మంచి పోలిక

28 May, 2018 01:13 IST|Sakshi

కథాసారం

సన్నగా పొడుగ్గా , జనం మాటల్లో చెప్పాలంటే సామనలుపు కోడెవాడు అతను. తల మీద మోయలేనంత బరువున్న కట్టెల మోపును మోస్తా ఎంతో దవ్వు నుంచి వస్తున్నట్లు ఉండాడు. అతని మొకం నుంచి చెమట కారుతా ఉంది. నేను అతని మోపుకు చెయ్యి వేస్తా ‘‘దించు’’ అంటిని. అతనూ ఒక చెయ్యి వేస్తా తలను సరుదుకొంటా ‘‘విడవండి’’ అని మోపును కిందకు దించినాడు.

‘‘చానా ఇక్కట్టు అయిపోయె సామీ. ఎప్పుడూ ఆ మోపురాతి మీదనే దించతా ఉంటిని. ఈ పొద్దు తాళేకి కాలేదు. మీ అట్లా పెద్దోళ్లను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది’’ అన్నాడు.
‘‘ఇబ్బంది ఏముంది? అయినా ఇంత మోయరాని బరువును ఎందుకు ఎత్తుకొంటివి?’’ అంటిని నేను.
‘‘అయ్యో సామీ, మనిషికి ఆత్రము ఉంటాది కదా. నాలుగు కట్టెలు ఎక్కువ ఉంటే మొదటి వీదిలోనే వెలపోతాయి. మూడు కాసులు ఎక్కువగానూ వస్తాయి’’ అన్నాడు.

నేను తోవ పక్కన రాతిపైన కూచుని, అతన్నీ కూచోమని చెప్పి, ఇతని ఊరూవాడా మంచీచెడ్డా విచారించితిని. పేరు వెంకటరమణ. అయితే అందరూ వెంకటగా అనే పిలుస్తారు. ఇతనిలాంటి వాళ్లకు అది వెంకటగాడు అయిపోతుంది. జనం నోటిలో యంగటడుగా మారిపోతుంది. యంగటడు తిరుపతి పక్కన ఉండే ఒక పల్లెటూరి చిన్నోడు. బెంగుళూరులో బతుకును ఈడుద్దామని వచ్చినవాడు. ‘‘ఇంతదూరం ఎందుకు వస్తివి?’’

‘ఏమో యాసట అయిపోయె సామీ. కొంచెంనాళ్లు ఊరికి దూరంగా ఉండేది మంచిదని ఈ తావుకు వచ్చేస్తిని’.
‘ఇంత చిన్న వయసులో వేసట ఎందుకొచ్చిందయ్యా?’
‘నా తండ్రి మాదిరిగా అడుగుతా ఉండారు. లోకాన్ని ఎరిగినవారు ఒక నెమ్మది మాటను చెపితే నా మనసుకూ మంచిదే కదా’ అంటా అతను తన కతను చెప్పసాగినాడు.
∙∙l

వెంకటడు తన పల్లెలో కూలినాలి చేసుకొని బతికేవాడు. అత్తకూతురు రంగి వీడితోపాటే పెరిగింది. చిన్నప్పటి నుంచే వీళ్లిద్దరూ ఆలూ మోగుళ్లని పెద్దవాళ్లు అనేవాళ్లు. రంగి మంచి అందగత్తె. ఈడు వచ్చిన తరువాత వాళ్లకు పెండ్లి అయింది. కానీ అదే వేళకు వాళ్ల గ్రహచారమూ చెడింది. ఊర్లో పుణ్యాత్ముడయిన రెడ్డి ఒకాయన, తెరువులో కనిపించిన ఆ పడుచును చూసి, ఆమెకు నగలూ చీరలూ ఆశ చూపించి లొంగదీసుకున్నాడు.

‘‘అంత బిరాన జరిగిపోయిందా అంటావా నాయనా. మనకు తెలియక బిరాన అనిపిస్తుంది అంతే. అట్లా పుణ్యాత్ములు ఎన్నినాళ్లుగా ఈ ఎత్తుగడలో ఉంటారో మనకు తెలుస్తుందా? వాని మీసం ఏమి, వాని రుమాలు ఏమి, వాడు ఆ గుర్రానెక్కి పోతావుంటే ఆ దర్పం ఏమి? మగోడిని నాకే ఆ పదవి కావాల అనిపిస్తాదే, అట్లాంటోడు పిలిస్తే ఏ పడుచు పడకుండా ఉంటాది? ఏమీ తెలియని రంగి కూడా ఒప్పుకునేసింది.

తల్లితండ్రులు, ‘ఇది వద్దమ్మా కులానికే చెడ్డపేరు’ అనిరి. నేనూ చానా చెప్పి చూస్తిని. ఎంత మంచి ఆడది సామీ. కూలీకి పొయ్యే అప్పుడు నేను ఏదయినా ఎత్తుకొని పోదాము అంటే కూడా, ‘బద్దరం, దేవుడు చూస్తా ఉండాడు, మెట్టుతో కొడతాడు’ అనేది. అది ఏమి చెడ్డ గలిగో (లగ్నమో) సామీ, వానింట్లోనే నిలిచిపోయింది.

‘ఏమయినా మన ఇంటి కోడలు. రచ్చ పెట్టుకొంటే మన మర్యాదే చెడుతుంది. అక్కడయినా బాగా బతికితే చాలు. ఇంక దాని మాట వదిలెయ్యి’ అని మా అమ్మను నిలువరిస్తిని.
మా అత్త వచ్చి ‘నీ కాపురాన్ని చెడిపేసింది కదరా. ఓలిని వెనక్కి ఇచ్చేస్తాము. వేరే పడుచును పెండ్లాడు’ అనింది. అయినా నాకు ఇంకొక పెండ్లి చేసుకోవాలని అనిపించలేదు. ‘ఉండనీయండి ఇట్లే’ అనేస్తిని.
‘‘వెంకటప్పా, నువ్వు ఊరు వదిలి ఎన్నాళ్లయింది?’’
‘‘ఆరు నెలలు అయింది సామీ’’
∙∙l
ఆ తరువాత ఆ తోవలో నేను పదైదునాళ్లకో నెలకో ఒకసారి చూస్తానే ఉండాను. బేరాలు బాగుండాయా అంటా అడిగేవాడిని. ఒకనాడు, ‘నెల కిందట మా ఊరు నుంచి కాగితం వచ్చింది’ అంటా తన కొనసాగింపు కత చెప్పినాడు.

‘ఆ సావుకారోడు ఇంకొక ఆడదాన్ని మోసుకుని వచ్చెనంట. వాని ఇంట్లో పెద్ద రచ్చ జరిగెనంట. ఈ పడుచుకూ చానా యాసట అయిపోయి ‘నేనూ నీ దగ్గర ఉండను’ అనిందంట. దానికి వాడు ‘నువ్వేమి తాళి కట్టించుకొన్న పెండ్లాన్ని అనుకుంటా ఉండావా? ఉడుకు సంగటి దొరుకుతుందని నోరు తెరుచుకుని వచ్చిన కుక్కా, నీకెంత ఆంకారమే?’ అనెనంట. ‘దేవుడట్లా మొగుడ్ని విడిచి నీ దగ్గరకు వస్తిని. నా బుద్దికి మంకు పట్టి ఉండింది, ఆ పొద్దు మంచిగ మాట్లాడి నన్ను చెడిపి, మిండడివి అయితివి. ఈ పొద్దు చెడ్డగా మాట్లాడి నన్ను బాగుపరిస్తివి. నువ్వు ఇప్పుడు నాకు తండ్రివి’ అని వాడు ఇచ్చిన నగానట్రా అన్నిటినీ అక్కడనే వదిలేసి, వాడి పెండ్లాము కాళ్లకు మొక్కి ‘నేను నీ పడకను చెరిపితిని, నా పాపాన్ని మన్నించు’ అని వేడుకొని బయటకు వచ్చేసిందంట.

మా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మతో ‘నువ్వు చెప్పిన పని చేసుకొంటా నువ్వు పెట్టింది తింటా ఉంటాను’ అనిందంట. మా అమ్మ ఏమి చెప్పాలా అని ఆలోచిస్తా ఉంటే మా అత్త వచ్చి ‘కావలసినప్పుడు పోయి వద్దనుకున్నప్పుడు వస్తా ఉంటావా. నీకు కూడు పెట్టచ్చో పెట్టకూడదో చెప్పే యజమానుడు ఇక్కడ లేడు. వాడు ఉండే దగ్గరకు పోయి, వాడు ఒప్పుకొంటే బతుకు, లేదంటే పాడయిపో’ అని తిట్టిందంట. ‘రేపు బెంగుళూరుకు బయలుదేరి వస్తాద’ని కాగితంలో రాసి ఉండింది. కాగితంలోని ఆ మాటలను విని సంతోషపడితినో బాదపడితినో నాకే తెలియలేదు. మరునాడు కట్టెల కోసం పోకుండా పాళెంలోనే ఉంటిని.

జనాన్ని అడుగుతా సరాసరి నేను కూచునుండే అరుగు దగ్గరకు వచ్చేసింది. నన్ను చూస్తానే తల దించుకొనింది. ఆ వెంటనే దగ్గరకు వచ్చి బిడ్డను కాళ్ల మీద పెట్టి తానూ తలను నేలకు తాకించి ‘నా దేవుడు తిరిగి దొరికినాడు, బతికించాల అనుకొంటే బతికించు, చంపేయాల అనుకొంటే చంపేయి’ అంటా ఏడిచింది.

నేను బిడ్డను ఎత్తుకొంటిని. ‘పసిబిడ్డను ఇట్లా పడేస్తావా, లెయ్యి’ అని దానిని లేపి నిలబెట్టి, నేనుండే ఇంటి ఆడవాళ్లను పిలిచి ‘నా పెండ్లాము వచ్చింది, ఒక ఇల్లు చూసుకొనే వరకూ ఇక్కడ కొంచెం చోటు ఇయ్యమ్మా’ అని అడిగితిని’.

నాకు అతని పెద్దమనసును చూసి ఆశ్చర్యమయింది. ‘‘బిడ్డనూ బాగా చూసుకోవాల’’ అంటిని.
‘‘చూసుకొంటాను సామీ. దానిని ఒప్పుకొంటాను కానీ బిడ్డను ఏమంటానో అని దానికి దిగులు ఉండొచ్చు. వచ్చిననాడే కాసేపు అయినాక బిడ్డను నా చేతికిచ్చి ‘బిడ్డ ముక్కూ మూతీ చూడు అంతా నీ అట్లానే ఉంది’ అనింది. అది అవునో కాదో నేనెందుకు చూడాల? నేను అవును అంటిని. ఆమెకు నెమ్మది అయింది. బిడ్డ ఎవరిది అయితే ఏమి? సాకినవాళ్లు పుణ్యాత్ములు’’.

‘‘ఇప్పుడు బిడ్డకు ఏడాదిన్నర అయిందా?’’ అని అడిగితిని నేను.
‘‘ఒక నెల ఎక్కువో తక్కువో. అడిగి చేసేది ఏముంది? అడిగితే అనుమానిస్తా ఉండానేమో అని నొచ్చుకుంటాది. దానిని సంతోషంగా ఉండనీ సామీ, నా మాట ఎందుకు?’’ అన్నాడు.
వెంకటప్ప ఒక్కొక్క మాటా అతని సంస్కారము ఎంత గొప్పదో తెలియచేస్తా ఉంది.
∙∙l

రథసప్తమి నాడు, నేను వెంకడిని మొదటిసారి చూసిన దిన్నకు అవతల కలిస్తిని. ‘‘అంతా బాగుండారా?’’ అని అడిగితిని. ‘‘పెద్దల దీవెనలు’’ అని ‘‘ఊరి నుంచి మొన్న ఒక కాగితము వచ్చింది నాయనా. ఆ సావుకారిని ఎవరో నరికేసిరంట. పాపం అన్యాయంగా చెడిపోయినాడు’’ అన్నాడు.

‘‘దీనిని మీ ఇంట్లో చెప్తివా?’’ అని అడిగితిని నేను. 
‘‘అందరూ నీ అట్లా మంచివాళ్లే ఉంటారా? వీదిలోకి వచ్చిన పామును ఎవరో ఒకరు చంపే తీరుతారు’ అనింది అన్నాడు వెంకటప్ప.
ఈ మాటల్లోనే మేము దిన్న నెత్తిమీదికి వస్తిమి. ‘‘అదిగో చూడండి నాయనా. అక్కడ కనబడతా ఉండే వాళ్లే నా పెండ్లాం బిడ్డలు’’ అన్నాడు. నేను అటుపక్కకు చూస్తిని. తల్లి తన బిడ్డకు నాలుగు దేవగన్నేరు పువ్వులను ఇచ్చి ఆడిస్తా ఉంది. రెండు అడుగులు ఆ పక్కకు పెట్టేసరికి ‘‘సామీ ఒక మాట. మన సాములోరు అని దానితో చెప్తాను. తల్లీ బిడ్డలను దీవించండి, కానీ ఊర్లో జరిగిన సంగతులు ఏమీ మీకు తెలిసినట్లు ఉండకూడదు. దాని మనసు నొచ్చుకుంటాది కదా’’ అన్నాడు వెంకటప్ప. 

మేము పాతూరు దగ్గరికి వస్తిమి. వెంకటడి పెండ్లాము లేచి నిలబడింది. బిడ్డ చేతిని పట్టుకొని తన కాళ్ల దగ్గర నిలబెట్టుకునింది. మొదట ఒక్క క్షణం ఆ బిడ్డ వెంకటడు లాగా ఉందా అని చూడాలనిపించింది. చేపట్టిన మొగుడే చేయని పరీక్షను నేను చేసేది ఎందుకు అనుకొని ఊరుకొన్నాను.

మాస్తి వెంకటేశ అయ్యంగార్‌(1891–1986) కన్నడ కథ ‘వెంకటగాని పెండ్లాము’ సంక్షిప్త రూపం ఇది. దీన్ని నంద్యాల నారాయణరెడ్డి తెలుగులోకి అనువదించారు. ‘మాస్తి కన్నడ ఆస్తి’ అని కన్నడిగులు సగర్వంగా చెప్పుకునే గొప్ప కథా రచయిత మాస్తి. శ్రీనివాస కలంపేరుతో రాసేవారు. జ్ఞానపీఠ పురస్కారం స్వీకరించారు. 

మరిన్ని వార్తలు