అమ్మా! బంధానికి గదులుండాలి...

13 Jun, 2019 08:20 IST|Sakshi

జీవితం... తాడు మీద నడక. బంధాలు... వెదురుగడలా  ఆ నడకను బ్యాలెన్స్‌ చేయడానికి ఉపయోగపడాలే తప్ప, కత్తిలా మారి తాడును తెగ్గొట్టేలా ఉండకూడదు. కుటుంబంలో అన్ని గదులకూ స్పేస్‌ ఉన్నట్టే
బంధాల మధ్య కూడా స్పేస్‌ ఉండాలి. ఒక గదిలో మరో గది దూరితే అసౌకర్యం చికాకు రేపుతుంది. ఆ చికాకును దూరం చేసే కథనమే ఇది. చేయాల్సినంత సేపు వంట చేశాక ఆడవాళ్లు కిచెన్‌లో నుంచి బయటకు వస్తారు. కాని ఇంట్లో ఎక్కడ ఉన్నా కాపురంలో సెగ తగులుతూ ఉంటే? పొయ్యిలో నుంచి పెనం మీదకు, పెనం మీద నుంచి పొయ్యిలోకి జీవితం సాగుతూ ఉంటే?

ఆమె విడాకులు తీసుకుంది. 
డిప్రెషన్‌ వచ్చింది.
మళ్లీ పెళ్లి చేసుకుంది.
డిప్రెషన్‌ వచ్చింది.
కొడుకు ఆమెను ప్రాణంలా చూసుకున్నాడు.
కాని కొడుకు వల్లే ఆమె ప్రాణం పోయేలా ఉంది.
‘నేనొక దురదృష్టవంతురాలిని డాక్టర్‌’ అందామె సైకియాట్రిస్ట్‌ దగ్గరకు వచ్చి.

నలభై అయిదేళ్లు ఉంటాయి. చక్కగా హుందాగా ఉన్న స్త్రీ. చూస్తే ఒక సమర్థురాలైన స్త్రీగా కూడా అనిపిస్తుంది. లేత రంగు ఉన్న చీర కొంగును ఎడమ చేత గుప్పిట పట్టి మాట్లాడుతూ ఉంది.
‘పదిహేడేళ్లకు నా పెళ్లి చేశారు. అతడు ఆఫీసర్‌. మరో సంవత్సరానికి నాకు కొడుకు పుట్టాడు. జీవితానికి ఇంకేం కావాలి అనుకున్నాను. కాని అతనికి వ్యసనం ఉంది. తాగుడు వ్యసనం ఉంటే డబ్బు ఖర్చు అవుతుంది. కాని అనుమానపు వ్యసనం ఉంటే ఇంట్లో అందరి మనశ్శాంతి కరువవుతుంది. కిచెన్‌లో వంట చేస్తున్నా, బాత్‌రూమ్‌లో రెండు నిమిషాలు ఎక్కువ సేపు ఉన్నా, టెర్రస్‌ మీదకెళ్లి బట్టలు ఆరేస్తున్నా, ఫోన్‌ మాట్లాడినా అనుమానం. ఆడవాళ్లు మగవాళ్లను తిరిగి కొట్టకూడదనే నియమం ఒకటి సమాజంలో ఉంది అన్న ధైర్యంతో మగవాళ్లు ఆడవాళ్లను కొడుతుంటారు. అతడు నన్ను కొట్టేవాడు. తిట్టేవాడు. ఇంత డబ్బు పోసి కొనుక్కుంది ఇందుకా అనిపించింది. నా కొడుక్కి ఎనిమిదేళ్లు వచ్చే వరకు ఈ నరకం అనుభవించాను. వాడికి ఊహ తెలిశాక వాడు మాట్లాడిన మొదటి మాట– నాన్న మనకు వద్దమ్మా అని. వాడు నాకు ధైర్యం ఇచ్చాడు. వాడే నాకు వెలుతురు ఇచ్చాడు. వెంటనే ఆ కాపురం నుంచి బయటకు వచ్చాను. విడాకులు తీసుకున్నాను’...

సైకియాట్రిస్ట్‌ నోట్‌ చేసుకుంటూ ఉన్నాడు.
‘నేను చదువుకున్నాను. మా పుట్టింటి నుంచి ఆర్థికంగా సపోర్ట్‌ ఉంది. ఉద్యోగం చేయగలను. చేశాను. కొడుకును చూసుకున్నాను. నిజానికి వాడే నన్ను చూసుకున్నాడు. నాకు వాడు వాడికి నేను ఇలా జీవితం గడిచింది. మాకు మూడో మనిషి తెలియదు. మేమే ఒక లోకంగా ఉన్నాం. వాడికి ఎప్పుడు ఆకలేస్తుందో ఎప్పుడు నిద్ర పడుతుందో ఎప్పుడు సినిమాకెళ్లబుద్ధవుతుందో ఏ సబ్జెక్ట్‌ ఇష్టమో ఏ రంగు బట్టలు కోరుతాడో అన్నీ నాకు తెలుసు. నా మూడ్‌ ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు నవ్వుతానో, ఎప్పుడు డల్‌ అవుతానో, ఎప్పుడు వాడు నా ఎదురుగా కూచుని కబుర్లు చెప్పాలో అన్నీ వాడికి తెలుసు. ఒక్కమాట చెప్పాలంటే వాణ్ణే ఒక సర్కస్‌ బంతిని చేసుకొని అందులో నేను మోటార్‌ సైకిల్‌ ఎక్కి గిర్రున రౌండ్లుకొట్టేదాన్నిలా తయారయ్యాను. అంతా బాగుంది. సంతోషంగా ఉంది. అయితే వాడికి ఇప్పుడు 18 ఏళ్లు వచ్చాయి. వాడు లక్షన్నర పెట్టి బైక్‌ కొన్నాడు. మొన్నటి దాకా తప్పకుండా మణికట్టు మీద కట్టుకుంటూ ఉండిన వాచ్‌ను పక్కన పడేశాడు. వాడికిప్పుడు టైమే తెలియదు. ఇల్లు తెలియదు. అమ్మ తెలియదు. ఫ్రెండ్స్‌ లోకం. వాడికి రెక్కలొచ్చాయని అర్థమైంది. కాని వాడు ఎగిరిపోతే గూడులో నేనొక్కదాన్నే ఎలా ఉండాలి. అందుకే డిప్రెషన్‌. మూడు నెలలుగా సరిగ్గా లేను. బాగా చిరాగ్గా ఉంది. వాడే గమనించి మీదగ్గరకు వెళ్లమని పంపాడు’ అందామె.
సైకియాట్రిస్ట్‌ ఒక టాబ్లెట్‌ రాసి ‘ఇది పదిరోజులు వాడి రండి. ముందు కొంచెం మీరు తెప్పరిల్లాక కౌన్సిలింగ్‌ మొదలెడదాం’ అన్నాడు.
ఆమె తల ఊపి వెళ్లిపోయింది. పదిరోజులు గడిచిపోయాయి. ఆమె రాలేదు. సైకియాట్రిస్ట్‌కు తెలుసు– ఆమె తిరిగి రావడం ముఖ్యమని. కాని ఆమె ఆరు నెలల తర్వాత వచ్చింది. అదే డిప్రెషన్‌తో.

‘ఏమయ్యారు మీరు?’ అడిగాడు సైకియాట్రిస్ట్‌.
‘సారీ డాక్టర్‌. బిజీ వల్ల రాలేకపోయాను. మళ్లీ పెళ్లి చేసుకున్నాను’ అందామె.
‘అవునా... మంచి ఆలోచనే. కాని అందుకు అవసరమైన ప్రీ కౌన్సెలింగ్‌ తీసుకుని ఉంటే బాగుండేది’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.
‘అదే తప్పయ్యింది. ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్లాను’ అందామె. 

ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పింది.
‘మీ దగ్గరి నుంచి వెళ్లాక మా అబ్బాయే నా గురించి ఎక్కువ ఆలోచించాడు. అమ్మా... నువ్వు నా విషయంలో ఇన్‌సెక్యూర్‌ అవుతున్నావు. నేను బీటెక్‌ చేశాక యు.ఎస్‌ వెళ్లాలనుకుంటున్నాను. అప్పుడైనా ఇబ్బందే. నువ్వు పెళ్లి చేసుకో. మనిద్దరికీ నచ్చిన వ్యక్తినే వెతుకుదాం. నేను యు.ఎస్‌ వెళ్లేలోపు ఒకటి రెండేళ్లలో నువ్వు కూడా నీ లైఫ్‌ను ఆర్గనైజ్‌ చేసుకోవచ్చు అన్నాడు. బంధువులకు ఈ విషయం చెప్తే డైవోర్సీ అయిన ఒకతన్ని చూపించారు. మాకు నచ్చాడు. చేసుకున్నాను. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో ఆ క్షణం నుంచి సడన్‌గా నాకు కొత్త భయం వచ్చింది. ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా కొడుకు నన్ను కొద్దిగా అయినా పట్టించుకునేవాడు. ఇప్పుడు తన బాధ్యత తీరింది కాబట్టి అసలు పట్టించుకోడా అని వాణ్ణి ఇంకా అంటిపెట్టుకోవడం మొదలుపెట్టాను. ఇది నా భర్తను ఎక్కువ ఇరిటేట్‌ చేసింది. ఇటు భర్త తన వైపు లాక్కోవాలనుకోవడం, అటు కొడుకు మెల్లగా వదలించుకునే ధోరణిలోకి దిగడంతో సతమతమవుతూ వేదన అనుభవిస్తున్నాను. అసలు ఇంట్లో మా ముగ్గురికీ కూడా టెన్షన్‌ పెరిగిపోతుంది. ముగ్గురం ట్రాక్‌ తప్పాం. మాకు గైడెన్స్‌ కావాలి’ అందామె.

ఆడవాళ్ల జీవితం ఎన్ని భౌతిక మానసిక బంధనాల్లో కూరుకుపోయిందో ఆమెను చూస్తే అర్థమైంది సైకియాట్రిస్ట్‌కు. ఆ మరుసటి రోజు ఆమెను, ఆమె భర్తను, కొడుకును ఒకేసారి కూచోబెట్టాడు.
‘చూడండి... మీ ముగ్గురు మీపాత్రలను పోషించాల్సిన సమయాన్ని దాటి పాత్రలుగా మారిపోయారు. అంటే డైరెక్టర్‌ పేకప్‌ చెప్పాక కూడా నటులు అవే పాత్రల్లో ఉండిపోతే ఎంత నరకంగా ఉంటుందో అంత నరకాన్ని తెచ్చుకున్నారు. మీ ముగ్గురూ మొదట వ్యక్తులు. సొంత జీవితం, ఆలోచనలు, మీ ఇష్టాలు అయిష్టాలు, అభిరుచులు, కెరీర్, సంపాదన, సౌఖ్యం... ఇవన్నీ పట్టించుకోవాల్సిన వ్యక్తులు. ఈ ప్రాధాన్యం తర్వాత మీకు కొన్ని పాత్రలు ఉన్నాయి. ఈమెకు తల్లి పాత్ర ఉంది. భార్య పాత్ర ఉంది. ఈ రెండు పాత్రలనూ ఇరవైనాలుగ్గంటలూ పోషించకూడదు. ఈమె అయితే భార్య పాత్రను కూడా వదిలిపెట్టి తల్లిపాత్రనే పట్టుకుని పెనుగులాడటంతో కష్టం వస్తోంది.

ఇక భర్తగా వచ్చిన మీరు మీ భార్యను తల్లి నుంచి భార్యగా మార్చుకోవడం కోసం తొందరపడి ఆమెను టెన్షన్‌ పెడుతున్నారు. మీ ఇంటిపెద్ద పాత్రను వదిలి కేవలం భర్త పాత్రనే పోషిస్తున్నారు. కొడుకైన ఈ అబ్బాయి స్టూడెంట్‌ పాత్రలో పూర్తిగా ట్రాన్స్‌ఫర్‌ అయ్యి కొడుగ్గా, ఇంటి సభ్యుడిగా ఉండే పాత్రలను లైట్‌గా తీసుకుంటున్నాడు. ముందు మీరు మీ వ్యక్తిగత జీవితాన్ని నిర్థారణ చేసుకోండి. కుటుంబ జీవితాన్ని నిర్థారణ చేసుకోండి. ఒకరితో మరొకరితో ఉండాల్సిన బంధాన్ని ఇవ్వాల్సిన స్పేస్‌ను డిఫైన్‌ చేసుకోండి. డ్రాయింగ్‌ రూమ్‌లో సోఫాసెట్‌ కూడా ఒన్‌ ప్లస్‌ ఒన్‌ ప్లస్‌ త్రీ సీటర్‌గా డివైడ్‌ అయి ఉంటుంది. అంతే తప్ప ఫైవ్‌ సీటర్‌గా ఉండదు. ఆ విభజన అర్థం చేసుకుంటే మీ ముగ్గురు అభద్రతను, గందరగోళాన్ని వదిలి వాస్తవికంగా జీవించడం మొదలు పెడతారు’ అన్నాడతను.

ఆ ముగ్గురూ కొంచెం అర్థమైనట్టే వెళ్లారు.
ఆ తర్వాత భర్త ఇంటి టైమ్‌ ఆఫీస్‌ టైమ్, భార్య ఇల్లాలి టైమ్, తల్లి టైమ్, అబ్బాయి స్టూడెంట్‌ టైమ్, కొడుకు టైమ్‌ అంటే ఏమిటో బోధ పరుచుకున్నారు.
కాపురం సెట్‌ అయ్యింది. రేపో మాపో ఆమె సంతోషంగా అబ్బాయిని అమెరికా పంపనుంది. ఆ మర్నాడే భర్తతో పదిరోజుల పాటు హాలిడే ట్రిప్‌ను కూడా ప్లాన్‌ చేసుకుంటోంది.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

మరిన్ని వార్తలు