స్టార్‌ జర్నలిస్ట్‌

23 Apr, 2020 07:13 IST|Sakshi

గుల్షన్‌ యూయింగ్‌ (1928–2020)

అందం అంటేనే మధుబాల. ఇంకా అందంగా ఏం రాస్తాం?పవర్‌ అంటేనే ఇందిరాగాంధి.ఇంకా పవర్‌ఫుల్‌గా ఏం చెప్తాం?హారర్‌ అంటేనే హిచ్‌కాక్‌. ఇంకా హారరేం చూపిస్తాం? ఇంటర్వూ్య చెయ్యడం వేస్టేనా మరి!చేసేవాళ్లు చెయ్యాలి. గుల్షన్‌ యూయింగ్‌లా చెయ్యాలి. అరవైల నాటి స్టార్‌ జర్నలిస్ట్‌ ఆమె.కరోనాతో కన్ను మూశారు. 

డ్యానీ కే ని ఇంటర్వూ్య చేస్తున్నారు గుల్షన్‌ యూయింగ్‌. పొడవైన మనిషి.. కే. అతడు నటించిన సినిమాల లిస్ట్‌ మాత్రం అతడంత పొడవు లేదు. మొత్తం పదిహేడంతే. గుల్షన్‌కి ఆయనంటే పిచ్చి. యాక్టర్, సింగర్, డాన్సర్, కమెడియన్, మ్యూజీషియన్‌... అన్నీ కలిపి నచ్చేశాడేమో. ఇంటర్వూ్య చేస్తుంటే తన ముఖంలోకి చూడ్డం లేదు. తనను చూస్తున్నాడు! ‘‘కే.. ఏంటలా చూస్తున్నారు?’’ తత్తరపడ్డారు గుల్షన్‌. ‘‘ఎలా చుట్టుకున్నారు? ఒకసారి చూపించరా..’’ నవ్వుతూ అన్నాడు కే. అతడు అడిగింది ఆమె చీర కట్టుకోవడం గురించి. పెద్దగా నవ్వారు గుల్షన్‌. కే నుంచి తనకు కాంప్లిమెంట్స్‌! పడిపోవడం ఒక్కటే తక్కువ. ఇంటర్వూ్య అయ్యాక ఫొటో. గుల్షన్‌ని దగ్గరకు తీసున్నారు కే. బాగా దగ్గరికి. క్లిక్‌.. క్లిక్‌.. క్లిక్‌..! గుల్షన్‌ తన జీవితాంతం దాచుకున్న ఫొటోల్లో అదీ ఒకటి. 

 డ్యానీ కే పక్కన , గ్రెగరీ పెక్‌తో

అరవైల్లో.. బాంబేలో పెద్ద సెలబ్రిటీ జర్నలిస్ట్‌ గుల్షన్‌. రెండు పెద్ద పత్రికలకు ఎడిటర్‌. ‘ఈవ్స్‌ వీక్లీ’,‘స్టార్‌ అండ్‌ సై్టల్‌’. గ్లామరంతా ఆమె చుట్టూతానే ఉండేది. ఆ పత్రికల్లో ఫొటో వస్తే.. గుల్షనే స్వయంగా తమని ఇంటర్వూ్య చేస్తే.. తారలకైనా, పొలిటికల్‌ స్టార్‌లకైనా పెద్ద సెలబ్రేషన్‌! ముప్పైఏళ్ల పాటు బాంబేలో ఈ పార్శీ అమ్మాయి ఉండే ఆఫీసు.. పొద్దు చాలని ప్రసిద్ధుల తేనీటి సేవన కూడలి. హైదరాబాద్‌ బేగంపేట లైఫ్‌స్టెయిల్‌లో అధాటున బాలీవుడియన్స్‌ ప్రత్యక్షం అయినట్లు, గుల్షన్‌ క్యాబిన్‌లో హాలీవుడ్‌ యాక్టర్‌లు కనిపించేవారు. గుల్షన్‌ భర్త గాయ్‌ యూయింగ్‌ కూడా కొన్నిసార్లు వారితో కలిసి కూర్చునేవారు. బయట వేరే పత్రికలో జర్నలిస్ట్‌ అతడు. 26వ యేట గాయ్‌తో పెళ్లయింది గుల్షన్‌కు. 38వ ఏట ఎడిటర్‌ అయ్యారు. అంతకుముందు వరకూ భార్యాభర్తలు వేర్వేరు పత్రికల్లో రిపోర్టర్‌లు. 

క్యారీ గ్రాంట్‌తో, ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌తో..

గాయ్‌ది మాంచెస్ట్టర్‌. గాయ్‌ తండ్రి జర్నలిస్ట్‌. కుటుంబం ఇండియాకు వచ్చేసింది. అలా పరిచయం గుల్షన్‌కి గాయ్‌తో. 1955లో పెళ్లయింది. కూతురు అంజలి. కొడుకు రాయ్‌. అతడిప్పుడు మయామీలో ఉంటున్నాడు. గుల్షన్‌ భర్త గాయ్‌ 87 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో చనిపోయారు. అంజలి, అంజలి కూతురు ఫేబీ (20) లతో ఉంటున్నారు గుల్షన్‌. 1990లోనే గుల్షన్‌ దంపతులు లండన్‌ వెళ్లి స్థిరపడ్డారు. 92 ఏళ్ల వయసులో గుల్షన్‌ మొన్న శనివారం రిచ్‌మండ్‌లోని కేర్‌ హోమ్‌లో కరోనాతో కన్నుమూశారు. విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది.

ఇందిరాగాంధీని ఇంటర్వూ్య చేస్తూ.. గుల్షన్‌ 

రిచ్‌మండ్‌ నివాసంలోని గుల్షన్‌ మంచం కింద ఒక పెద్ద పెట్టెలో.. కెరీర్‌లో ఆమె కూడబెట్టుకున్న అపురూపమైన ఛాయాచిత్రాలెల్నో ఉన్నాయి. ఇందిరాగాంధీ, మధుమాల, హాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్, అమెరికన్‌ నటి ఏవా గార్డ్‌నర్, ప్రిన్స్‌ చార్ల్స్, బ్రిటన్‌ సంపన్న వ్యాపారి లార్డ్‌ ఆస్టన్, హాలీవుడ్‌ నటులు గ్రెగరీ పెక్, కేరీ గ్రాంట్, కిర్క్‌ డగ్లాస్, టోనీ ర్యాండల్, ఇటలీ దర్శకుడు రోబెర్టో రోసిలీని.. ఇంకా అనేకమంది ప్రపంచ ప్రముఖులు, రాజకీయ నాయకులు, రాచరిక వంశీయులను ఇంటర్వూ్య చేసినప్పటి ఫొటోలు అవి. ఇటీవల తల్లిని కేర్‌ హోమ్‌కి తరలిస్తుండగా తొలిసారి ఆ ఫొటోలను శ్రద్ధగా చూశారు ఆమె కూతురు అంజలి. గుల్షన్‌ ఎప్పుడూ గ్రెగరీ పెక్‌ గురించి.. ‘వాట్‌ ఎ జెంటిల్మన్‌..’ అంటుండేవారట. ‘‘మాట తీరులో మాత్రం బ్రిటన్, అమెరికన్‌ ఇంగ్లిష్‌లు కలగలిసిన క్యారీ గ్రాంట్‌ ట్రాన్స్‌ అట్లాంటిక్‌ ఉచ్చారణను అమ్మ ఎప్పుడూ అనుకరించేవారు. అయితే ఆమె ఆరాధించినది మాత్రం డ్యానీ కే నే’’ అని అంజలి అంటారు.

మరిన్ని వార్తలు