విశ్వాసికి ప్రభువే భద్రతావలయం

10 Mar, 2019 01:12 IST|Sakshi

సువార్త

క్రైస్తవుడుగా మారిన పౌలు మీద యూదులు, ముఖ్యంగా వారిలోని సద్దూకయులు అనే తెగవారు పగబట్టి ఎలాగైనా సరే అతన్ని చంపేవరకు పచ్చినీళ్ళు కూడా ముట్టకూడదని శపథం చేశారు. కోటలోనే కావలిలో ఉన్న పౌలును విచారణకోసమని బయటికి రప్పించి  ఆయన్ని చంపేయాలన్నది వారి కుట్ర. అయితే పౌలు మేనల్లుడు అది విని వెళ్లి భద్రతాధిపతులకు చెబితే ఆ రాత్రే ఇద్దరు శతాధిపతులు, 200 మంది సైనికులు, 200  మంది ఈటెలు విసిరేవారితోపాటు 70 మంది గుర్రపు రౌతులతో భద్రతనిచ్చి పౌలును అత్యంత సురక్షితంగా వారు కైసరయకు పంపారు (అపో.కా.23:12–25). మన ఆయుష్కాలపు లెఖ్ఖ దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉందని బైబిల్‌ చెబుతోంది (కీర్తన 139:16). అంటే మన ఆయుష్కాలాన్ని తగ్గించే శక్తి కానీ, పెంచే శక్తి గాని మనుషుల చేతుల్లో  లేదన్నది దాని తాత్పర్యం. ఇపుడు అందరికీ అందుబాటులో ఉన్న ఈ బైబిల్‌ గ్రంథమే ఆ కాలంలోనూ ‘తోరా’ పేరుతో అప్పటి యూదులకు కూడా అందుబాటులో ఉన్నా, ప్రతి విశ్రాంతి దినం నాడు వాళ్లంతా దాన్ని చదువుతున్నా, ఈ వాక్యం అందులో రాయబడి ఉన్నదని తెలిసినా, సద్దూకయులు దేవుని ఈ వాక్యానికి విరుద్ధంగా పౌలును చంపి ఆయన ఆయుష్కాలాన్ని తగ్గించేద్దామనుకున్నారు.

వాళ్ళు పౌలు  హత్యకు కుట్రనైతే చేశారు కానీ మూడు విషయాలను మర్చిపోయారు. మానవుని ఆయుష్కాలాన్ని తన వశంలో పెట్టుకున్న దేవుని సాన్నిధ్యం అనునిత్యం పౌలుకు తోడుగా ఉన్నదని వాళ్ళు మర్చిపోయారు. ఆ కారణంగానే తమ కుట్ర సంగతి విని అధికారులకు చేరవేసే ఒక వ్యక్తిని పౌలు మేనల్లుడి రూపంలో దేవుడే అక్కడ ఏర్పాటు చేశాడని కూడా వాళ్లకు తెలియదు. అన్నింటికన్నా ముఖ్యంగా, పౌలు ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నపుడు దేవుడే ఆయనతో అంతకుముందు రాత్రి మాట్లాడి ‘ధైర్యంగా ఉండు, యెరూషలేము లోలాగే నీవు రోమా పట్టణంలో కూడా నన్ను గూర్చి సాక్ష్యమియ్యవలసి ఉన్నది’ అని వెల్లడించాడు (23:11). అంటే కనీసం రెండున్నర ఏళ్ళ తర్వాత రోమాకు వెళ్లే వరకు నీకు ఆయుష్కాలమున్నదని దేవుడు ఆయన్ను హత్యచేయాలని కుట్ర పన్నుతున్న యూదుల మధ్య ఉన్నపుడే పౌలుకు తెలియజేశాడన్నమాట!!! దేవుని ఈ ‘భద్రతా వలయం’ విశ్వాసి చుట్టూ  ఉన్నంతవరకు విశ్వాసిని ఈ లోకం కానీ, అతని శత్రువులు కానీ, మరే ఇతర ప్రమాదాలు కానీ ఏమీ చేయలేవని దాని అర్థం.

మరణం కనుచూపు మేరలోనే ఉన్నట్టు కనిపిస్తున్నా అది విశ్వాసిని తాకడానికి దేవుని సెలవు కావాలి. దేవుడు తన కృపకొద్దీ అతడికి ఈ పరిరక్షణా వ్యవస్థను ఏర్పర్చి, దాన్ని తన పర్యవేక్షణలోనే పెట్టుకున్నాడు. రోగాలు, బాధలు, ప్రమాదాలు, కుట్రలు, కుతంత్రాలు ఉప్పెనలా మీద పడుతున్నా మన ప్రాణం మీద మాత్రం వాటికి అధికారం లేదు. ఆ విషయాన్నే దేవుడు తన భక్తుడైన యోబు విషయంలో అపవాదికి ఆజ్ఞ ఇచ్చాడు (యోబు 2:6). దేవుని కృపకు, ప్రేమకు ఇది పరాకాష్టే కదా!! అందుకే శత్రువుల భయంతో వాళ్ళ కుట్రల మధ్య దినమొక గండంగా బతికిన దావీదు తన కీర్తనలో ‘గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నేను ఏ అపాయానికీ భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండం ఆదరిస్తుంది‘ అంటాడు (23:4).  చివరికి మరణం సంభవించినపుడు కూడా విశ్వాసికి దాంట్లో భయపడేదేమీ లేదు.

మరణం విశ్వాసికి ఒక గదిలోనుండి మరో గదిలోకి వెళ్లడం లాంటిదే. కాకపోతే ఆనందమేమిటంటే వదిలేసే గదిలోనూ దేవుడు విశ్వాసి వెన్నంటే ఉంటాడు, మరణానంతరం అతడు ప్రవేశించే కొత్తగదిలోనూ అతనికి స్వాగతమివ్వడానికి దేవుడు ఎదురుచూస్తుంటాడు. ఆ ఆనందంతోనే పౌలు ‘మనం బతికినా, చనిపోయినా ప్రభువు వారమేనన్న’ ధీమా వ్యక్తం చేస్తాడు (రోమా 8:14). ప్రభువుకోసం బతకడంలోని ఆనందాన్ని అనుభవించని వాడికి ప్రభువుకోసం చనిపోయే ధైర్యముండదు. ఆ కారణం వల్లే జీవితంలో ఎంతో ధైర్యంగా బతికిన వారు వాళ్ళు కూడా మరణానికి భయపడుతుంటారు. ప్రభువు కోసం జీవించడంలో, మరణించడంలో కూడా విశ్వాసి నిర్భయుడు. అందువల్ల దేవుని గ్రంథంలో లెక్కించి రాయబడిన రోజులు పూర్తి కాకమునుపు విశ్వాసిని మరణం ఒడిలో వేయగల శక్తి ఏదీ ఈ లోకంలో లేనే లేదు.
రెవ.డా.టì .ఎ.ప్రభుకిరణ్‌
email: prabhukirant@gmail.com


పఠనీయం
అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీపనగరీజడానాం చైతన్య స్తబక మకరంద శ్రుతిఝరీదరిద్రాణాం చింతామణి గుణనికా, జన్మజలధౌనిమగ్నానాం దంష్ట్ర్రామురరిపు వరాహస్య భవతీ!

పఠించే విధానం: ఈ శ్లోకాన్ని 40 రోజులపాటు ప్రతిరోజూ ప్రాతఃకాలంలో స్నానం చేసి 11మార్లు పఠించి అమ్మవారికి ధూపదీప హారతులివ్వాలి. పారాయణ ఫలం: సంసారకష్టాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. ధనహీనులకు దారిద్య్ర బాధలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాఃవసన్త స్సామన్తో మలయమరుదాయోధన రథఃతథాప్యేక స్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్‌అపాఙ్గాత్తే లబ్ధ్యా జగదిదమనఙ్గో విజయతే

పారాయణ విధానం: స్నానం చేసి శుచిగా ఉండి ఈ శ్లోకాన్ని 108 రోజులపాటు రోజుకు 108 మార్లు పఠించాలి. చెరకు రసాన్నిౖ నెవేద్యంగా సమర్పించాలి. పారాయణ ఫలం: దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సత్సంతానం కలుగుతుంది.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా