కర్మవీరచక్ర ధారి

14 Apr, 2015 23:20 IST|Sakshi
కర్మవీరచక్ర ధారి

వినూత్నమైన ఆలోచనలతో, ఆచరణశీలతతో అనాథల సంక్షేమానికి పాటు పడుతున్న లేళ్లపల్లి శ్రీదేవి... అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘రెక్స్’ బంగారు పతకం.. ‘కర్మవీరచక్ర’ను ఇటీవల ఢిల్లీలో అందుకున్నారు. దాదాపు నాలుగు వందల మంది అనాథలున్న రెండు అనాథాశ్రయాలను దత్తత తీసుకుని ఆమె చేస్తున్న కృషికి  గుర్తింపుగా ఈ అవార్డు  లభించింది. ‘ఫేసెస్’ (ఫుడ్, ఎయిడ్, క్లోతింగ్, ఎడ్యుకేషన్, షెల్టర్) అనే సొంత కాన్పెప్టుతో అనాథల సంరక్షణలో పాల్పంచుకుంటూ; పాఠశాల, కళాశాల విద్యార్థులను అందులో భాగస్వామ్యులను చేస్తున్న శ్రీదేవితో కొద్దిసేపు ముచ్చటిస్తే చాలు, ఎవరికైనా సేవారంగంవైపు మళ్లాలని అనిపిస్తుంది!
 
  ...::: డా. వైజయంతి, సాక్షి, చెన్నై

శ్రీదేవి స్వస్థలం వరంగల్. వివాహం అయ్యాక భర్త ఉద్యోగరీత్యా పది సంవత్సరాల క్రితం చెన్నై వెళ్లారు. బాల్యం నుంచే ఆమె ఇంట్లో వాడకంలో లేని వాటిని అమ్మి, ఆ డబ్బులను అనాథలకు వస్తురూపంలో అందించేవారు. డిగ్రీ చదివేటప్పుడు వరంగల్ నెహ్రూ యువజన కేంద్రంలో మూడేళ్ల పాటు పని చేశారు.  పల్లెటూళ్లకి వెళ్లి, యువతకి ప్రభుత్వ పథకాల గురించి తెలియజెప్పి వారిని ఉత్తేజపరిచారు. అక్కడ చేసిన విశేష కృషికి ఆమె 1999లో యువతకు ఇచ్చే జాతీయ అవార్డు అందుకున్నారు. యువజన సేవాకార్య క్రమాలలో భాగంగా ఆమె తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు, రెండు తెలుగు ప్రాంతాలకు కూడా వెళ్లారు.
 
 సంరక్షణలో భాగస్వామ్యం
శ్రీదేవి 2012 నుంచి ఇన్‌హోమ్ చారిటీ నిర్వహిస్తున్నారు. ఫుడ్, ఎయిడ్, క్లోతింగ్, ఎడ్యుకేషన్, షెల్టర్ (faces) ద్వారా సేవాకార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. (www.faces108.com) ‘ఫేసెస్’ అనేది సంరక్షణలో భాగస్వామ్యం స్వీకరించే సేవా ఉద్యమం. శ్రీదేవి ప్రధానంగా అనాథాశ్రమాలకు వెళ్లి సేవ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ‘‘చాలామంది నన్ను ‘వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికి కూడా సేవ చేయొచ్చు కదా’ అంటుంటారు. చేయడం తప్పేమీ కాదు. కాని వారు పిల్లల ఆదరణలేకో, ఇతర కారణాల వల్ల మాత్రమే వృద్ధాశ్రమాలకు చేరుతున్నారు. కాని అనాథలు అలా కాదే! తమ తప్పు,  తమ ప్రమేయం లేకుండానే దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు. తల్లిదండ్రులతో అందంగా, ఆనందంగా గడపవలసిన చిన్నారుల జీవితాలు ఇలా అందరికీ దూరంగా గడవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది.

