కొరీస్.. పేరు కాదు, బ్రాండ్!

28 Oct, 2014 23:41 IST|Sakshi
కొరీస్.. పేరు కాదు, బ్రాండ్!

ఐదేళ్ల వయసులో రోడ్డు పక్కన బిస్కెట్ ప్యాకెట్‌లు అమ్మిన ఇతడు... పదేళ్లు వచ్చే సరికి తన పేరు మీదనే ఒక బ్రాండ్‌ను నెలకొల్పి ఆ కంపెనీకి సీఈవో అయ్యాడు. అదే మిస్టర్ కొరీస్ కంపెనీ. న్యూజెర్సీలోని నల్లజాతి కుటుంబానికి చెందిన వాడు కొరీ. ఐదేళ్ల వయసులోనే అతనికి తండ్రి దూరమయ్యాడు. తల్లిది పోషించలేని పరిస్థితి. అప్పడు మన స్వగృహా ఫుడ్స్ తరహా వ్యాపారాన్ని మొదలుపెట్టారు ఈ తల్లీకొడుకులు. అమ్మ తయారు చేసే కుకీస్ ‘కొరీ’కి చాలా ఇష్టం. వాటిని ఎవరైనా ఇష్టపడతారని ఆ పిల్లాడు నమ్మాడు. మరి వాటిని అమ్మితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక రోడ్డున వెళ్లే వాళ్లకు కుకీస్‌ను అమ్మడం మొదలు పెట్టాడు. తర్వాత కుకీస్‌ను షాపులకు వేశాడు. డిమాండ్ పెరిగి కొరీ మార్కెట్ విస్తరించింది. దాంతో వాటికి కూడా ఒక బ్రాండ్ నేమ్ తప్పనిసరిగా ఉండాలనుకున్నాడు కొరీ. ‘మిస్టర్. కొరీ’ అనే అర్థం వచ్చేలా ‘ఎమ్‌ఆర్.కొరీ’ పేరుతో లోగో చేయించాడు.

తనే బ్రాండ్ అంబాసిడర్‌గా, తనే మార్కెటింగ్ ఎనలిస్టుగా మారి అమ్మకాల్లో ప్రగతి సాధించాడు. ఇప్పుడు న్యూజెర్సీలో ‘ఎమ్‌ఆర్. కొరీ’ కుకీస్‌కు మంచి గిరాకీ. ఈ వ్యాపారంతో కోట్లు సంపాదించక పోయినా... తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అమ్మ సిటీ బస్సులు ఎక్కి ప్రయాణించడాన్ని చూడలేక ఆమెకో కారును బహుమతిగా ఇచ్చాడు. కొరీ ఐదేళ్ల వయసులో వ్యాపారం మొదలు పెట్టి... మరో ఐదేళ్లకే ఇంతగా ఎదగడం చాలామందిని ఆశ్చర్యపరించింది. అమెరికన్ టెలివిజన్ చానళ్లకు ఇతడో సెలబ్రిటీ అయ్యాడు. ‘మీ వ్యాపార విజయ రహస్యం ఏమిటి?’ అని అడిగితే ‘ప్రెజెంటేషన్ ఈజ్ ది కీ టు సక్సెస్’ అంటాడు. పదేళ్లకే ఇంత ప్రావీణ్యం సంపాదించిన ఇతడు భవిష్యత్తులో గొప్ప పారిశ్రామికవేత్త కాగలడని విశ్లేషకుల అభిప్రాయం. కొరీ కష్టాన్ని, తెలివితేటలను చూస్తే ఆ అభిప్రాయం నిజమయ్యే అవకాశాలే ఎక్కువ.

మరిన్ని వార్తలు