పాడు చేతుల నుంచి కాపాడుకో

3 Dec, 2018 02:47 IST|Sakshi
‘వింగ్‌ చున్‌’ను సాధన చేస్తున్న కార్పొరేట్‌ ఉద్యోగినులు

యిమ్‌ వింగ్‌ చున్‌ / యుద్ధకళ

అననుకూల ప్రదేశాలనీ, సమయాలనీ, ముందు జాగ్రత్తలతో ప్రయాణాలనీ, ఇలా ఎన్ని తరాలని భయాలను వెంటేసుకుని  దినదిన గండంగా మసులుకోవాలి?   ‘మీటూ’ వంటి ఉద్యమాలు మహిళల్లో చైతన్యం పెరుగుతున్న విషయాన్నీ, అదే సమయంలో మహిళలపై వేధింపుల తీవ్రత, లోతుల్ని తెలియజేస్తున్న నేపథ్యంలో వేధింపుల గురించి చెప్పడానికి ధైర్యం చేసిన మహిళలు ఎదుర్కోవడానికీ మరింత ధైర్యంగా సిద్ధం కావాలి. స్వీయరక్షణ నేర్వాలి.

అకస్మాత్తుగా, అనూహ్యంగా వేధింపులకు గురైన మహిళ అచేతనురాలు అవుతుంది. నెర్వస్‌నెస్, భయం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఆత్మవిశ్వాసం నీరుగారిపోతుంది. ఇవన్నీ ఆ పరిస్థితిని ఎదుర్కునే శక్తియుక్తుల్ని మరింతగా తగ్గించివేస్తాయి. అందుకే కొన్ని స్వీయరక్షణ మెళకువలు, మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం ఇదే ఆలోచనతో పలువురు మహిళలు, కార్పొరేట్‌ ఉద్యోగినులు మార్షల్‌ ఆర్ట్స్‌ ఎంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వీరు బాగా ఆసక్తి చూపుతున్న స్వీయరక్షణ శైలిగా వింగ్‌చున్‌ కుంగ్‌ఫూ పేరొందింది. ఎందుకంటే...

అన్నీ అనువైనవి కావు
 ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధ కళలు, శైలులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మార్షల్‌ ఆర్ట్స్‌ మిలటరీ శిక్షణ తరహాలో కఠినంగా ఉంటాయి. ఇటుకరాళ్లు పగుల గొట్టడం వంటివి అందరూ సాధన చేయగలిగినవి కావు. దాదాపుగా అన్ని యుద్ధ కళలూ పురుషుల చేత, పురుషుల కోసం రూపొందించినవే కావడం దీనికో కారణం.

మహిళల చేత.. మహిళల కోసం
దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన వింగ్‌ చున్‌ కుంగ్‌ ఫూ మాత్రమే ప్రపంచంలో మహిళ సృష్టించిన యుద్ధ కళ. కొంగ, పాముల మధ్య పోరాటాన్ని చూసిన తర్వాత వచ్చిన స్ఫూర్తితో, దీన్ని ఎంగ్‌ మ్యూ అనే షావొలిన్‌ బుద్ధిస్ట్‌ మఠాధిపతి హోదాలో ఉన్న చైనీస్‌ మహిళ..  వాటి కదలికల్ని చైనీస్‌ కుంగ్‌ ఫూ రూపంలో మేళవించి రూపొందించారని చెబుతారు. ఆ తర్వాత ఆమె యిమ్‌ వింగ్‌ చున్‌ అనే శిష్యురాలికి ఈ కళను ధారాదత్తం చేశారట. ఎంతో అందమైన  ఆ యువతి తనను పెళ్లాడమని వేధిస్తున్న  దృఢకాయుడిని ఓడించేందుకు ఈ కళనే ఆధారం చేసుకుందట. నిజానికి ఆమె అందగత్తే కాబట్టే పురుషుల అవాంఛనీయ వేధింపుల నుంచి రక్షించుకోవడానికే ఎంగ్‌ మ్యూ ఈ కళను నేర్పిందంటారు. ఈ యుద్ధ కⶠ వింగ్‌ చున్‌గా ప్రాచుర్యంలోకి వచ్చి ఆ తర్వాత తర్వాత యిమ్‌ వింగ్‌ చున్‌గా మారింది. దీన్ని మహిళే డిజైన్‌ చేసినప్పటికీ... బ్రూస్‌లీ గురువు, గ్రాండ్‌ మాస్టర్‌ ఐపి మ్యాన్‌ దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కోట్లాది మంది వింగ్‌ చున్‌ను ప్రపంచవ్యాప్తంగా సాధన చేస్తున్నారు.

శక్తి ప్రదర్శన కోసం కాదు
ఒక వేధింపు పరిస్థితి నుంచి పుట్టిన ఈ యిమ్‌ వింగ్‌ చున్‌.. సంపూర్ణమైన స్వీయ రక్షణాత్మక యుద్ధకళ. అంతే తప్ప తన శారీరక శక్తిని ప్రదర్శించుకోవడానికి కాదు. మహిళల్లోని అత్యంత నిగూఢమైన శక్తి యుక్తుల్ని ఇది వెలికి తీస్తుంది. ప్రత్యర్ధి అంతరంగం లో ఉద్దేశాలనూ  పసిగట్టేందుకూ ఉపకరిస్తుంది. కొంగ చూపే ఉగ్రతత్వం, ఏకాగ్రత పూర్వక దాడి, సర్పంలా మెలికలు తిరిగే గుణం.. ఇవన్నీ దీనిలో కలిసి ఉంటాయి. ఎటువంటి ప్రత్యేక వస్త్రధారణగాని అవసరం లేదు.  మగవాళ్లు / మహిళలు  నేర్చుకోవచ్చు. ఏ రకమైన శరీర తత్వం అయినా ఓకే. ఎలివేటర్స్, వాష్‌ రూమ్స్, మెట్లు, ఇరుకు గల్లీలు, సన్నని కారిడార్స్‌... వంటి ఇరుకైన ప్రదేశాల్లో సమర్ధంగా పోరాడేందుకు వీలు కల్పించడం వింగ్‌ చున్‌ ప్రత్యేకత.  తగిన వెలుతురు లేకపోయినా లేదా పూర్తి అంధకారంలో కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఎక్కడ నేర్పిస్తారు?
స్వీయరక్షణ సామర్ధ్యాలను మహిళలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్‌జిఓ ‘స్వరక్షణ్‌ ట్రస్ట్‌ ఇండియా వింగ్‌ చున్‌ అకాడమీ’ (ఐడబ్లు్యసిఎ) స్కూల్స్‌ నిర్వహిస్తూ వింగ్‌ చున్‌ కుంగ్‌ ఫూను కార్పొరేట్స్‌కి, ఎన్‌జిఓలకు నేర్పుతోంది. అలాగే ఉమెన్స్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తోంది. గత పదేళ్లుగా ముంబయి, ఢిల్లీ, పుణేలలో నిర్వహిస్తూ ఇటీవలే హైదరాబాద్‌లో శిక్షణా కేంద్రం స్థాపించింది.

రెండేళ్లు సాధన...
► ఇది ఆధునిక యుగానికి నప్పే అత్యంత ప్రాక్టికల్‌ శైలి. అత్యంత జనసమ్మర్దం కలిగిన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందింది.
► కనీసం 10 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ సమయం పట్టే ఇతర మార్షల్‌ ఆర్ట్స్‌తో పోలిస్తే దీనిని  తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. సరైన పద్ధతిలో సాధన చేస్తే రెండేళ్లు చాలు.
► అన్ని రకాల పరిమాణంలో, షేప్స్‌లో ఉన్న అందరూ  దీన్ని సాధన చేయవచ్చు.
► శక్తి కన్నా స్ట్రక్చర్‌ని, వేగం కన్నా టైమింగ్‌ని అధికంగా ఉపయోగించుకుంటుంది.  సాధారణ మానవ శరీరపు తీరుపై ఆధారపడుతుంది కాబట్టి జంతువుల కదలికలను అనుసరించక్కర్లేదు. సాధకులకు అసాధారణ ఫ్లెక్సిబులిటీ, క్రీడా నైపుణ్యం  అవసరం ఉండదు.
► ప్రాధమికంగా ఇది ఖాళీ చేతులను కదిపే శైలి. మనల్ని మనం రక్షించుకోవడానికి ఉద్దేశించింది కాబట్టి నిరాయుధులుగా ఉన్నా ఉపయోగించవచ్చు.
► అకస్మాత్తుగా జరిగే దాడుల నుంచి రక్షించుకునేందుకు వీలైన శిక్షణ ఇందులో ప్రధానం.


వేధింపులను సమర్ధవంతంగా ఎదుర్కునే కళను నేర్చుకుంటున్న యువతులు

– ఎస్‌.సత్యబాబు

మరిన్ని వార్తలు