పెళ్లి చేసుకుంటేనే.. గుండె పదిలం

19 Jun, 2018 21:24 IST|Sakshi

పారిస్‌ : డోంట్‌ మ్యారీ.. బీ హ్యాపీ అంటూ పాడుకునే బ్యాచిలర్లు ఇక ఆ ధోరణి నుంచి బయటపడాలంటున్నారు పరిశోధకులు. నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే పెళ్లి చేసుకొనే తీరాలంటున్నారు. ఇంతకీ విషయమేంటే...  పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామితో కలిసి ఉన్నవారు ప్రమాదకరమైన హృద్రోగాల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన అంశాలను రాయల్‌ స్ట్రోక్‌ ఆస్పత్రి కార్డియాలజి విభాగం పరిశోధకులు చున్‌ వాయ్‌ వాంగ్‌ నేతృత్వంలోని బృందం.. మెడికల్‌ జర్నల్‌ హర్ట్‌ నివేదికలో పొందుపరిచారు. 

రెండు దశాబ్దాల పాటు వివిధ వ్యక్తులపై తాము జరిపిన పరిశోధనల్లో... పెళ్లైన వారితో పోలిస్తే పెళ్లికాని వారు హార్ట్‌ ఎటాక్‌తో మరణించే అవకాశం 42 నుంచి 55 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. అదేవిధంగా పెళ్లై జీవిత భాగస్వామితో విడిపోయిన వారు, ఒంటరిగా జీవించే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 42 శాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అయితే పురుషుల్లో పోలిస్తే మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుందని తెలిపారు.

యూరోప్‌, ఉత్తర అమెరికా, మధ్య ఆసియా దేశాల్లో వివిధ జాతులకు, సంస్కృతులకు చెందిన వ్యక్తులపై ఇప్పటి వరకు తాము జరిపిన పరిశోధనల్లో.. పెళ్లై జీవిత భాగస్వామితో కలిసి జీవించే వారు తమ జీవితానికి భద్రత ఉందన్న భరోసాతో ఎక్కువగా ఒత్తిడికి లోనుకామని తెలిపారన్నారు. ఇలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే తోడు ఉందనే భరోసా ఉన్నవారు మానసికంగా ఉల్లాసంగా ఉన్న కారణంగానే స్ట్రోక్‌ బారి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే సహజీవనం చేసే వారిలో పెళ్లి అనే బంధం లేని కారణంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
 

మరిన్ని వార్తలు