ఆభరణానికే అందం...

18 Jun, 2014 23:02 IST|Sakshi

చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి కదా అని అన్నీ ఒకేసారి తినలేం. అలాగే ఏడు వారాల నగలు ఉన్నాయి కదా అని అన్నీ ఒకేసారి ధరించకూడదు. కట్టుకునే దుస్తులకే కాదు, పెట్టుకునే ఆభరణాలకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. సమయం, సందర్భాలను బట్టి ఆభరణాలు ధరించాలి. ఆ ఆభరణాలలో మీరు మరింత ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలంటే ఏది రాంగో, ఏది రైటో తెలిసుండాలి. అందుకు ఈ మెలకువలు పాటించి, ఆభరణాలకే అందాన్ని తీసుకురండి.
 
నగలు ఆడవారికి ఎంత ఇష్టమో తెలిసిందే! పెళ్ళిళ్లకు, ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చీరల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.కాని నగలు ఒకే తరహావి పెట్టుకెళతారు. ఇక చాలా మంది చేసే పొరపాటు.. ఒకటికి రెండు, మూడు నగలు వేసుకోవడం. ధరించిన చీరకు, వేసుకున్న నగకు ఏ మాత్రం పొంతన లేకపోవడం... రోల్డ్‌గోల్డ్ కంటే బంగారు ఆభరణా లలో ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి.
 
మెడ పొడవుగా/ కురచగా ఉంటే!: ఆభరణాలు ధరించేటప్పుడు మెడను బట్టి ఎంచుకోవాలి. మెడ సన్నగా పొడవుగా ఉన్నదా, లేక కురచగా లావుగా ఉన్నదా అనేది చూసుకోవాలి. అలాగే వయసును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక వయసు వచ్చేసరికి మెడ మీద ముడతలు వచ్చేస్తాయి. మెడ పొడవుగా సన్నగా ఉంటే చౌకర్స్, నెక్లెస్ పెట్టుకోవచ్చు. అదే మెడ కురచగా.. లావుగా ఉన్నా, ముడతలుగా ఉన్నా నెక్లెస్‌లు పెట్టుకునే ధైర్యం చేయకూడదు. పొడవాటి హారాలు వేసుకోవాలి.  
 
ఫ్యాబ్రిక్‌కు తగిన ఆభరణం: వెళ్లబోయే వేడుక ఏంటి? ఏ చీర కట్టుకుంటున్నాం.. అనే దాన్ని బట్టి ఆభరణాలను ఎంపిక చేసుకోవాలి.  

షిఫాన్ చీర ధరించినప్పుడు పట్టుచీరపైకి వేసుకునే నగలు ధరించకూడదు.  

పోచంపల్లి, గద్వాల వంటి కాటన్ చీరలు కట్టుకున్నప్పుడు డల్ మెటల్స్, ఉడెన్ జ్యుయలరీ బాగా సూటవుతుంది. బంగారు ఆభరణాలైతే యాంటిక్ ఫినిషింగ్ చేసినవి నప్పుతాయి.

షిఫాన్, జార్జెట్.. వంటి చీరలు కట్టుకున్నప్పుడు సంప్రదాయ ఆభరణాలు ఎంత మాత్రం నప్పవు. వీటికి ఫంకీ జువెల్లరీ... అదీ ఒక నగ మాత్రమే ధరించాలి. లేదా స్టైలిష్ ముత్యాలు వేసుకోవాలి. సన్నటి సింగిల్ లైన్ నెక్లెస్‌లు కూడా బాగుంటాయి.  

పట్టుచీర ధరించినప్పుడు బంగారు ఆభరణాలు, కెంపులు, పచ్చలు బాగుంటాయి. పట్టుచీరలో గోల్డ్, సిల్వర్ థ్రెడ్ డిజైన్స్ ఉంటాయి. ఆ గోల్డ్ డిజైన్‌కి ఈ గోల్డ్ జువెల్రీ బాగా సూటవుతుంది.
 
అందుకే ముందు ఏ తరహా చీర కట్టుకుంటున్నామో దృష్టిలో పెట్టుకొని, దానికి తగిన ఆభరణాన్ని ఎంపిక చేసుకోవాలి.
 
రంగులకు తగిన ఆభరణం: ఎంపిక లేదు, ఆభరణాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే ఒకే ఒక్క నగ ధరించవచ్చు. అది కూడా సరైనది లేదు అనుకుంటే చీరకు సరిగ్గా మ్యాచ్ అయ్యే పెద్ద పెద్ద జూకాలు, హ్యాంగింగ్స్ పెట్టుకుంటే చాలు. అంతే కాని రాంగ్ జువెల్లరీ వేసుకోకూడదు.
 
బ్లౌజ్‌కు తగినవిధంగా...!:  హైనెక్ బ్లౌజ్ వేసుకుంటే మెడను పట్టి ఉంచే నెక్లెస్ అసలు పెట్టుకోకూడదు. హారం మాత్రమే వేసుకోవాలి.  డీప్ నెక్ బ్లౌజ్ ధరిస్తే నెక్లెస్ బాగుంటుంది.
 
