ఇంట పాస్‌ ఇంటర్నేషనల్‌కు ప్లస్‌...

14 Nov, 2017 01:02 IST|Sakshi

‘‘అక్రమ రవాణా అడ్డుకుని 100 ఒంటెలను స్వాధీనం చేసుకున్నారు’’ టీవీలో ఇలాంటి వార్తని క్యాజువల్‌గా చూసి ఊరుకుంటాం. ఆమె మాత్రం వెంటనే అధికారులను సంప్రదించి తన వంతుగా ఆ మూగ జీవాల రవాణా వ్యయం భరించడానికి రెడీ అని చెబుతారు. మన చుట్టూ ఉన్న జంతువులను ప్రేమించడం అవసరం అంటూన్న శర్వాణి, వినూత్న శైలిలో పెట్స్‌ మేగజైన్‌ నిర్వహణలో తనదైన ముద్ర వేస్తున్నారు.

‘‘జంతువులు మనతో కలిసి బతకడాన్ని ఇష్టపడతాయి. యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా వన్యప్రాణులకు సన్నిహితంగా బతకడం అవసరమని సూచించే కార్యక్రమాలు అందిస్తున్నాం’’అని  హైదరాబాద్‌ పాస్‌ నిర్వాహకురాలు, పీపుల్స్‌ ఫర్‌ యానిమల్‌ సంస్థకు గౌరవ సభ్యురాలు శర్వాణి చెప్పారు. దిక్కూమొక్కూ లేని జంతువుల సమాచారాన్ని అందించమని కోరుతూ దేశంలోనే తొలి స్ట్రే యానిమల్‌ రెస్క్యూ యాప్‌ని సైతం రూపొందించిన శర్వాణి... మూగ జీవాలపై ప్రేమతో ఓ మేగజైన్‌ను ఏర్పాటు చేసి, అనుబంధంగా సేవా కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. ఆమె పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే...
 

నమ్మకాన్ని ‘పెంచుకున్నా’...
ఆటోమొబైల్‌ సబ్జెక్ట్‌లో డిగ్రీ చేశాను. ఉద్యోగం çకన్నా విభిన్నంగా ఏదైనా చేయాలనేది ఆలోచన. అదే హైదరాబాద్‌ పాస్,. పెంపుడు జంతువుల కోసం తొలి మేగజైన్‌. మొదట్లో కొనడం సంగతి దేవుడెరుగు. కొన్ని వేల కాపీలు డోర్‌ టు డోర్‌ పంచాం. ఒక దశలో ఎనర్జీస్‌ అన్నీ ఖర్చయిపోయినట్టు అనిపించింది. అప్పుడే మేగ్‌జైన్‌కే పరిమితం కాకుండా పలు కార్యక్రమాలకు విస్తరించాం. క్రీడాకారులకు, వికలాంగులకు, అనాథలకు ఆసరా, నిర్భయ వంటి సంఘటనల సమయంలో నిరసనలు, ప్రముఖులను భాగం చేస్తూ సేవా కార్యక్రమాలు, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద సంగారెడ్డి జిల్లాలో కొన్ని గ్రామాల్లో నిరాశ్రయులకు నీడ కల్పించడం, శానిటరీ ప్యాడ్స్‌ వాడడం నేర్పించడం, అపోహలు, మూఢ నమ్మకాలను తొలగించడం.. వంటివి చేస్తూ... హైదరాబాద్‌ పాస్‌ను ఒక సామాజిక సంస్థగా మార్చాను. మూగజీవాల పెంపకం, అనాథ జంతువుల దత్తత, పెట్స్‌ ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ హైదరాబాద్‌ పాస్‌ బెంగుళూర్, విజయవాడ తదితర నగరాల్లో కూడా ఉనికిని చాటుకుంది. మనసు పెట్టి చేసే ఏ పనైనా విజయం సాధిస్తుందనే నా నమ్మకాన్ని దాదాపు 75వేల కాపీలకు చేరిన హైదరాబాద్‌ పాస్‌... నిలబెట్టింది. వాటా విక్రయం ద్వారా దీనిని ఇక జాతీయ స్థాయికి తీసుకువెళ్లనున్నాం.


ఇక లైఫ్‌స్టైల్‌ మేగ్‌జైన్‌...
ఇంటర్నేషనల్‌ లైఫ్‌స్టైల్‌ మేగజైన్‌ను డిసెంబర్‌లో హ్యాష్‌ ట్యాగ్‌  పేరుతో లాంచ్‌ చేస్తున్నాం. తొలుత అమెరికా, భారత్‌లో నడపనున్నాం. ఫ్యాషన్, పేజత్రీ, పార్టీస్‌.. ఇలా కొన్ని అంశాలకే కాకుండా మరిన్ని విస్తృత అంశాలకు చోటు కల్పించనున్నాం. నాలుగేళ్లు కృషి చేసి సాధించిన అడ్మిషన్‌తో... వచ్చే ఏడాది హార్వర్డ్‌ వర్సిటీలో గ్లోబల్‌ ఎంబిఎ ఫైనాన్స్‌ కోర్సు చేయనున్నాను. ఇది మేగజైన్‌ల నిర్వహణలో మరింత ఉపకరిస్తుంది. వైవిధ్యంగా ఆలోచించడం, ఎవరూ ఊహించని రంగాలను ఎంచుకోవడం, ఎప్పటికప్పుడు మేధస్సుకు పదును పెట్టుకోవడం ఈ మూడు పనుల మేళవింపుతో పనిచేస్తే అద్భుతమైన విజయాలను అందుకోవచ్చు.
– ఎస్‌.సత్యబాబు

మరిన్ని వార్తలు