కాబోయే తల్లుల్లో మానసిక ఒత్తిడి

24 Oct, 2019 02:25 IST|Sakshi

కాబోయే తల్లులు మానసికంగా ఒత్తిడికి గురయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఇంకా బిడ్డ పుట్టకముందే  లోపల తన బిడ్డ ఎలా ఉన్నాడో అని ఒక బెంగ. తొలిచూలు మహిళలకు పుట్టినవాడిని తాము బాగా సాకగలమో లేదో అని ఆందోళనగా ఉంటుంది. ఇక బిడ్డకు ఇవ్వాల్సిన ఆహారం, పెరుగుతున్న క్రమంలో వాడి ఆరోగ్యం... ఇలా కాబోయే తల్లి ఎన్నోరకాల ఒత్తిడులకు లోనవుతూ ఉంటుంది. తల్లి ఎదుర్కొనే ఒత్తిళ్లలో అప్పటికప్పుడు పడేవి, దీర్ఘకాలంగా ఉండేవి ఇలా రెండు రకాలూ ఉండవచ్చు. మామూలుగానైతే తాను ఒత్తిడి వల్ల పడే ప్రభావం ఆ వ్యక్తిపైనే ఉంటుంది. అయితే గర్భవతులు ఒత్తిడికి లోనైతే అది రెండు ప్రాణాలపై ప్రభావం చూపుతుంది. అంటే పిండంపై దుష్ప్రభావం పడే అవకాశం ఉందన్నమాట.

ఒత్తిడి వల్ల కలిగే అనర్థాలివి...
ఒత్తిడి పెరిగినప్పుడు మెదడులో కార్టికోట్రోఫిన్‌ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది గ్లూకోకార్టికాయిడ్‌ అనే కార్టిసాల్‌ స్రావం విడుదల అయ్యేలా చేస్తుంది. ఈ కార్టిసాల్‌ స్రావం స్థాయులు పెరగడం వల్ల గర్భస్రావం, పిండంలో ఎదుగుదల లోపించడం, బిడ్డ పూర్తిగా ఎదగకముందే ప్రసవం కావడం, పుట్టిన బిడ్డకు... మానసిక  వికాసంలో తేడాలు, నేర్చుకునే శక్తిలో లోపాలు, ఏదైనా విషయంపై దృష్టికేంద్రీకరించే శక్తిలో లోపాలు వంటివి రావచ్చు. గర్బవతిగా ఉన్నప్పుడు పడే తక్షణ ఒత్తిడి (ఆక్యూట్‌ స్ట్రెస్‌) ఆ తర్వాత కొంతకాలానికి స్కీజోఫ్రినియా రూపంలో కనిపించవచ్చు.

దీర్ఘకాలపు ఒత్తిడి (క్రానిక్‌ స్ట్రెస్‌) వల్ల మహిళల్లో కార్టిసాల్‌ ఎక్కువగా ఉత్పత్తి అయి అది ప్రోజెస్టెరాన్‌ అనే హార్మోన్‌పై ప్రభావం చూపవచ్చు. ఈ ప్రోజెస్టెరాన్‌ అనే హార్మోన్‌ గర్భధారణకూ, గర్భం నిలవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ప్రోజెస్టెరాన్‌ హార్మోన్‌ పాళ్లు తక్కువైతే దానివల్ల నెలలు నిండకముందే ప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువ. మరీ ఎక్కువ ఒత్తిడికి గురైన తల్లులకు పుట్టిన బిడ్డల వ్యాధి నిరోధక శక్తి తక్కవగా ఉంటుంది.

ఒత్తిడిని నివారించండిలా...
►బిడ్డతో తల్లికి అనుబంధం చిన్నారి తన కడుపున పడిన నాటి నుంచి మొదలై కడవరకూ ఉంటుంది. ఆ బంధంలో ఎలాంటి ఒడిదొడుకులూ రాకూడదంటే గర్భం ధరించిన నాటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చూసుకోవడం అవసరం. ఒత్తిళ్లు లేకుండా చూసుకోడానికి రకరకాల రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ ఉన్నాయి. ఉదాహరణకు యోగా, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజెస్, ధ్యానం వంటివి అందులో ప్రధానమైనవి. ధ్యానం వల్ల రక్తపోటును అదుపు చేయవచ్చు. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ల వల్ల దృష్టికేంద్రీకరణ శక్తి మెరుగుపడుతుంది. యోగాతో కేవలం తల్లి ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాదు... ప్రసవం సమయంలో బిడ్డ తేలిగ్గా పుట్టడానికీ ఉపయోగపడుతుంది. అయితే గర్భవతులు యోగా చేయాలంటే అది నిపుణుల పర్యవేక్షణలోనే చేయడం మంచిదని గుర్తుంచుకోవాలి.
►నిద్రలేమి వల్ల గర్భిణుల్లో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. అందుకే మధ్యాహ్నం పూట తప్పనిసరిగా కనీసం 20 నిమిషాలు నిద్రపోవాలి. ∙అవసరం పడ్డప్పుడు పొరుగువారి సాయం తీసుకోవాలి.

ఒత్తిడి వల్ల దుష్ప్రభావాలిలా...   
గర్భవతి ఒత్తిడికి లోనైనప్పుడు శరీర జీవక్రియల్లో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. ఒంట్లో ఒత్తిడిని కలిగించే హార్మోన్లు పెరిగిపోతాయి. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల గర్భసంచి లోపలి భాగాల్లో పడుతుంది. దాంతో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలెక్కువ. ఈ హార్మోన్ల పెరుగుదల కారణంగా ఆకలి మందగించడం, అలసట, నిద్రలేమి, యాంగై్జటీ, తలనొప్పులు, వెన్నునొప్పులు కనిపిస్తాయి. కొందరిలోనైతే ఒత్తిడి పెరిగినప్పుడు తమకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తూ ఉంటారు. దీనివల్ల బరువు పెరిగి అదో అనర్థంగా పరిణమించే అవకాశం ఉంటుంది.
డా. కల్యాణ చక్రవర్తి కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్,
లూసిడ్‌ డయాగ్నస్టిక్స్, బంజారాహిల్స్,
హైదరాబాద్‌.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా