జగమెరిగిన చిన్నారులు

14 Nov, 2019 00:27 IST|Sakshi

వండర్‌ఫుల్‌ సిస్టర్స్‌

వీక్షిత, మౌనికాశ్రీ అక్కాచెల్లెళ్లు. వీక్షిత ఆరో తరగతి, మౌనిక రెండో తరగతి చదువుతున్నారు. ఇప్పటికే వీళ్లు జ్ఞాపకశక్తిలో అనేక రికార్డులు, అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వీక్షిత ఇప్పటివరకు 48 రికార్డులు, 35 అవార్డులు అందుకుంది. మౌనికాశ్రీ 22 రికార్డులతోపాటు 15 పురస్కారాలను కైవసం చేసుకుంది. వీక్షిత ఈ వయసుకే ఇంటర్మీడియట్‌ గణిత సూత్రాలు (220), రసాయన శాస్త్ర ఆవర్తన పట్టికలోని మూలకాల పేర్లు, వాటి సంఖ్యలు,  ఫార్ములాలు (200), రామాయణ.

మహాభారతాలలోని పర్వాల పేర్లు, అబ్రివేషన్స్‌ (100), శాస్త్రవేత్తలు–వాళ్లు కనిపెట్టిన యంత్రాలు, డ్యామ్‌లు, ప్రాజెక్టులు, త్రికోణమితి, ఆల్జీబ్రా, ఘాతాలు, ఘాతాంకాలు, వర్ణాలు, ఘనాలు, భగవద్గీత శ్లోకాలు, తెలుగు సంవత్సరాల పేర్లు (60) తదితరాలను కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే చెప్పేస్తుంది. దీంతోపాటు అబాకస్, స్పెల్‌–బీ, కుంగ్‌ఫూలలోనూ ప్రతిభ కనబరుస్తోంది. మౌనికాశ్రీ కూడా అక్క అడుగుజాడల్లోనే.. జ్ఞాపకశక్తికి ప్రతీక అయింది.

మెడికల్‌ టెర్మినాలజీ, రాష్ట్రాలు, నాట్యాలు, శాస్త్రవేత్తల పేర్లు, దేశాలు–వాటి రాజధానులు, ఆయా దేశాల జాతీయ క్రీడలు, రైల్వే జోన్ల పేర్లు, అమెరికాలోని రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లు, భారతదేశానికి సంబంధించిన అనేక రకాల అంశాలు, గణిత శాస్త్రజ్ఞులు, వారు కనుగొన్న సూత్రాలు, పాఠ్యాంశాలు, సంఖ్యలు, పద్యాలు తదితరాలను ఐదు నిమిషాల 26 సెకండ్ల వ్యవధిలో చెప్పేస్తుంది. వీరిరువురూ జ్ఞాపకశక్తి పోటీలలో రాణిస్తుండటంతో వీరు చదువుతున్న ‘అక్షర’ పాఠశాల యాజమాన్యం వీరికి ఉచితంగా విద్యాబోధన చేస్తోంది. హైదరాబాద్‌లోని చింతల్‌లో నివసిస్తున్న బోడేపూడి రామారావు, నాగస్వప్న దంపతుల కుమార్తెలు ఈ ఆణిముత్యాలు.
– కొల్లూరి. సత్యనారాయణ,
సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా