మొదటి రుతుస్రావానికీ... గుండెజబ్బులకూ సంబంధం ఇలా!

19 Aug, 2015 23:43 IST|Sakshi

కొత్త పరిశోధన
 
సాధారణంగా యుక్తవయస్కురాలైన అమ్మాయి మొదటి రుతుస్రావానికీ, ఆమెకు  గుండెపోటు వచ్చే అవకాశాలకూ సంబంధం ఉందని చెబుతున్నారు ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా 50 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న దాదాపు కోటీ ముప్ఫయి లక్షలమంది మహిళలను వారి మొదటి రుతుస్రావం ఎప్పుడు వచ్చిందని అడిగి ప్రశ్నించడంతో పాటు అనేక వివరాలను సేకరించి ఈ వివరాలను కనుగొన్నారు. సాధారణంగా మరీ చిన్న వయసులో అంటే 10 ఏళ్ల ప్రాయంలోనూ, లేదా మరీ పెద్ద వయసులో అంటే 17 ఏళ్ల తర్వాత రుతుస్రావం వచ్చిన కౌమార బాలికలకు... వారు పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని తేలింది.

ఇక గుండె జబ్బులేగాక రక్తపోటు, పక్షవాతం వంటి ఇతర జబ్బులు వచ్చే అవకాశాలూ ఎక్కువేనని తేలింది. ఇక 13 ఏళ్ల వయసులో తొలిసారి రుతుస్రావం వచ్చిన అమ్మాయిల్లో... వారు పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువని ఇదే పరిశోధనల్లో వెల్లడయ్యింది. అంతేకాదు... 17 ఏళ్ల తర్వాత రజస్వల అయిన అమ్మాయిల్లో 27 శాతం మందికి పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చిన దాఖలాలు కనుగొన్నట్లుగా ఈ పరిశోధన పేర్కొంది. ఈ వివరాలన్నింటినీ ఆక్స్‌ఫర్డ్ నిపుణులు ‘సర్క్యులేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు.
 
 

మరిన్ని వార్తలు