అందుకే వారికి సేవ చేయడానికి ఇష్టపడతాను’’ అంటారు శ్రీదేవి.  భారతదేశంలో 3.3కోట్ల మంది అనాథలున్నారు. రోజుకి కొత్తగా 5000 మంది జమ అవుతున్నారు. వీరందరికీ వసతులు కల్పించడానికి సమాజంలోని అన్ని వర్గాల సహకారం కావాలి. అందుకే ఈ విషయమై ఒక నివేదికను రూపొందించి దేశ ప్రధానికి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపే యోచనలో ఉన్నారు శ్రీదేవి. ప్రస్తుతం ఆమె చెన్నైలోని పూవనం, ఏరాసమాజ్ అనాథాశ్రమాలను ; వరంగల్‌లోని మల్లికాంబ మనో వికాస కేంద్రం, సాయి అనాథ సేవాసమితి ఆశ్రమాలను దత్తతత తీసుకుని వారికి బియ్యం బస్తాలు కొనివ్వడ ం, వారు ఉంటున్న నివాసాలకు అద్దె కట్టడం వంటివి చేస్తున్నారు.
 
విద్యార్థులలో సేవా స్ఫూర్తి
స్కూలు, కాలేజీ పిల్లల దగ్గరకు వెళ్లి, వారిని కూడా సామాజిక సేవవైపు ప్రేరేపిస్తున్నారు శ్రీదేవి. ‘‘చెన్నైలోమొత్తం 10 లక్షల మంది విద్యార్థులున్నారు. వారందరూ తలచుకుంటే ఒక్క అనాథ కూడా తిండికి బాధపడక్కర్లేదు. మా కాలనీలో ఉన్న  శంకర విద్యాలయం నుంచి నా కార్యక్రమాన్ని ప్రారంభించాను. విద్యార్థులతో వారి దగ్గర ఉన్న పాత వార్తాపత్రిలకు అమ్మించి, ఆ డబ్బులతో బియ్యం కొని ఆ విద్యార్థుల చేతే అనాథలకు ఇప్పిస్తున్నాను. అలాగే ఒక అనాథ శరణాలయం నుంచి పిల్లల్ని మరో అనాథ శరణాలయానికి తరచు తీసుకెళుతుంటాను. ఇలా చేయడం వల్ల వాళ్లు ఎంతో సంబరపడతారు. వాళ్లు ఒకరికొకరు గ్రీటింగ్ కార్డులు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయాన్ని కూడా ప్రారంభించాను’’ అని తెలిపారు శ్రీదేవి.
 
డబ్బు తీసుకోరు
శ్రీదేవి, ఆమె సేవా సహచరులు ఎవరి దగ్గరా డబ్బు రూపంలో ఒక్క పైసా తీసుకోరు. కేవలం వస్తు రూపేణా మాత్రమే సేవల వారధులుగా పనిచేస్తారు. ‘‘మావారు రమేశ్ రూపొందించిన సంగీత చక్రాన్ని అమ్మగా వచ్చిన సొమ్మును అనాథలకు సహాయం చేయడానికి వినియోగిస్తున్నాను. ప్రస్తుతం ఆయన 50 సంవత్సరాల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నారు. అది విజయవంతం అయితే, దాని మీద వచ్చే రాబడిని కూడా ఈ సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తాను’’ అని చెప్పారు శ్రీదేవి.
 
 వరించిన అవార్డులు
♦ ‘ఏషియన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్’ వారిచ్చే ‘అసాన్ మహిళా ఆఫ్ ద ఇయర్’ అవార్డు.
♦ తాజాగా (ఖఉగీ) వారిచ్చే ‘కర్మవీరచక్ర’ గోల్డ్ మెడల్‌తో పాటు, గ్లోబల్ ఫెలోషిప్ అవార్డు. (ఈ గోల్డ్ మెడల్ మొత్తం ఎనిమిదిమందికి మాత్రమే లభించింది. ఐక్యరాజ్యసమితి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇది).
♦  భరతముని వారి సత్కారం.

మరిన్ని వార్తలు