అవకాశాలున్నాయి... అందుకోండి!!!

22 Dec, 2018 23:56 IST|Sakshi

మహాత్మాగాంధీ ఒకసారి ఆగ్రా కోటకు వెళ్ళారు. లోపలకు వెడుతుంటే ఆయనకు గోడమీద ఒక శిలా ఫలకం కనబడింది. దానిపైన ‘‘ ఈ భూమి మీద ఇది స్వర్గధామం’’ అని రాసి ఉంది. ఆయన వెంటనే పక్కనున్న వారితో ..‘‘ఈ శిలా ఫలకం ఉండవలసింది ఈ ఆగ్రా కోట ముందు కాదు. భారత దేశంలోకి విదేశీయులు ప్రవేశించే ప్రతిచోటా ఇది కనపడాలి’’ అన్నారు. అలా స్వర్గధామంలా ఉండాలంటే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. భారతదేశానికి స్వాతంత్య్రం రావడమంటే కేవలం మనల్ని మనం పాలన చేసుకోవడమే కాదు, పరిశుభ్రంగా కూడా ఉండాలని. దానికోసం ఆయన ఎంత తాపత్రయ పడ్డారో.. వృద్ధాప్యంలో గాంధీగారు పర్యటనలో ఉండగా మరుగుదొడ్డికి వెళ్ళాల్సి వచ్చింది. సహాయకుడు కూడా వెంట వెళ్ళి మరుగుదొడ్డి ఎక్కడో ఉందో చూపి బయట నిలబడ్డాడు. గాంధీగారు 10...15...20 నిమిషాలయినా రాకపోయేసరికి అనుమానం వచ్చింది.

ఆరోగ్యం వికటించిందేమోనని ఆందోళన పడుతుండగా ఒళ్ళంతా చెమటలు కక్కుతూ గాంధీగారు బయటకు వచ్చారు. ఏమయిందని సహాయకుడు ఆదుర్దాగా అడిగితే..‘‘నాకన్నా ముందు ఒక సోదరుడు మలవిసర్జనకు వెళ్ళారు. బహుశః అతిసారతో బాధపడుతున్నాడో ఏమో... గోడలు, నేలమీద అంతా మలం చిందింది. అదంతా శుభ్రంచేసి నేను నా పని పూర్తిచేసుకుని వచ్చేటప్పటికి కొద్దిగా ఆలస్యం అయింది. పద పోదాం’’ అన్నారు. ‘‘అయ్యో! ఎంత పనిచేసారు, మీరెందుకు శుభ్రం చేయడం. మాకు చెబితే మేం చేసేవాళ్ళం కదా..’’ అని సహాయకుడు అంటే...‘‘నేను చెప్పి మీరు చేయడం కాదు. నిన్నటిరోజున మరుగు దొడ్డి బాగా లేకపోతే గాంధీ బాగు చేసాడు అని అందరికీ తెలిసిన తరువాత మరుగు దొడ్డి ఎప్పుడూ పరిశుభ్రంగానే ఉంటుంది’’ అని చెప్పారు.అందుకే ‘‘స్వచ్ఛమైన భూగోళం కొరకు, స్వచ్ఛమైన శక్తి కొరకు సర్వదా ప్రయత్నిస్తాను’’ అని అబ్దుల్‌ కలాం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. గాంధీగారి దగ్గరకు యువతీ యువకులంతా వెళ్ళి తామందరం కూడా రాజకీయాల్లోకి రావడానికి సిద్దంగా ఉన్నామని అంటే...‘‘ఇది మీరు చదువుకోవలసిన వయసు.

మీకు రాజకీయాలతో సంబంధం లేదు. మీరు రాజకీయాల వైపు చూడకండి. మీరందరూ కూడా స్వచ్ఛంద సంస్థలుగా ఏర్పడి, మీతో ఉన్న స్నేహితులను కొందరిని తీసుకుని ఖాళీ సమయాల్లో పార్కులు, వీథులు, వైద్యశాలలు, దేవాలయాలు శుభ్రం చేయండి. అలా అందరికీ మార్గదర్శకం కండి. ఈ దేశ పరిశుభ్రత కోసం పాటుపడండి’’ అని వారికి దిశానిర్దేశం చేసారు.అమ్మ అన్నం వండి అక్కడ పెట్టగలదే కానీ మీ కడుపులోకి పంపి ఆకలి తీర్చలేదు కదా. మీ తల్లిదండ్రులు మీకోసం చదువుకోవడానికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ధనాన్ని వెచ్చించి పెద్దపెద్ద పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వం కూడా వేలకోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నది. ప్రతిభావంతులైన పేద విద్యార్థులను చదివించడానికి దాతలు ఎంతో ఉదారంగా ముందుకొస్తున్నారు. ఈ అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోండి. ఎక్కడా సమయాన్ని వృథా చేసుకోకుండా చదువుకుని వృద్ధిలోకి రండి. అలాగే సామాజిక సేవతో సామాజిక చైతన్యాన్ని పెంచుకోండి. మంచి నడవడిక అలవర్చుకోండి. ఉత్తమ పౌరులుగా ఎదగండి. మీ చదువు, మీ చైతన్యం చూసి స్ఫూర్తిపొంది మరోపది మంది మీ అడుగుజాడల్లో నడవడానికి అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు