జ్ఞాని రాసిన లేఖ

24 Jun, 2019 11:58 IST|Sakshi

చెట్టు నీడ

ఆయన ఓ గొప్ప జ్ఞాని. ఆయన ఓ రోజు రాత్రి చాలాసేపు ఓ ఆలయంలో ఉండి ఇంటికి ఆలస్యంగా బయలుదేరారు. మార్గమధ్యంలో ఓ తాగుబోతు ఎదురుపడ్డాడు. అతని చేతిలో ఓ సంగీత వాయిద్యం ఉంది. దాన్ని మీటుతూ కనిపించాడు జ్ఞానికి. తాగుబోతు శృతిబద్ధంగా పాడకుండా నోటికి ఇష్టమొచ్చినట్లు పాడుతున్నాడు. అలాగే తన చిత్తమొచ్చినట్లు తన దగ్గరున్న వాయిద్య పరికరాన్ని వాయిస్తున్నాడు. పైగా మధ్య మధ్యలో అతను అటూ ఇటూ వస్తూ పోతున్న వారందరినీ తిడుతున్నాడు. ఆ దారిలోనే ఈ జ్ఞాని కూడా వచ్చారు. తాగుబోతుని చూసారు. తాగుబోతు స్థితిని చూసి ఆయన బాధ పడ్డారు.

అతని దగ్గరకు వెళ్లి ‘‘ఎందుకిలా నడుచుకుంటున్నావు...’’ అని జ్ఞాని ఎంతో వినయంగానే అడిగారు. అంతేకాదు, ఇవన్నీ మానేసెయ్‌ అంటూ.. ఏవో కొన్ని హితవచనాలు చెప్పడం మొదలుపెట్టారు. కానీ జ్ఞాని మాటలు అతనికి కోపావేశాలు తెప్పించాయి. తన చేతిలో ఉన్న వాయిద్యపరికరంతో ఆ జ్ఞానిపై దాడి చేశాడు.దీంతో జ్ఞాని తలకు బలమైన గాయం తగిలి రక్తం కారింది. అయినప్పటికీ జ్ఞాని ఒక్క మాటా అనలేదు. రక్తం కారుతున్న చోట చెయ్యి అడ్డుపెట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. అంతేకాదు, వాయిద్యం కూడా రెండు ముక్క ముక్కలైంది.మరుసటి రోజు ఆ జ్ఞాని తాగుబోతు ఎక్కడ ఉంటున్నది వివరాలు అడిగి తెలుసుకుని అతనికి తీపి పదార్థాలు, కాస్తంత డబ్బు ఓ సంచిలో ఉంచి ఓ మనిషితో పంపారు. ఆ మనిషి తన దగ్గరున్న ఉత్తరాన్ని కూడా ఆ తాగుబోతుకి ఇచ్చాడు. అది జ్ఞాని రాసిన లేఖ. ‘మీ వాయిద్య పరికరం రెండు ముక్కలవడానికి నా తల  కారణమైంది. అందుకు బాధ పడుతున్నాను. కనుక మీకు నేనేదో ఒకటి చేయాలనుకున్నాను. ఈ డబ్బులతో మీరు కొత్త వాయిద్యం కొనుక్కోగలరు.

అలాగే మరొక విషయం. నిన్న రాత్రి మీరు నాతో మాట్లాడిన మాటల్లో ఎన్నో చేదు మాటలు ఉన్నాయి. కనుక మీరు ఇకముందు తీయగా మాట్లాడాలని మిఠాయిలు కూడా పంపాను. ఇవి తిని మీ నాలుకపై ఉన్న చేదుని పోగొట్టుకోండి’ అని జ్ఞాని రాసిన లేఖలో ఉంది. అది చదివాక తాగుబోతుకు తన స్థితికి సిగ్గేసింది. తల వంచుకున్నాడు. తనకు లేఖ అందించినతనితో ఏమీ మాట్లాడలేదు. కాసేపటి తర్వాత తాగుబోతు ఆ లేఖలో ఉన్న చిరునామాకు చేరుకున్నాడు. జ్ఞానిని చూడడంతోనే నమస్కరించడంతోపాటు ఆయన కాళ్లపై పడి తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు.  – యామిజాల జగదీశ్‌ 

మరిన్ని వార్తలు