ఫలహారం పెట్టించారు. అగ్రికల్చరల్ వర్సిటీకి ఫోన్‌చేసి, ఆమెకు అదనపు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. వాకర్స్ చలవతో స్వాతి బీటెక్‌లో అడ్మిషన్ సాధించింది. అనూహ్య సాయానికి స్వాతి, ఆమె తల్లిదండ్రులు ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. త్వరలోనే చెన్నైకి వెళ్లి, తమకు సాయం చేసిన వాకర్లకు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా, విమానం టికెట్ల డబ్బులు తిరిగి ఇచ్చేసి రావాలనుకుంటున్నారు. స్వాతిని ఆదుకున్న వాకర్లు సిసలైన భారతీయులు.. వారికి జేజేలు పలుకుదాం.
     
 జగమంత  కుటుంబం ఆమెది!
 బాల్య వివాహంతో బాధలు పడి, నిండు గర్భిణిగా రోడ్డున పడ్డ మహిళ సింధుతాయ్ నష్కల్ (67). మహారాష్ట్రకు చెందిన ఆమె జీవితంలో లెక్కలేనన్ని కష్టాలు అనుభవించింది. అయితే, ఇప్పుడామె అనాథ బాలలకు అమ్మ. ఇప్పటి వరకు ఆమె ఆశ్రయంలో దాదాపు 1400 మంది పెరిగి పెద్దయ్యారు. వాళ్లలో కొందరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఎదిగారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఐదువందలకు పైగా అవార్డులు వచ్చాయి. ఊరూరా తిరుగుతూ, ఉపన్యాసాలు ఇస్తూ, వాటి ద్వారా వచ్చే డబ్బుతోనే ఆమె అనాథ బాలల ఆలనా పాలనా చూసుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన భర్త క్షమించమని అడిగితే, పెద్దమనసుతో మన్నించింది. జగమంత కుటుంబం కలిగిన ఈ అమ్మకు వందనాలు పలుకుదాం.
     
 నిజాయితీకి  గౌరవం
 హైదరాబాద్‌లో స్పెషల్‌బ్రాంచ్ కానిస్టేబుల్ గేదెల నారాయణరావు. విధి నిర్వహణలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న యశోదా ఆస్పత్రి వైద్యుడి పాస్‌పోర్టు పత్రాల తనిఖీకి వెళ్లారు. షరా‘మామూలు’గా ఆ వైద్యుడు వెయ్యిరూపాయలు ఇవ్వబోయారు. నారాయణరావు సున్నితంగా తిరస్కరించారు. కానిస్టేబుల్ నిజాయితీని ఆ వైద్యుడు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. మర్నాడే సీఎం స్వయంగా నారాయణరావును పిలిపించుకుని, ప్రశంసించడమే కాకుండా, అవార్డు అందజేశారు. నిజాయితీకి దక్కే గౌరవం ఇచ్చే సంతృప్తికి ఏదీ సాటిరాదు.
     
 చెక్కు చెదరని నిజాయితీ

 కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొండేటి సతీష్ బుధవారం కరీంనగర్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసుకు ఆటోలో వెళుతున్నాడు. తోవలో చిగురుమామిడి శివార్లలో గాలికి కొట్టుకుపోతున్న ఒక బ్యాంకు చెక్కును గమనించాడు. వెంటనే ఆటో దిగి, చెక్కు చేతిలోకి తీసుకున్నాడు. చెక్కుపై ఖాతాదారు దేవారపు సుధాకర్‌రెడ్డి పేరు కనిపించింది. ఇ.వెంకటయ్య అనే వ్యక్తి పేరిట ఆ చెక్కు రూ. 2 లక్షలకు రాసి ఉంది. వెంటనే ఈ విషయాన్ని నగర పంచాయతీ చైర్మన్‌కు చెప్పి, ఆ చెక్కును పోలీసులకు అందజేశాడు సతీష్. పోలీసులు అతడిని అభినందించారు.
     
 త్రివర్ణచక్రం నడిపే భయ్యా

 ఒంగోలులో కన్నెదారి కోటేశ్వరరావు ఆటోడ్రైవర్. ఈ ఏడాది మార్చి 4న ఒక మహిళ అతడి ఆటో ఎక్కింది. గమ్యానికి చేరుకున్నాక ఆటో దిగిన మహిళ, ఆటోలో తన బ్యాగు మరచిపోయింది. ఆ బ్యాగులో దాదాపు రూ. 3 లక్షల విలువ చేసే ఆభరణాలు ఉన్నాయి. బ్యాగులో నగలను గమనించిన కోటేశ్వరరావు, వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి ఆ బ్యాగును అప్పగించాడు. పోలీసుల ద్వారా అది సురక్షితంగా సొంతదారుకు చేరింది. కళ్లు చెదిరే బంగారు నగలు కళ్ల ముందు ఉన్నా, నిజాయితీని చాటుకున్న ఈ ఆటోడ్రైవర్ సిసలైన భారతీయుడు. అవును కదా!
 

మరిన్ని వార్తలు