రక్తపోటుకు చెక్‌ పెట్టే సూపర్‌ పిల్‌

15 Aug, 2018 11:38 IST|Sakshi

లండన్‌ : రక్తపోటును సాధారణ స్ధాయికి తీసుకువచ్చే అద్భుత పిల్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తపోటును నియంత్రించే మూడు మందుల కాంబినేషన్‌తో రూపొందే ఈ ట్యాబ్లెట్‌ బీపీ రోగులకు వరంగా మారుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బీపీ మందులతో కేవలం 50 శాతం ప్రజలకే బీపీ నియంత్రణలో ఉంటోంది. అయితే నూతన కాంబినేషన్‌ పిల్‌తో ఆరు నెలల్లో 70 శాతం మందికి బీపీ సాధారణ స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

రక్తపోటుకు వాడే టెల్మిసర్టాన్‌, అమ్లోడిపైన్‌, క్లోరోతాలిడోన్‌ కాంబినేషన్‌తో రూపొందిన ఈ పిల్‌ను రోగులకు ఇవ్వగా 70 శాతం మంది రోగుల్లో బీపీ సాధారణ స్ధాయికి వచ్చిందని వెల్లడైంది. తమ అథ్యయనంలో వెల్లడైన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రక్తపోటు నియంత్రణలో ఉంచడంతో పాటు, వారికి గుండె జబ్బులు, స్ర్టోక్‌ ముప్పును తగ్గిస్తాయని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ రూత్‌ వెబ్‌స్టర్‌ వెల్లడించారు. జార్జ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఈ అథ్యయనాన్ని చేపట్టింది.

మరిన్ని వార్తలు