మంచి జన్మించిన రోజు

11 Jun, 2018 00:45 IST|Sakshi

థర్టీ ఇయర్స్‌ న్యూ

ట్రినా దత్తా బెంగాలీ అమ్మాయి. కోల్‌కతాలో పుట్టింది. ఎం.బి.ఎ చదివింది. అది కూడా ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో. ఇప్పుడు నైజీరియాలో ఉద్యోగం చేస్తోంది. పుట్టిన రోజు సొంత నేల మీద చేసుకోవాలనుకుంది. మొన్న (జూన్‌ 9) ఆమె పుట్టిన రోజు . ముప్పయ్యవ పుట్టిన రోజు. అంతకు కొన్ని రోజుల ముందే.. కోల్‌కతాలో దిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కంటపడిన దృశ్యాలు ఆమెని ఆలోచనలో పడేశాయి. అవి అంతకుముందు కూడా చూసినవే. ఇప్పుడు బయట దేశాన్ని చూసి వచ్చిన తర్వాత అవే దృశ్యాలు తీవ్రమైన ఆవేదనకు గురిచే శాయి ఆమెను. 

ముప్పై మందికి కొత్త జీవితం
పుట్టిన రోజులకు నగరంలో ఒకవైపు కేక్‌లు, పేస్ట్రీలు, స్నేహితులు, బంధువులతో విందుల్లో మునిగి తేలుతున్నారు. అదే నగరంలో మరోవైపు పెద్ద ఇళ్ల సందుల్లో చిన్న గుడారాల్లో అర్ధాకలితో అలమటించేవాళ్లూ ఉన్నారు. బిడ్డ ఆకలి తీర్చడానికి చెయ్యి చాచే తల్లులున్నారు. ఆ ఆడవాళ్లలో ఎక్కువ భాగం ట్రాఫికింగ్‌ బాధితులే. అవన్నీ చూసిన ట్రినాకు ఓ ఆలోచన వచ్చింది. తన ముప్పయ్యవ పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని.  బంధువులు, స్నేహితులు ఖరీదైన బహుమతులతో తనను సర్‌ప్రైజ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తన పుట్టిన రోజు తనకు మాత్రమే కాదు, తన వాళ్లకు కూడా స్వీట్‌ మెమొరీగా ఉండాలి. ఖర్చు చేసే ప్రతి రూపాయి మరొకరి జీవితాన్ని బాగు చేయాలి... ఇదీ ఆమెకు వచ్చిన కొత్త ఆలోచన. ట్రాఫికింగ్‌ బారి నుంచి బయటపడిన మహిళల్లో ముప్పయ్‌ మందికి కొత్త జీవితాన్నివ్వడానికి తన వంతు సహకారం అందివ్వాలనుకుంది. 

ఒక్కొక్కరికి ఫీజు ఏడు వేలు
అక్రమ రవాణా విషవలయం నుంచి బయటపడిన ఆడవాళ్లకు ఆశ్రయం కల్పించి వారికి ఉపాధి కల్పించే ఎన్‌జివోను సంప్రదించింది ట్రినా. ఐటి డిప్లమో కోర్సు చేయడానికి ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలవుతుంది. ముప్పయ్‌ మందికి కోర్సు ఫీజు రెండు లక్షల పది వేల రూపాయలు. ట్రినా తన ఆలోచన ఇంట్లో చెప్పింది. ఫ్రెండ్స్‌ కూడా సంతోషంగా ముందుకొచ్చారు. తనకు గిఫ్ట్‌ కోసం ఇవ్వాలనుకున్న డబ్బును జమ చేయమంది. అందరూ ఇచ్చినంత ఇవ్వగా మిగిలిన డబ్బు తాను ఇవ్వాలనేది ట్రినా ఆలోచన. అయితే ట్రినా రూపాయి తీయాల్సిన పని లేకుండా అంతకు మించిన డబ్బు పోగయింది. మొత్తం రెండు లక్షల పాతిక వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయలు. ‘ఒక బహుమతి మరొకరి జీవితాన్ని బాగు చేస్తుందంటే అంతకంటే సంతోషం మరోటి ఏముంటుంది’ అంటూ ట్రినా ఆలోచనను అభినందించారంతా. 

పాత ఆలోచనే.. కొత్తగా!
‘‘మా అమ్మ, ఆంటీలు చాలాసార్లు మా పుట్టిన రోజుకు వీధి పిల్లలకు స్వీట్లు ఇవ్వడం వంటివి చేసేవారు. ఆపన్నుల అవసరాలకు స్పందించేవారు. ఇప్పుడు నేను చేసిన ఆలోచన కొత్తదేమీ కాదు. కొద్దిగా మార్చుకున్నానంతే. సహాయం అందుకున్న వాళ్లంతా మనసారా విషెష్‌ చెప్పారు. నాకు గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్న వాళ్లు కూడా తమకు ఒక మంచి పని చేసే అవకాశం ఇచ్చావంటూ నన్ను అభినందించారు. నా ముప్పయ్యవ పుట్టినరోజు ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని ఇండియాకి వచ్చాను. ఇంతకంటే గొప్ప సెలబ్రేషన్‌ ఇంకేముంటుంది’’ అంటోంది ట్రినా.
– మంజీర 

మరిన్ని వార్తలు