ఒక్క నగే సరైన ఎంపిక: ఎప్పుడైనా రెండు మూడు నగలు వేసుకుంటే అవి ఎంత అందంగా ఉన్నా ఆకర్షణీయంగా కనిపించరు. పెళ్లిళ్లకు రెండు మూడు హారాలు వేసుకోవచ్చు. అయితే అవి కూడా మ్యాచింగ్ ఆభరణాలై ఉండాలి. ఒక హారాన్ని పోలిన డిజైన్, స్టోన్స్ వంటివి రెండు, మూడవ హారాలలోనూ కనిపించాలి. అప్పుడే బాగుంటాయి. పెళ్ళిళ్లకు తయారయ్యేవారు కొంతమంది అతిగా నగలు పెట్టుకుంటారు. చెవులకు, చేతులకు. నడుముకు, మెడలోనూ, శిరోజాలకు.. ఇలా అన్ని భాగాలనూ ఆభరణాలతో అలంకరిస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక పార్ట్‌ని మాత్రమే ఎక్కువగా నగలతో అలంకరిస్తే కళ తప్పుతుంది. ఎక్కువ ఆభరణాలను అలంకరించుకోలేని వారు ఒక్క నగతో సరిపెట్టుకుంటే మంచిది. మిగతా ఏ సందర్భంలోనైనా ఒక్క నగే బాగుంటుంది. ఉన్నాయి కదా అని రెండు, మూడు హారాలు వేసుకోవడం వల్ల కట్టుకున్న చీర, మేకప్, శిరోజాల అలంకరణ మీద కన్నా ఎదుటివారి దృష్టి ముందుగా నగలమీదకు వెళుతుంది. దీంతో అందంగా కనిపించరు.
 
మ్యాచింగ్ క్యాచింగ్...: ఎంపిక చేసుకున్న చీర, కేశాలంకరణ, శారీరక సౌష్టవం, ఆభరణం,... మొత్తం అందంగా కనిపించాలంటే కట్టుకున్న చీరకు ఆభరణం మ్యాచ్ అయి ఉండాలి. కొంతమంది మంగళసూత్రాలు, నల్లపూసలు, నెక్లెస్ అన్నీ ఓపిగ్గా ధరిస్తారు కానీ. సరైన పాదరక్షలు తొడుక్కోరు. అంతెందుకు... రోజూ వేసుకునే కేశాలంకరణే వేడుకలోనూ ఉంటుంది. ఒక్క నగలు మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకే ఎదుటివారి దృష్టి నగలమీదకే వెళుతుంది. మనకు ఉన్న నగలు మాత్రమే అందంగా కనిపించాలంటే ఆభరణాలు ఎన్ని రకాలైనా ధరించవచ్చు. మనం అందంగా కనిపించాలంటే ఆభరణాల ఎంపిక, ధరించడంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
 
 1- షిఫాన్, జార్జెట్.. చీరలు ధరించినప్పుడు సంప్రదాయ ఆభరణాలు నప్పవు. ఫంకీ, స్టైలిష్ ముత్యాల ఆభరణాలు ధరిస్తే బాగా కనిపిస్తారు.
 
 2- రెండు, మూడు హారాలు ధరించడం,చీరకు సూటవని ఆభరణాల వల్ల అందం దెబ్బతింటుంది.
 
 3- అంచు ఉన్న షిఫాన్ చీరలు కట్టినప్పుడు ఒక నగను మాత్రమే, ధరించాలి. కేశాలంకరణ పైన దృష్టిపెట్టాలి.
 
 4- ఒకేసారి పూసలు, నల్లపూసలు, ఫంకీ జువెల్రీ ధరించడం అంటే అలంకరణను మనమే పాడుచేసుకున్నట్టు. చీర రంగులోని ఏదో ఒక రంగును ప్రతిబింబించే నగను ఒకటే ధరిస్తే లుక్ అధునాతనంగా కనిపిస్తోంది.
 
 5- వంగపండు రంగు జార్జెట్ చీరకు గోల్డ్ బార్డర్ ఉంది. ఆభరణాలను కూడా అదేవిధంగా జత చేయాలి. గోల్డ్ కలర్‌లో ఉన్న స్టైలిష్ ఆభరణాన్ని ధరిస్తే మోడ్రన్ లుక్‌లో కనిపిస్తారు. ఇలాగే ప్రతి చీరకు  ఎంపికలో ప్రత్యేకత ఉండాలి.
 
 మోడల్స్: కావ్య, ప్రియాంజలి
 ఫొటోలు: శివ మల్లాల     
    
 
 కర్టెసీ: మంగారెడ్డి
 ఫ్యాషన్ డిజైనర్
 www.mangareddy@gmail.com     
              

మరిన్ని వార్తలు