పండగన్నాలు

12 Oct, 2015 23:22 IST|Sakshi
పండగన్నాలు

దసరా సరదాల పండుగ.  అందుకే దసరాకి వండే వంటలూ సరదాగానే ఉంటాయి. అన్నం వండి వార్చుతారు... ఆ అన్నానికి రకరకాల పదార్థాలు జత చేసి... కొత్త కొత్త అన్నాలు తయారుచేస్తారు. వాటినే కొందరు సద్దులు అంటారు... మరికొందరు దేవనాగరభాషలో చిత్రాన్నం, దద్ధ్యోదనం అంటారు. ఎవరు ఏ పేరుతో పిలిస్తేనేం... ఈ అన్నప్రసాదాలు నాలుక మీద పడగానే... అన్నదాతా సుఖీభవ... అనే మాట రాకమానదు. అచ్చమైన ఈ తెలుగువారి వంటలను శరన్నవరాత్రుల సందర్భంగా... రోజుకో రకం వండుకుని కడుపారా ఆతిథ్యమిద్దాం.
 
పులిహోర

కావల్సినవి: కప్పు అన్నం, తగినంత చింతపండు గుజ్జు, ఉప్పు
తయారి: చింతపండు గుజ్జులో తగినంత ఉప్పు వేసి కొద్దిగా ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలపాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి పోపు పెట్టుకోవాలి. (శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు.. వంటివి పోపులో చేర్చుకోవచ్చు)
 
పోపు కోసం: పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, నాలుగు పచ్చిమిర్చి (నిలువుగా కోయాలి), నాలుగు ఎండు మిర్చి, కరివేపాకు రెమ్మ, కొద్దిగా పసుపు, తగినంత నూనె
తయారి: బాణలిలో నూనె వే డయ్యాక పై దినుసులను వేసి, కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలపాలి.
 
పెరుగన్నం

కావల్సినవి:కప్పు అన్నం, కప్పు పెరుగు, తగినంత ఉప్పు
తయారీ: అన్నంలో పెరుగు, ఉప్పు వేసి కలపాలి. చివరగా బాణలిలో కొద్దిగా నెయ్యి/నూనె వేసి పోపు పెట్టుకోవాలి. అదనంగా జీడిపప్పు చేర్చుకోవచ్చు.
 
పరమాన్నం

కావల్సినవి: కప్పు బియ్యం, మూడు కప్పుల పాలు, కప్పు నీళ్లు, కప్పు బెల్లం, మూడు టీ స్పూన్లు నెయ్యి
తయారి: అన్నం ఉడుకుతుండగా దాంట్లో తరిగిన బెల్లం, నెయ్యి వేయాలి. మరికాసేపు ఉడికించి దించాలి. దీంట్లో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ కలుపుకోవచ్చు.
 
సజ్జ ముద్దలు/

సజ్జల లడ్డూలు
 కావల్సినవి: సజ్జల పిండి - 2 కప్పులు, బెల్లం - కప్పు (తురిమినది), సోంపు - 2 టీ స్పూన్లు, నెయ్యి - 2 టీ స్పూన్లు
 తయారి:సజ్జ పిండిలో తగినన్ని నీళ్లు కలిపి, ముద్ద చేయాలి. తగినంత ముద్ద తీసుకొని, చపాతీ చేసినట్టుగా చేత్తో రొట్టె చేసి, పెనం మీద వేసి కాల్చాలి. మరీ గట్టిగా కాకుండా రెండు వైపులా కాల్చి, ప్లేట్‌లో వేయాలి. వేడి ఉండగానే చేత్తో రొట్టెను చిన్న చిన్న ముక్కలు చేసి, (చేత్తో చేయలేని వారు రోట్లో రొట్టె, బెల్లం వేసి దంచవచ్చు) బెల్లం, సోంపు, నెయ్యి వేసి, గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి. ఇలా తయారుచేసిన సజ్జ ముద్దలను అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. వీటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అందుకని చిన్నపిల్లలు, గర్భవతులకు తప్పక పెడతారు. 3-4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో సజ్జ రొట్టెకు బదులుగా గోధుమ రొట్టెతో ముద్దలు కడతారు.
 
పల్లి పొడి
కావల్సినవి: 2 కప్పుల పల్లీలు కప్పు బెల్లం (తురిమినది)  కప్పు పంచదార  (పైన చల్లడానికి)
తయారి: పల్లీలను వేయించి, పొడి చేయాలి. దీంట్లో బెల్లం వేసి గ్రైండ్ చేయాలి. చివరగా పంచదార కలపాలి.
 
నువ్వుల పొడి
కావల్సినవి: కప్పు నువ్వులు కప్పు పంచదార(గ్రైండ్ చేయాలి)
తయారి: నువ్వులను వేయించి, పొడి చేసి, పంచదార పొడి కలపాలి.
 
పెసర పొడి
కావల్సినవి: కప్పు పెసరపప్పు  కప్పు పంచదార 2 టేబుల్ స్పూన్ల నెయ్యి
తయారి: పెసరప్పును దోరగా వేయించాలి. తర్వాత మిక్సర్ గ్రైండ్‌లో వేసి పొడి చేయాలి. దీంట్లో పంచదార పొడి, వేడి వేడి నెయ్యి వేసి కలపాలి.
 
 నోట్: ఈ పొడులను  లడ్డూల్లాగ కూడా కట్టుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు