కొబ్బరి ఆకులతో ‘స్ట్రా’లు!

21 Jul, 2020 08:24 IST|Sakshi

ఒక్కో కొబ్బరి మట్ట నుంచి 150–200 స్ట్రాల ఉత్పత్తి

గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు

కొబ్బరి ఆకుతో తయారైన స్ట్రాలకు విదేశాల్లో గిరాకీ

శీతల పానీయాలు, కొబ్బరి నీరు, చెరకు రసం తదితర పానీయాలు తాగడానికి ‘స్ట్రా’లు వాడుతూ ఉంటాం. ఇవి సాధారణంగా ప్లాస్టిక్‌తో తయారైనవే అయి ఉంటాయి. ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తూ.. కొబ్బరి ఆకులతో ఆర్గానిక్‌ ‘స్ట్రా’లు తయారు చేసి చూపించారు బెంగళూరుకు చెందిన ఓ ప్రొఫెసర్‌. బడుగువర్గాల వారితో చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేయించి స్ట్రాలను తయారు చేయించడమే కాదు.. వాటిని అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధరకు విక్రయిస్తున్నారు కూడా. ఈ పరిశ్రమల్లో పని చేసే వారంతా మహిళలే కావటం మరో విశేషం! 

ఏటా మన దేశంలో 25 వేల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగుపడుతున్నాయి. ప్లాస్టిక్‌ కవర్లు, బాటిల్స్‌తోపాటు.. పానీయాలు తాగాక అవతల పారేసే ప్లాస్టిక్‌ స్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటి వాడకాన్ని ఆపేయాలంటే ఆర్గానిక్‌ స్ట్రాలను తయారు చేయాలి. అందుకు ఏ యే పదార్థాలు పనికొస్తాయి? అని వెదుకుతూ ఉండగా.. వృథాగా పోగుపడిన కొబ్బరి ఆకులపై సాజి వర్గీస్‌ దృష్టి పడింది. బెంగళూరులోని క్రైస్ట్‌ యూనివర్సిటీలో ఆయన అసోసియేట్‌ ప్రొఫెసర్‌. పనిచేస్తున్నది ఆంగ్ల విభాగంలో అయినప్పటికీ.. తన ఆసక్తి కొద్దీ యూనివర్సిటీ ప్రోత్సాహంతో కాంపస్‌లోని ఇంక్యుబేషన్‌ లేబరేటరీలో పరిశోధనలు చేపట్టి, విజయం సాధించారు.  
కొబ్బరి చెట్టు ప్రతి ఏటా 6 కొబ్బరి మట్టలను రాల్చుతుంది. ఈ మట్టలకు ఉండే ఎండు ఆకులతో పూరిళ్లను కప్పటం, దడులు నిర్మించడం, ఈనెలతో చీపుర్లు తయారు చేయటం, బుట్టల్లాంటివి అల్లటం మనకు తెలుసు. కొబ్బరి తోటల్లో మట్టలు, ఆకులతో చాలా మంది రైతులు నిప్పుపెడుతుంటే, కొందరు మాత్రం కంపోస్టు తయారు చేస్తున్నారు.

కొబ్బరి ఆకులతో స్ట్రాలను తయారు చేసే యంత్రాలు 

మూడేళ్ల శ్రమ ఫలితం
వ్యర్థ పదార్థంగా మనం భావిస్తున్న రాలిన కొబ్బరి మట్టలు/ఆకులతో అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధరకు అమ్మదగిన అత్యంత నాణ్యమైన ఆర్గానిక్‌ స్ట్రాలను తయారు చేశారు వర్గీస్‌. మూడేళ్లుగా  శ్రమిస్తూ వినూత్న ఆవిష్కరణతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. 2018లో ఈ సాంకేతికతపై పేటెంట్‌ పొందారు. ‘సన్‌బర్డ్‌ స్ట్రాస్‌’ పేరిట మార్కెట్‌లోకి ప్రవేశించారు. 
తొలి దశలో ఈ ప్రాజెక్టుకు క్రైస్ట్‌ యూనివర్సిటీ నిధులు సమకూర్చగా.. తదనంతరం అహ్మదాబాద్‌లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి యాక్సెంచర్, హెచ్‌సిఎల్‌ వంటి ఐటీ సంస్థలు వర్గీస్‌కు తోడ్పాటునందించాయి. ఈ ఆవిష్కరణకు నెదర్లాండ్స్‌లో క్లైమెట్‌ లాంచ్‌పాడ్‌ నిర్వహించిన పోటీలో 45 దేశాల సంస్థలు పాల్గొన్నాయి. ఈ పోటీలో సన్‌బర్డ్‌ స్ట్రాస్‌ ‘బెస్ట్‌ ఇన్నోవేషన్‌ ఫర్‌ సోషల్‌ ఇంపాక్ట్‌ అవార్డు’ను గెల్చుకోవడంతో కొబ్బరి స్ట్రాలకు మలేసియా, అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్‌ వంటి 10 దేశాల నుంచి 2 కోట్ల స్ట్రాలకు ఆర్డర్లు వచ్చాయని వర్గీస్‌ వివరించారు.  

గ్రామీణ మహిళలకు ఉపాధి
కొబ్బరి ఆకులతో స్ట్రాల తయారీకి చిన్నపాటి పరిశ్రమ (బేసిక్‌ యూనిట్‌)ను ఏర్పాటు చేసుకుంటే చాలు. ఈ తయారీ ప్రక్రియలో 5 రకాల చిన్నపాటి యంత్రాలను ఉపయోగిస్తామని, కొద్దిపాటి శిక్షణతోనే గ్రామీణ మహిళలు ఈ యంత్రాలపై పనులు చేయటం నేర్చుకోగలుగుతారని వర్గీస్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. చిన్న పరిశ్రమకు 8 మంది మహిళా కార్మికుల అవసరం ఉంటుందన్నారు. 

ముందస్తు కొనుగోలు ఒప్పందం
కొబ్బరి తోటల్లో వృథాగా పారేస్తున్న ఆకులతో స్ట్రాలను తయారు చేయడంగ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి దోహదపడటం తమ లక్ష్యమని వర్గీస్‌ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బిజినెస్‌ మోడల్‌ను ఆయన రూపొందించారు. కొబ్బరి స్ట్రాలను తయారు చేసే బేసిక్‌ యూనిట్‌కు 5 రకాల యంత్రాలు అవసరమవుతాయి. ఈ యంత్రాలను సన్‌బర్డ్‌ స్ట్రాస్‌ సంస్థ ఆసక్తి కలిగిన వారికి రూ. 3 లక్షల 70 వేలకు ‘లీజ్‌’కు ఇస్తుంది. 100% బైబ్యాక్‌ సదుపాయం ఉంటుంది. సాధారణంగా 4 ఎం.ఎం. వ్యాసం, 8 అంగుళాల పొడవు ఉండే స్ట్రాలను ఉత్పత్తి చేస్తారు. ఒక్కో స్ట్రా రూ.1కి ముందస్తు ఒప్పందం మేరకు తామే కొనుగోలు చేసి, మార్కెట్‌ చేస్తామని వర్గీస్‌ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కో స్ట్రాను దేశాన్ని బట్టి టోకున రూ.2.50 నంచి రూ. 6 వరకు విక్రయిస్తున్నామన్నారు. భవిష్యత్తులో వీటి ధర తగ్గే అవకాశం ఉందన్నారు. 

కొబ్బరి రైతులకు ప్రయోజనం
కొబ్బరి సాగుకు దక్షిణాదిలోని కోస్తా తీర రాష్ట్రాలు పెట్టింది పేరు. కేరళ, కర్ణాటక, తమిళనాడు తర్వాత నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. కొబ్బరి అభివృద్ధి బోర్డు గణాంకాల ప్రకారం.. ఏపీలో 1,22,000 హెక్టార్లలో కొబ్బరి సాగవుతోంది. తెలంగాణలో 1,610 హెక్టార్లలో కొబ్బరి తోటలున్నాయి. పొట్టి కొబ్బరి రకాల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొబ్బరి తోటలున్న ప్రాంతాల్లో స్ట్రాల తయారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా కొబ్బరి రైతులకూ కొంత అదనపు ఆదాయం లభిస్తుంది. గ్రామస్థాయిలో ఉపాధి అవకాశాలు పెంపొందుతాయి.  
https://sunbirdstraws.com/

స్ట్రాల ఉత్పత్తి ఇలా.. 
కొబ్బరి ఎండు ఆకులను సేకరించి శుభ్రపరిచి, గుజ్జుగా మార్చుతారు. గుజ్జుతో యంత్రం ద్వారా పల్చటి షీట్లుగా తయారు చేస్తారు. ఆ షీట్లతో అనేక పొరలు కలిగిన స్ట్రాలను తయారు చేస్తారు. అనేక పొరలను అతికించడానికి క్రమంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫుడ్‌ గ్రేడ్‌ జిగురును ఉపయోగిస్తారు. తగినంత చుట్టుకొలత, పొడవు ఉండేలా స్ట్రాలను తయారు చేస్తారు. 
నీరు, సోడా వంటి పల్చటి ద్రవాలు, మిల్క్‌షేక్‌లు, బబుల్‌ టీ, పండ్ల రసాలు వంటివి తాగడానికి వీలుగా తగినంత చుట్టుకొలత, 4–6 అంగుళాల పొడవు ఉండేలా.. మార్కెట్‌ అవసరాలకు తగినట్లుగా తయారు చేస్తారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా.. తడి తగిలిన తర్వాత కూడా స్ట్రాలు ఆరు గంటల వరకు మెత్తబడకుండా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ స్ట్రాలకు బాగా గిరాకీ ఉంది. దేశీయంగా స్టార్‌ హోటళ్లు కూడా ఆసక్తి చూపుతున్నాయని వర్గీస్‌ తెలిపారు. 

రోజుకు 6 వేల స్ట్రాల ఉత్పత్తి
ఈ బేసిక్‌ యూనిట్‌లో 8 మంది మహిళలకు పని దొరుకుతుంది. ఒక్కో కొబ్బరి మట్టతో 150–200 వరకు స్ట్రాలు తయారు చేయవచ్చు. 30 నుంచి 40 కొబ్బరి మట్టలతో 8 గంటల్లో 6,000 స్ట్రాలను తయారు చేయవచ్చు. అంటే రోజుకు రూ. 6 వేల ఆదాయం వస్తుంది. మధురై, టుటికోరిన్‌ ప్రాంతాల్లో ఇప్పటికే తమ ఆధ్వర్యంలో కొన్ని కొబ్బరి స్ట్రా యూనిట్లు ఏర్పాటయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వివిధ రాష్ట్రాల్లో 20 యూనిట్లు ఏర్పాటు కానున్నాయని వర్గీస్‌ వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణులకే ఈ యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. 4–5 నెలల్లోనే పెట్టిన పెట్టుబడి వారికి తిరిగి వచ్చేస్తుందని వర్గీస్‌ (89708 30279) ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు