పిల్లల్లో మెల్లకన్నుకు చికిత్స ఎలా?

19 Aug, 2015 01:05 IST|Sakshi

పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజీ కౌన్సెలింగ్
మా అబ్బాయి వయసు 3 నెలలు. బొమ్మలను అతడి ముఖానికి దగ్గరగా పెట్టినప్పుడు, వాడు ఆ బొమ్మలను చూసే విధానాన్ని చూస్తుంటే వాడికి మెల్లకన్ను ఉందేమో అనిపిస్తోంది. వాడి విషయంలో నాకు సరైన సలహా ఇవ్వండి.
 - సరళ, భద్రాచలం

 
సాధారణంగా చిన్నారుల కళ్లు ఆర్నెలు వచ్చాకే ఒక అలైన్‌మెంట్‌తో ఉంటాయి. ఆర్నెల్ల కంటే ముందుగా గమనించినప్పుడు చాలామంది చిన్నారుల కళ్లలోని నల్లగుడ్లలో ఒకటి... లోపలివైపునకు (ఈసోట్రోపియా) చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. మీ అబ్బాయికి ఇంకా కేవలం మూడు నెలల వయసే కాబట్టి మీరు అతడికి మెల్లకన్ను ఉందేమోనని ప్రస్తుతానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతడికి ఆర్నెల్ల వయసు వచ్చాక కూడా మీరు చెప్పినట్లుగానే అతడి కనుగుడ్లలో ఒకటి లోపలివైపునకు చూస్తుంటే మాత్రం తప్పకుండా పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్‌కు చూపించాల్సి ఉంటుంది. మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే మెల్లకన్ను ఉన్న కనుగుడ్డు ఆంబ్లోపియా (లేజీ ఐ... అంటే సరిగా చూడలేని కన్ను నుంచి మెదడు సిగ్నల్స్‌ను స్వీకరించకపోవడం వల్ల క్రమంగా ఆ కంటి చూపు తగ్గిపోవడం) వచ్చి సాధారణ పిల్లలు రెండుకళ్లతో ఒకే దృశ్యాన్ని మాత్రమే చూసే బైనాక్యులార్ విజన్‌నూ, 3-డీ విజన్‌నూ చూడలేకపోవచ్చు. అందుకే మీ చిన్నారికి ఆర్నెల్లు వచ్చాక మీరు ఒకసారి తప్పనిసరిగా పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్‌కు చూపించండి.
 
మా పాపకు నాలుగేళ్లు. మూడేళ్ల వయసు నుంచి ఆమెకు మెల్లకన్ను ఉన్నట్లు గుర్తించాను. ప్రత్యేకంగా ఆమె దేనినైనా తదేకంగా చూస్తున్నప్పుడు మెల్లకన్ను పెడుతోంది. మాకు తెలిసిన కంటి డాక్టర్‌ను సంప్రదిస్తే ఆమెకు కళ్లజోడు అవసరమని చెప్పారు. ఇంత చిన్న పాపకు కళ్లజోడు అవసరమా? ఆమె మెల్లకన్ను విషయంలో ఇంకేదైనా చికిత్స ఉందా?
- కోమల, సూళ్లూరుపేట

 
మీరు చెప్పిన వివరాల ప్రకారం బహుశా మీ పాపకు అకామడేటివ్ ఈసోట్రోపియా అనే కండిషన్ ఉండవచ్చు. ఇలాంటి మెల్లకన్ను దూరదృష్టి (హైపర్‌మెట్రోపియా)ని సరిచేయకపోవడం వల్ల వస్తుంది. ఇది సాధారణంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో మొదలవుతుంది. ఏదైనా చదివే సమయంలో సరిగా కనిపించనప్పుడు తదేకంగా చూస్తూ తనకు కనిపిస్తున్నదాన్ని స్పష్టంగా చూసేందుకు అకామడేట్ చేసే ప్రయత్నంలో ఈ కండిషన్ మొదలువుతుంది. అదే క్రమంగా మెల్లకన్నుకు దారితీస్తుంది. మీ పాప కంటి సమస్యను చక్కదిద్దడానికి ప్లస్ పవర్ ఉన్న లెన్స్‌లను (అద్దాలను) కంటివైద్యనిపుణులు సూచిస్తారు. ఈ కంటి అద్దాలను ఆరు వారాల పాటు వాడాక అప్పుడు మళ్లీ మెల్లకన్ను ఎంత ఉందో చూస్తారు. ఈ క్రమంలో మెల్లకన్ను తగ్గిపోతే ఇక ఆమెకు ఎలాంటి చికిత్సా అవసరం లేదు. ఇంత చిన్నవయసులో కళ్లజోడు ఎందుకు అంటూ మీరు నిర్లక్ష్యం చేసే ఆంబ్లోపియా అనే కండిషన్ వచ్చి, ఆమె ఒక కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉంది.

డాక్టర్ రచన వినయకుమార్
పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్
- స్క్వింట్ స్పెషలిస్ట్,
అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్

 
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా భర్తకు మైట్రల్‌వాల్వ్ సమస్య..!

నా భర్త వయసు 31 ఏళ్లు. ఆయన మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్‌తో సరిగా మూసుకోవడం లేదు. దీనికి తోడు సివియర్ మైట్రల్ వాల్వ్ రిగర్జిటేషన్ (అంటే ఆ వాల్వ్ సరిగా మూసుకుపోకపోవడం వల్ల రక్తం ముందుకెళ్లకుండా రివర్స్‌లో ప్రవహిస్తోంది) తో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం సర్జరీ కోసం వేచిచూస్తున్నారు. ఆయనకు ఎలాంటి కృత్రిమ వాల్వ్ వేయడం మంచిది? లోహంతో చేసిన వాల్వ్ వేయడం వల్ల భవిష్యత్తులో గుండెపోటు/పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయా? ఇది వంశపారంపర్యంగా వచ్చే కండిషనా? నాకు తగిన సలహా ఇవ్వగలరు.
- మానస, చెన్నై
 
మీ భర్త వయసు చిన్నదే కాబట్టి... ఏదైనా రక్తస్రావం అయ్యేందుకు అవకాశాలు ఉండటం లాంటి ఇతరత్రా సమస్యలుంటే తప్ప మెకానికల్ వాల్వ్ ఆయనకు మంచిది. అయితే మైట్రల్ వాల్వ్‌ను పూర్తిగా తొలగించి, కొత్త వాల్వ్ వేయడం కంటే మైట్రల్ వాల్వ్‌ను రిపేర్  చేయడం ఇంకా మంచిది. కాబట్టి ఈ విషయంలో ఒకసారి మీరు మీ భర్తకు ఆపరేషన్ చేసే సర్జన్‌తో సంప్రదించడం మేలు. మైట్రల్ వాల్వ్‌ను మార్చే బదులు దాని రిపేర్‌కు అవకాశం ఉందా అని మీ సర్జన్‌ను అడగండి.
 
ప్రోస్థెటిక్ హార్ట్ వాల్వ్స్ విషయంలో గుండెపోటుకు / పక్షవాతానికీ (స్ట్రోక్‌కు) ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అయితే మీరు రక్తాన్ని పలచబార్చే మందలను నిత్యం క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి.  రక్తాన్ని పలచబార్చే మందుల వల్ల రక్తం ఎలాంటి ఆటంకం లేకుండా రక్తనాళాల్లో ప్రవహిస్తుంది. అయితే ఇదే సమయంలో మరో ప్రమాదం మరోవైపు నుంచి పొంచి ఉంటుంది. మనం రక్తాన్ని పలచబార్చే మందులు వాడుతుంటాం కాబట్టి, ఇలా బాగా పలచబారిన రక్తం మెదడులో ఎక్కడైనా లీకైనా లేదా బాగా చిక్కబడి మెదడులోని రక్తనాళాల్లో ఎక్కడైనా గడ్డలా మారి ప్రవాహానికి అడ్డుపడ్డా (క్లాట్ ఏర్పడినా) అది ప్రమాదకరంగా మారవచ్చు. ఇలా రక్తన్ని పలచబార్చే మందును తగిన మోతాదులో ఉంచి అది 3 - 3.5 కొలతలో నిత్యం ఉండేలా చూస్తే పక్షవాతం వచ్చే అవకాశాలు తక్కువ. ఇక మీ భర్తకు చేసేది ఓపెన్ హార్ట్ సర్జరీ.
 
కాబట్టి దీన్ని చాలా పెద్దదిగానూ,  క్లిష్టమైనదిగానూ పరిగణించాలి. అయితే ఇంత క్లిష్టమైనప్పటికీ పెద్ద సెంటర్లలో వీటిని చాలా తరచుగా (రొటీన్‌గా) చేస్తూనే ఉన్నారు. కాబట్టి అన్ని వసతులు ఉన్న మంచి పెద్దాసుపత్రిని ఎంచుకోండి. ఇతరత్రా కాంప్లికేషన్లు వస్తే తప్ప ఇందులో 2-3 % మాత్రమే రిస్క్ ఉంటుంది. ఇక మీరు అడిగినట్లుగా ఇది వంశపారంపర్యంగా వస్తుందనే విషయంపై ఎలాంటి ఆధారాలు లేవు. కానీ దీనికి జన్యుప్రాతిపదిక ఉందని కొందరు చెబుతుంటారు. అయితే ఈ విషయం మీద ఎక్కువగా ఆలోచించి మీ పిల్లలకూ ఇది వస్తుందేమోనని ఆందోళన చెందడం అనవసరం.
 
టీబీ కౌన్సెలింగ్
ఆ టీబీ మందులకు లొంగడంలేదు..!

మా నాన్నగారు చాలా ఎక్కువగా మద్యం తాగుతుంటారు. అలాగే పొగతాగడం కూడా ఎక్కువే. ఆయనకు పల్మునరీ ట్యూబర్క్యులోసొసిస్ అనే జబ్బు వచ్చింది. అయితే ఆయన చికిత్స విషయంలో కాస్తంత నిర్లక్ష్యం వహించారు. కొంతకాలం మందులు తీసుకోవడం, ఆ తర్వాత ఆపేయడం.... ఇలా చేశారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ టీబీ వచ్చింది. డాక్టర్లు చూసి దాన్ని ‘ఎమ్‌డీఆర్ టీబీ’ అంటున్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు మేమేం చేయాలి. సలహా ఇవ్వగలరు.
- సోమేశ్, కందుకూరు
 
మన శరీరంలో టీబీ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా (ట్యూబర్క్యులోసిస్ బాసిల్లస్) ప్రవేశించినప్పుడు కొన్ని సూక్ష్మజీవులను నిర్మూలించే అత్యంత శక్తిమంతమైన మందులైన ఐసోనియాజైడ్, రిఫాంపిసిన్ వంటి వాటితో చికిత్స చేస్తుంటాం. ఇలా ఆర్నెల్ల పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఈ మందుల పూర్తి కోర్సును తీసుకుంటేనే టీబీ పూర్తిగా తగ్గుతుంది. అలాగాకుండా ఒకవేళ ఈ మందులను నిర్లక్ష్యంగా వాడినా లేదా తగిన మోతాదులో వాడకపోయినా, లేదా కొంతకాలం వాడాక లక్షణాలు తగ్గగానే మళ్లీ ఆపేసినా లేదా మందులను సరిగా నిల్వ చేయకపోయినా... వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములు ఆ మందులకు లొంగని విధంగా తయారవుతాయి. అత్యంత శక్తిమంతమైన ఆ టీబీ మందుల పట్ల తమ నిరోధకత స్థాయిని పెంచుకుంటాయి. దాంతో అవి తమ శక్తిని పెంచుకోవడమే కాదు... ఇతర ఆరోగ్యవంతులైన వ్యక్తులకూ వ్యాపించే విధంగా తయారవుతాయి.
 
ఒక వ్యక్తిలోని టీబీ వ్యాధి మందులకు లొంగని విధంగా తయారయ్యిందా అని నిర్ధారణ చేయడానికి కొన్ని ల్యాబరేటరీ పరీక్షలు అవసరమవుతాయి. ఆ పరీక్షల ద్వారా మందులకు లొంగని విధంగా వ్యాధి తయారయ్యిందో లేదో తెలుసుకుంటారు. ఈ పరీక్షల్లో మాలెక్యులార్ బేస్‌డ్ అనీ, కల్చర్ బేస్‌డ్ అనీ రకాలున్నాయి. మాలెక్యులార్ బెస్‌డ్ పరీక్షల ద్వారా కేవలం కొద్ది గంటల్లోనే ఫలితాలు వెల్లడవుతాయి. ఇలా టీబీ వ్యాధి సాధారణ స్థాయి నుంచి మందులకు లొంగని విధంగా నిరోధకత పెంచుకుందని తెలియగానే, రెండోశ్రేణి మందులను (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్) వాడటం మందుపెట్టాలి.

