మంచి దొంగ

10 Aug, 2018 00:08 IST|Sakshi

చెట్టు నీడ

అతనో అనాథ. ఆలనాపాలనా పట్టించుకునేవారుగానీ, ఆదరించేవారు గానీ లేరు. దాంతో పొట్టపోసుకోవడం కోసం చిన్నప్పటినుంచి చిన్నాచితకా దొంగతనాలు చేస్తుండేవాడు. ఒకరోజు రాత్రిపూట అతను పొరుగూరిలోని ఒక తోటకు వెళ్లాడు. అక్కడ చెరువులో చేపలు పట్టుకుందామని వల వేశాడు. చేపలు పడలేదుగాని, ఆ అలికిడికి తోట యజమాని లేచి, తన సేవకులను అప్రమత్తం చేశాడు. అందరూ కలిసి కాగడాలు Ðð లిగించుకుంటూ తోటంతా గాలిస్తున్నారు. ఈలోగా దొంగ, తన ఒంటి మీదున్న దుస్తులను తీసివేసి, మొలకు గోచి మాత్రమే ఉంచుకుని, ఒంటినిండా బూడిద పూసుకుని, తోటలో ఒక చెట్టుకింద కూర్చుని కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లు నటించసాగాడు. దొంగకోసం వెతుకుతున్న వారికి చెట్టుకింద ధ్యానంలో మునిగి ఉన్న సాధువు తప్పితే ఎవరూ కనిపించలేదు. దాంతో వాళ్లు తమ చేతులలో ఉన్న కత్తులు, కర్రలు కింద పడేసి, తోటలో చెట్టుకున్న కాయలు కొన్ని కోసి, మూటకట్టి, సాధువు ముందుంచి, భక్తితో నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తొందరపడి లేస్తే ఎవరైనా గమనిస్తారేమోనన్న భయంతో దొంగ కళ్లూ నోరూ తెరవకుండా సమాధి స్థితిలో ఉన్నట్లు అలాగే ఉండిపోయాడు. 

తెల్లారింది. ఊళ్లో అందరికీ తోటలో చెట్టుకింద ఉన్న సాధువు సంగతి తెలిసింది. అన్ని దిక్కుల నుంచి జనాలు తండోపతండాలుగా వచ్చారు. పళ్లు తెచ్చిన వారు కొందరు, చెంబులతో పాలు తెచ్చిన వారు కొందరు... వెండినాణేలే సమర్పించుకున్నవారు ఇంకొందరు, ఉన్నదానిలోనే కొంతయినా సాధువుకు సమర్పించుకుని ఆశీస్సులు అందుకుందామని మరికొందరు... ఇలా ఎవరికి తోచింది వాళ్లు స్వామికి  చెల్లించుకున్నారు. ఇదంతా గమనిస్తున్న దొంగ, ‘ఎంత మంచివాళ్లు వీళ్లంతా! కల్లాకపటం తెలియని వాళ్లు. నేను దొంగిలించవలసింది వీరి మంచితనాన్నే కానీ, డబ్బూ, నగలూ, మరోటీ కాదు. వీరిలోని మంచిని దోచుకుని, దానిని పదిమందికీ పంచిపెడితే, ఇక అప్పుడు నాలాగా దొంగతనం చేయవలసిన అవసరం బహుశా ఎవరికీ రాదేమో! అని ఆలోచించి, వైరాగ్యభావనలు తెచ్చుకుని, నిజమైన సాధువుగా పరివర్తన చెందాడు. 
– డి.వి.ఆర్‌.

మరిన్ని వార్తలు