ధ్యానం ఎందుకు చేయాలి? నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా?

22 Nov, 2023 16:26 IST|Sakshi

ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. జీవనశైలిలో మార్పులు, తినే ఆహారం, మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు.. తదితర కారణాల వల్ల నేడు అనేక మంది ఏదో ఒక సందర్భంలో స్ట్రెస్‌(ఒత్తిడి)ని ఎదుర్కోవాల్సి వస్తోంది. దుకే ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధ్యానం, యోగా వంటివి చేసి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


మీరు ఎప్పుడైనా తీవ్ర ఒత్తిడికి గురైతే ఓ పది నిమిషాలు ధ్యానం చేసి చూడండి. తేడా మీకే అర్థమవుతుంది.మెదడుకు రిలాక్సేషన్ ఇచ్చే ఏకైక సాధనం ధ్యానం మాత్రమే. అందుకే మన పూర్వికులు ధ్యానాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నారు.ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మనం ధ్యాన​ం కోసం కొన్ని నిమిషాల సమయం కూడా వెచ్చించలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. బీపీ, హార్ట్ రేట్, గ్లూకోజ్ లెవెల్స్, కార్టిసాల్ లెవెల్స్ అన్నింటినీ నియంత్రించే శక్తి ధ్యానానికి ఉంది.

జర్నల్ ఆఫ్ న్యూరోలాజికల్ సైన్సెస్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. శ్వాస వ్యాయమాల్లో నిమగ్నమైనప్పుడు వారి ఒత్తిడి తగ్గి, హార్ట్‌రేట్‌ నార్మల్‌గా ఉందని తేలింది బీపీ, హార్ట్ రేట్, గ్లూకోజ్ లెవెల్స్, కార్టిసాల్ లెవెల్స్ అన్నింటినీ నియంత్రించే శక్తి ధ్యానానికి ఉంది. ఉచ్వాస, నిశ్వాసాలపై మనుసును ఏకాగ్రం చేస్తూ కొద్దిసేపు ధ్యానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఒత్తిడికి గురయ్యే వారిలో కార్టిసోల్‌, డొపమైన్ వంటి హార్మోన్‌లు ఉత్పత్తి అవుతాయి. తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు షుగర్ లెవల్స్ పడిపోవడం, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 1970వ దశకంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్ ఒత్తిడి, అధిక రక్తపోటు వంటి సమస్యలకు ధ్యానం ఒక ఉత్తమ మార్గమని గుర్తించారు. శ్వాస వ్యాయామాలను తరచూ చేయడం వల్ల  మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకోవచ్చని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్  ప్రచురించింది. 

ఇన్‌స్టంట్‌తో రిలీఫ్‌

ముందుగా ప్రశాంతమైన, సౌకర్యవంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. ప్రారంభదశలో ఛాతీ నుంచి మొదలుకొని పొత్తికడుపు వరకు వీలైనంత లోతుగా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదలండి. ఈ పద్దతిని మీకు వీలైనన్నిసార్లు 10-20నిమిషాల వరకు రిపీట్‌ చేయండి. గట్టిగా శ్వాస పీల్చడం, కొన్ని సెకెండ్ల పాటు నిలిపి ఉంచడం, వదిలేయడం అనే డీప్ బ్రీతింగ్ టెక్నిక్ స్ట్రెస్‌ నుంచి ఇన్‌స్టంట్‌ రిలీఫ్‌ని ఇస్తుంది. మనస్సును ఒక చోట కేంద్రీకరించడానికి మెదడుకు శిక్షణ ఇవ్వగలగడమే మెడిటేషన్. మొదట్లో అంత ఏకాగ్రత కుదరకపోయినా ఆ తర్వాత చేస్తున్న కొద్దీ డైవర్షన్స్ తొలగిపోతాయి. 

మరిన్ని వార్తలు