ఇందులో నాలుగు లేదా అంతకు మించి మందులుంటాయి. వాటిని కనీసం ఆర్నెల్లపాటు క్రమం తప్పకుండా వాడాలి. ఒక్కోసారి రిఫాంపిన్ మందుకు సూక్ష్మక్రిమి నిరోధకత పెంచుకుందని తెలిసినప్పుడు ఈ చికిత్సా కాలాన్ని 18 - 24 నెలలకూ పొడిగించాల్సి రావచ్చు కూడా. ఈ రెండోశ్రేణి మందులు కాస్త ఖరీదైనవి, విషపూరితమైనవి కాబట్టి... మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవడం అన్నివిధాలా మంచిది. ఇక రెండోశ్రేణి మందులు వాడే చికిత్సలో వ్యాధి పూర్తిగా తగ్గే పాళ్లు 70 శాతం వరకు ఉంటాయి.
 
డాక్టర్ వి.వి. రమణ ప్రసాద్
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ -
స్లీప్ స్పెషలిస్ట్
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్

 
ఆయుర్వేద కౌన్సెలింగ్
చుండ్రుకు మందులున్నాయా?
నా వయసు 31. నాకు విపరీతంగా చుండ్రు ఉంది. దీని మూలంగా నేను అనేక విదాలుగా బాధపడుతున్నాను. ఇంగ్లిష్ మందులు ఎన్ని వాడినా ప్రయోజనం పెద్దగా ఉండటం లేదు. ఆయుర్వేదంలో మందులేమైనా ఉంటే తెలియజేయగలరు.
 
చుండ్రును ఆయుర్వేదంలో కఫ ప్రధానమైన వాతానుబంధ వ్యాధిగా చెప్పారు. శాలాక్యతంత్ర నిపుణుడైన ‘విదేహుడు’ చుండ్రుకు మరికొన్ని లక్షణాలను కూడా చెప్పాడు. సూదులతో పొడిచినట్లు నొప్పి, మంట, స్రావం, వీటితోపాటు తలవెంట్రుకలు రాలిపోవడాన్ని ఉపద్రవంగా చెప్పాడు. అంటే ఇది సెకండరీ ఇన్ఫెక్షన్ స్వభావం. ఇదే పిత్తప్రకోపావస్థ.
 
చుండ్రుకు కారణాలు
తలమీది చర్మంలో శుభ్రత లోపించడం, కేశ మూలాల ఆరోగ్యాన్ని నిర్లక్షం చేయడం, మానసిక ఉద్వేగాలు కూడా ఈ వ్యాధిపై ప్రభావం చూపిస్తాయి.
 
నివారణ
తలను శుభ్రంగా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతత అవసరం. చర్మానికి హాని కలిగించే రసాయనాలున్న షాంపూలను వాడకూడదు. కుంకుడు లేదా షీకాకాయలను పొడి చేసుకుని తలస్నానానికి ఉపయోగించుకోవడం ఉత్తమం. స్వచ్ఛమైన కొబ్బరినూనె శిరోజాల ఆరోగ్యానికి శ్రేష్ఠం. ఆహారంలో ఉప్పు, కారం తక్కువగా తినాలి. చుండ్రు ఉన్న వారి దువ్వెనలను ఇతరులు వాడటం మంచిది కాదు కాబట్టి, వీరు విడిగా పెట్టుకోవడం మంచిది.
 
ఔషధాలు
త్రిఫలాచూర్ణంతో కషాయం కాచుకుని, తలను కడుక్కుని, తర్వాత తలస్నానం చేయాలి. తడి ఆరిన తర్వాత తలచర్మంపై దూర్వాది తైలం లేక మహామరీచాది తైలం లేక మంజిష్ఠాది తైలాన్ని తలపై పూయాలి.
 
కడుపులోకి మందులు
లఘుసూతశేఖర రసమాత్రలు పూటకొక్కటి చొప్పున రోజుకి మూడు మాత్రలు. పంచతిక్త గుగ్గులు ఘృతం రెండు చెంచాలు ఉదయం, రెండు చెంచాలు కలిపి, నాలుగు చెంచాలు నీళ్లు కూడా కలిపి రోజుకి రెండుసార్లు ఆమారం తిన్న తర్వాత తాగాలి.
గృహవైద్యం (నివారణకూ, చికిత్సకూ కూడా) ఒక చెంచా గసగసాల చూర్ణం, ఒక చెంచా వచాచూర్ణం (వస పొడి), 200 మి.లీ కొబ్బరినూనెతో కలిపి మరిగించి చల్లార్చి వ డగట్టుకుని రోజూ తలకు రాసుకోవచ్చు. మీరు కొంతకాలం ఈ సూచనలు పాటించి, పరిస్థితిని సమీక్షించుకోండి.
 
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు,
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్

మరిన్ని వార్తలు