విఫలమైన మోదీ కశ్మీర్‌ పాలసీ

19 Jun, 2018 21:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాలసీ పూర్తిగా విఫలమైంది. పీడీపీతో పొత్తు పెట్టుకుని కశ్మీర్‌పై మరింత పట్టు సాధిద్దామనుకున్న మోదీ ప్రయత్నం విఫలమైంది. నేటితో గత మూడేళ్లుగా కశ్మీర్‌ని పరిపాలిస్తున్న పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడింది. సయ్యద్‌ ముఫ్తీ మహ్మద్‌ మరణాంతరం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మెహబూబా ముఫ్తీ  తన తండ్రి కంటే మరిన్ని విపత్కర పరిస్థితులను కశ్శీర్‌లో ఎదుర్కొన్నారు.  

హిస్బుల్ ముజాహిదీన్ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌తో  కశ్మీర్‌లో మొదలైన హింస నేటికీ ఆగలేదు. బుర్హాన్‌ వనీని ఎన్‌కౌంటర్‌ చేయడంతో లోయలో మిలిటెంట్స్ చర్యలు మరింత పెరిగాయి. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సర్జికల్‌ దాడులు  కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడానికి ఏమాత్రం పనిచేయలేదు.

సర్జికల్‌ దాడులు సరిహద్దు వెంట మరిన్ని దాడులకు కారణమయ్యాయి. రంజాన్‌ మాసం సందర్భంగా  కశ్మీర్‌లో మిలిటెంట్స్‌ మరింత రెచ్చిపోయారు. ముస్లింల పవిత్ర మాసంలో కశ్శీర్‌ యువకులను మిలిటెంట్‌ దళాల్లోకి తీసుకుని వారిని తీవ్రవాదులుగా తయారుచేశారు. వారి చర్యలకు అనేక మంది అమాయక  కశ్మీర్‌ ప్రజలు ప్రాణాలు కొల్పోతున్నా.. దాడులను నివారించడంతో పీడీపీ-బీజేపీ సంకీర్ణ  ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

సీనియర్‌ పాత్రికేయుడు సుజాత్ బుఖారిని తన కార్యాలయంలో​ దుండుగులు దారుణంగా హత్యచేయడంతో  కశ్మీర్‌లో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయో ఇట్టే అర్ధమవుతోంది. పాక్‌తో చర్చలు జరిపితే సమస్యలు పరిష్కారం అవుతాయని మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. సరిహద్దులో పాక్‌తో ఎప్పుడు యుద్ధ వాతావరణమే కొనసాగించిన బీజేపీ ప్రభుత్వం ఆ దిశాగా  ఎప్పుడు అడుగులు వేయలేదు.

లోయలో సమస్యకు పరిష్కారం చూపడం కష్టంగా భావించిన మోదీ-అమిత్‌ షా ద్వయం చివరికి పీడీపీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. మూడేళ్ల సంకీర్ణ ప్రభుత్వంలో శాంతి నెలకొల్పడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది.


కె.రామచంద్ర మూర్తి

మరిన్ని వార్తలు