తిండి మారితే మేలు.. 

1 Jan, 2019 10:37 IST|Sakshi

భూమిపై వనరుల వినియోగ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం మాంసం, డెయిరీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకోవడమేనని సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం (2018) పేర్కొంది. మాంసం, పాల ఉత్పత్తులను తినటం మానివేస్తే చాలు.. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకుంటూనే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని 75% తగ్గించవచ్చని ఒక అతిపెద్ద అధ్యయనం తెలిపింది. 

యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ 119 దేశాల్లో 40 వేల క్షేత్రాలు, ప్రజలు ఎక్కువగా తింటున్న 40 ఆహారోత్పత్తులపై అధ్యయనం చేసింది. ఈ ఉత్పత్తులకు అయ్యే వనరుల ఖర్చు, కాలుష్యం, వెలువడే ఉద్గారాలు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకున్నది. అడవులు నరికి వ్యవసాయానికి మళ్లించడం వల్ల వన్యప్రాణుల సంఖ్య భారీగా అంతరిస్తున్నది.  
ప్రపంచవ్యాప్తంగా మాంసం, పాల ఉత్పత్తుల ద్వారా ప్రజలకు అందుతున్నది 18% కేలరీలు, 37% ప్రొటీన్లు. అయితే, వీటి కోసం 83% వ్యవసాయ భూములను కేటాయించాల్సి వస్తున్నది. వ్యవసాయం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలలో 60% మాంసం, పాల ఉత్పత్తుల తయారీ వల్లనేనని ఈ అధ్యయనం తేల్చింది. మాంసం, పశువుల పాల ఉత్పత్తులను సగాన్ని తగ్గించుకొని, వాటి స్థానంలో పంటల ఉత్పత్తులతో భర్తీ చేసుకున్నా చాలా మేలు జరుగుతుందని తేలింది.  

మరిన్ని వార్తలు