ఇల్లు చాలా డేంజర్‌

3 Dec, 2018 02:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పనిచేసే చోట జరుగుతున్న వేధింపులపై స్త్రీలు ‘మీటూ’ అంటూ బయటికి వస్తున్నారు. ‘మా ఇంట్లో కూడా’ అని బాధిత మహిళలు బయటికి వచ్చే పరిస్థితి వస్తే కనుక అది కూడా చేజేతులా పురుషులు తెచ్చుకున్నదే అవుతుంది.

మహిళలు ధరించే ఆభరణాల బరువును తులాల లెక్కన తూచగలం కానీ, మహిళలు భరించే గృహహింసల్ని ఏ తూనికలు, కొలతలతో తేల్చగలం? అయినప్పటికీ పాపం.. న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి, మనదేశంలోని ‘నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో’ ఏడాదికిన్ని గృహహింసల మరణాలనీ, రోజుకింతమంది మహిళల ప్రాణాలు గాల్లో కలిసి పుట్టింటికి చేరుతున్నాయని చెప్పే ప్రయత్నమైతే చేస్తున్నాయి. ఎందుకీ ప్రయత్నం? దేశాల కోసం. మరింత మెరుగైన నివారణ చర్యలు చేపడతాయేమోనని. ఎందుకీ ప్రయాస? మగాళ్ల కోసం. తప్పు తెలుసుకుని కాస్తయినా మారతారేమోనని!

అయినా ఈ గృహహింసల్ని, గృహహింస మరణాల్ని లెక్కేయడం ఎలా సాధ్య మౌతుందనిపిస్తుంది. జనాభా లెక్కల వాళ్లయినా, ఇంటికొచ్చి తలుపు తట్టి ‘ఎంతమంది ఉన్నారు?’ అని అడిగే కదా రాసుకుని వెళతారు. ఏదైనా అంతే. ఇళ్లు, కోళ్లు, కార్లు, స్టౌవ్‌లు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు.. ఏవైనా. ఇవన్నీ చూసి.. ఉన్నవాళ్లింతమంది, లేనివాళ్లింతమంది అని టిక్‌ చేసుకుని వెళతారు. ఉండీ లేనట్లు కనిపించేవాళ్లు లెక్కలకు అందరు. గృహబలిమిని ఇలా ఏదో ఒక స్కేల్‌లో లెక్కేయగలరు గానీ, ‘గృహబలుల్ని’ ఎలానూ లెక్కేయలేరు. భర్త, అత్తమామలు కొడుతున్నారని బాధితురాలు బయటికి రావాలి.

భర్త, అత్తమామలు కొట్టి చంపేశారని చనిపోయిన మహిళ అన్నో నాన్నో బయటికి రావాలి. వచ్చి పోలీస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలి. పోలీస్‌లు ఎఫ్‌.ఐ.ఆర్‌. రాయాలి. అప్పుడే ఐరాసకు గానీ, నేషనల్‌ క్రైమ్‌ బ్యూరోకి గానీ లెక్క అందుతుంది. ఆ లెక్కల్ని తక్కెడలో వేసి పోయినేడాది కంటే ఈ ఏడాది ఇంత హింస పెరిగిందనీ, లేదంటే ఇంత హింస తగ్గిందనీ, ఆ దేశం ఈ దేశం కంటే బెటరనీ, ఈ దేశం ఆ దేశం కంటే వరస్ట్‌ అనీ డేటాను విశ్లేషించి, విడుదల చేస్తారు. మరి విశ్లేషణకు అందని డేటా మాటేమి? నాలుగ్గోడల మధ్యే సమాధి అయిపోతుంది.. ఏనాటికీ గొంతెత్తని, గొంతెత్తే పరిస్థితే లేని అసహాయురాలైన మహిళలా!

ఇల్లు చాలా డేంజర్‌. ఎందుకంటే.. నాలుగ్గోడల మధ్య స్త్రీకి రక్షణా ఉంటుంది, రక్షణ లేని విషయాన్ని బయటపడనివ్వని అడ్డూ ఉంటుంది. లోపల అమ్మాయి ఎలా ఉందో లోపలికి వెళ్లకుండా తెలుసుకోలేం. లోపలికి వెళ్లినా అమ్మాయి బయటపడకుంటే అప్పుడూ తెలుసుకోలేం. వెలుగులోనే ఎంత అంధకారం! ‘నా తల్లి నవ్వులో ఎన్ని వెన్నెల పువ్వులో’.. అనుకుంటూ ఆమె కోసం ఊర్నుంచి తెచ్చినవేవో ఇచ్చి, కడుపునిండా తృప్తితో అమ్మానాన్న తిరిగి బసెక్కడానికి వచ్చేస్తే.. వారితో పాటు అమ్మాయి ఆక్రందన బస్సువరకూ వినిపిస్తుందా? ఊహు!

స్త్రీకి బయట ఏదైనా జరుగుతుంటే ఏ పుణ్యాత్ములైనా అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఏ ధైర్యవంతులైనా పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పే అవకాశం ఉంటుంది. అడ్డుపడేవాళ్లు, పోలీసులకు ఫోన్‌ చేసేవాళ్లూ ఎవరూ లేకపోయినా ఆ మహిళ ప్రాణరక్షణ కోసం కనీసం పరుగెత్తిపోయే అవకాశమైనా ఉంటుంది.. రోడ్డు మీద నాలుగు గోడలు ఉండవు కాబట్టి. ఇల్లు అలాక్కాదు. ఇల్లు తప్పించుకుపోనివ్వదు. బైట గేట్లేసి ఉంటాయి. లోపల ఇంటి తలుపులు వేసి ఉంటాయి.

వెనక దారి ఉంటే అవీ మూసి ఉంటాయి. ఇంకెక్కడికి తప్పించుకోవడం? హాల్లోంచి కిచెన్‌లోకి, కిచెన్‌లోంచి బాత్రూమ్‌లోకి, బాత్రూమ్‌లోంచి ఇంకో గదిలోకి, ఆ ఇంకో గదిలోంచి.. బెల్ట్‌ చేత్తో పట్టుకున్న వాడి దగ్గరకి, వాడి బెల్టు జారకుండా చేత్తో పట్టుకుని ఉన్న వారి దగ్గరికి, కొట్టీ కొట్టీ వాడు అలసిపోతే, వాడిని లేపి కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్న వారి దగ్గరికి! కొడుతున్న దెబ్బలు, పెడుతున్న పెడబొబ్బలు పక్కింటికైనా వినిపించవు. ఎవరి గృహహింస వారిదైపోయాక ఇంకేం పక్కిళ్లు!

ఈ ఏడాది జూన్‌లో.. ‘స్త్రీకి ప్రపంచంలోకెల్లా మోస్ట్‌ డేంజరస్‌ కంట్రీ.. ఇండియా’ అని ఒక రిపోర్ట్‌ వచ్చింది. లండన్‌లోని ‘థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌’ ఇచ్చింది ఆ నివేదిక. ‘మీ కోడల్ని చంపుకుతింటున్నారటగా’ అని అడిగితే.. ‘అబ్బెబ్బే ఇంకెవరి కోడలి గురించైనా మీరు విని ఉంటారు’ అని భుజాలు తడుముకున్నట్లు.. ఇండియా వెంటనే ఖండించింది. ‘ఏ దేశాన్ని చూసి ఏ దేశం అనుకున్నారో..’ అని రాయిటర్స్‌ ఫౌండేషన్‌ మీద మన ఉమన్‌ డెవలప్‌మెంట్‌ శాఖలోని అధికారులు సెటైర్‌ వేశారు. ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు మరో నివేదిక వచ్చింది. అదే.. ఐరాస వాళ్లది.

మహిళకు ప్రపంచంలోకెల్లా మోస్ట్‌ డేంజరస్‌.. ఆమె ఇల్లేనట! మనదేశ మహిళకు అని కాదు. ఏ దేశంలోనైనా గృహమే మహిళకు నరక సీమ అని ఐక్యరాజ్య సమితి రూఢీ చేసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఎవరూ వ్యతిరేకించలేదు. ఖండించలేదు. మౌనంగా ఉండిపోయారు.. కొత్త విషయం ఏముంది ఇందులో అన్నట్లు. ‘మీ ఇంట్లో ఆడవాళ్లపై హింస జరుగుతోంది’ అని న్యూయార్క్‌ నుంచి ఐరాస వచ్చి చెప్పాలా? ఇంటాయనకు తెలీదా! ఆయనకు సపోర్టుగా ఆమెను జుట్టు  పట్టుకుని కొట్టే ఇంటి మనుషులకు తెలీదా?

ఏమిటి దీనికి పరిష్కారం? ఇంట్లోంచి బయటికి వచ్చేయడం. ఒంటిపై.. కనిపించకుండా ఉండి, కుటుంబ గౌరవాన్ని కాపాడుతున్న గాయాలను బయటికి చూపించడం. స్త్రీ మాన మర్యాదల్ని భంగపరిచే ఇంటికి గౌరవం ఉన్నట్లు? దాన్ని దాచాల్సిన అవసరం ఏం ఉన్నట్లు? పనిచేసే చోట జరుగుతున్న వేధింపులపై స్త్రీలు ‘మీటూ’ అంటూ బయటికి వస్తున్నారు. ‘మా ఇంట్లో కూడా’ అని బాధితుల మహిళలు బయటికి వచ్చే పరిస్థితి వస్తే కనుక అది చేజేతులా పురుషులు తెచ్చుకున్నదే అవుతుంది. 
 
లెక్కలు కాకుండా ఐరాస  ఇంకా ఏం చెప్పింది?
► ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళల ‘గృహమరణాలను’ ప్రపంచ దేశాలు ఆపలేకపోతున్నాయి.
► 2012 నుంచి మహిళల గృహమరణాలు మరీ ఎక్కువయ్యాయి.

మహిళల గృహమరణాలను తగ్గించడానికి, నిర్మూలించడానికి ఐరాసా ఏం చెయ్యాలంది?
► పోలీసు వ్యవస్థకు, నేర విచారణ వ్యవస్థకు, ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య సమన్వయం ఉండాలి.
► గృహమరణాల వెనుక ఏ విధమైన ఉద్దేశాలు ఉంటున్నాయో, వాటి మూల కారణాలేమిటో అధ్యయనం చేయాలి.
► గృహమరణాలను తగ్గించడానికి పురుషుల సహాయాన్నీ తీసుకోవాలి. పురుషాధిక్యం, స్రీవిధేయత అనే పూర్వపు భావజాలాలను మార్చే ప్రయత్నం చేయాలి.

మన  దేశంలో?
మామూలే. డౌరీ డెత్స్‌. వరకట్న మరణాలు! ఇండియాలో సంభవిస్తున్న మహిళల గృహమరణాలలో ఎక్కువ భాగం వరకట్నం వేధింపుల వల్లనేనని యు.ఎన్‌.ఒ.డి.సి నివేదిక పేర్కొంది. ఇందుకోసం 2016 నాటి సర్వే వివరాలనే పరిగణనలోకి తీసుకుంది. ఆ ఏడాది భారతదేశంలో మహిళల బలవన్మరణాల రేటు 2.8 శాతంగా ఉంది. ఇది.. మహిళల పాలిట నరక దేశాలని మనం భావిస్తున్న కెన్యా కంటే (2.6), టాంజానియా కంటే (2.5), అజర్‌బైజాన్‌ కంటే (1.8), జోర్డాన్‌ కంటే (0.8), తజికిస్తాన్‌ కంటే (0.4) ఎక్కువ! మరొక సంగతి. 15–45 ఏళ్ల మధ్య వయసులోని భారతీయ మహిళల్లో 33.5 శాతం మంది గృహహింసకు గురవుతున్నారు. మన దేశ ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ లెక్కల ప్రకారం ఏటా సంభవిస్తున్న మహిళల గృహ మరణాలలో 40 నుంచి 50 శాతం వరకు వరకట్నం వల్ల సంభవిస్తున్నవే.


ప్రపంచవ్యాప్తంగా  2017లో బాలికలు, యువతులు, మహిళల బలవన్మరణాలు

50,000: భర్త లేదా ఇతర కుటుంబ సభ్యుల చేతుల్లో, చేతలవల్ల దుర్మరణం పాలైన మహిళల సంఖ్య.
 

17,000: పై యాభై వేలల్లో భర్త, లేదా పూర్వపు భర్త పెట్టిన భౌతికహింస తాళలేక దుర్మరణం చెందిన మహిళల సంఖ్య.
 

87,000: లైంగిక వివక్ష కారణంగా ప్రాణాలు కోల్పోయిన మొత్తం మహిళలు, బాలికల సంఖ్య (పై 50 వేల మందితో కలిపి).
 

137: గృహహింస కారణంగా చనిపోతున్న మహిళల సంఖ్య.. రోజుకు.

నివేదిక ఎవరిది?
ఐక్యరాజ్యసమితి ‘ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌’ (యు.ఎన్‌.ఒ.డి.సి)

ఎప్పుడు విడుదలైంది?
నవంబర్‌ 25న. అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినం సందర్భంగా.

ఎవరు ఎంత మూట కట్టుకున్నారు?
ఆసియన్‌లు : 20,000
ఆఫ్రికన్‌లు : 19,000
అమెరికన్‌లు : 8,000
యూరోపియన్‌లు : 3,000
ఓషియానియన్‌లు : 300

.......................................................
లక్షకు మరణాల రేటు
ఆఫ్రికా : 3.1
అమెరికా : 1.6
ఆసియా : 0.9
యూరప్‌ : 0.7

మరిన్ని వార్తలు