పీఛేముడ్ జైలుకెళ్లిన మంత్రగత్తె..

26 Sep, 2015 23:58 IST|Sakshi
పీఛేముడ్ జైలుకెళ్లిన మంత్రగత్తె..

ఒకప్పుడు బ్రిటిష్ చట్టాలు చేతబడి వంటి విద్యలను శిక్షార్హమైన నేరాలుగా పరిగణించేవి. ‘హెల్లిష్ నెల్’గా పేరుమోసిన మంత్రగత్తెకు 1944లో బ్రిటిష్ ప్రభుత్వం చేతబడుల చట్టం (విచ్‌క్రాఫ్ట్ యాక్ట్) కింద జైలుశిక్ష  విధించింది. చేతబడి నేరానికి జైలుశిక్ష అనుభవించిన చిట్టచివరి మంత్రగత్తెగా ఈమె చరిత్రలో నిలిచిపోయింది. ‘హెల్లిష్ నెల్’ అసలు పేరు హెలెన్ మెక్‌ఫార్లేన్. మంత్రతంత్రాల సాధనలో మునిగితేలే ఈమెను పదహారో ఏటనే తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తర్వాత ఆమె హ్యారీ డన్‌కన్ అనే మంత్రగాడిని పెళ్లాడింది. ఇద్దరూ కలసి ఆత్మలతో సంభాషణ పేరిట జనాన్ని యథాశక్తి బురిడీ కొట్టిస్తూ బాగా సొమ్ము చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పాశ్చాత్య దేశాలలో ఇలాంటి విద్యలకు గిరాకీ మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం నాటికి అక్కడి జనాల్లో ఈ పిచ్చి పీక్‌కు చేరుకుంది.

అలాంటి రోజుల్లో ‘హెల్లిష్ నెల్’ ప్రదర్శనలకు జనం తండోప తండాలుగా వచ్చేవారు. ప్రదర్శనలకు వచ్చే వారి నుంచి ఆమె భారీగా ప్రవేశ రుసుము వసూలు చేసేది. ఆమె ప్రదర్శించేదంతా బురిడీ విద్య మాత్రమేనంటూ 1931లోనే హ్యారీ ప్రైస్ అనే మానసిక శాస్త్రవేత్త బయటపెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే, ఆమె వ్యవహారం ప్రభుత్వానికే ఎసరుపెట్టే స్థాయికి చేరుకోవడంతో, చట్టాన్ని ప్రయోగించింది. ఇంతకీ ఏమైందంటే, 1941లో బ్రిటిష్ యుద్ధ నౌక ‘బర్హామ్’ జర్మనీ సమీపంలో తుపాను ధాటికి సముద్రంలో మునిగిపోయింది. అందులోని 800 మందీ మరణించారు.

ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చెందుతాయని భావించి ప్రభుత్వం ఈ సంగతిని దాచిపెట్టింది. ఆ సంఘటన తర్వాత కొన్నాళ్లకు తన వద్దకు వచ్చిన ఒక మహిళతో ‘బర్హామ్’ నౌకలోని ఆమె కొడుకు మరణించాడని, ఆ నౌక మునిగిపోయిందని ‘హెల్లిష్ నెల్’ చెప్పింది. ఈ సంగతి కలకలం రేపడంతో పోలీసులు ఆమె ప్రదర్శనపై దాడిచేసి, అరెస్టు చేశారు. పాతబడ్డ ‘విచ్‌క్రాఫ్ట్’ చట్టం కింద ఆమెకు శిక్ష విధించారు. ఆ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన విన్‌స్టన్ చర్చిల్, ఆమెకు కాలంచెల్లిన చేతబడుల చట్టం కింద శిక్ష విధించడాన్ని ఖండించడమే కాకుండా, ఆ చట్టాన్ని రద్దు చేశాడు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు