అన్యోన్యంగా.. ఆదర్శంగా..

13 Feb, 2014 23:04 IST|Sakshi

లక్ష్మీనారాయణౌ గౌరీశంకరౌ భారతీ విధీ
 ఛాయా సూర్యౌ రోహిణీందూ రక్షేతాం చ వధూవరౌ
 ఒకప్పటి రోజుల్లో ఈ శ్లోకం పెళ్లికూతురు నుదుట  కట్టిన ఫాలపట్టిక
 (భాషికం)లా- శుభలేఖకి పైభాగంలో కన్పిస్తూ ఉండేది. చాలామంది ఈ శ్లోకాన్నే పెళ్లి శుభలేఖకి పైన ఎందుకుంచేవారు? కారణం - ‘లక్ష్మీనారాయణులూ, పార్వతీ పరమేశ్వరులూ, బ్రహ్మాసరస్వతులూ, ఛాయాదేవీ సూర్యులూ, రోహిణీ చంద్రులూ అనే ఈ ఐదుజంటలూ ప్రస్తుతం వివాహం చేసుకోబోతున్న ఈ జంటను రక్షిస్తూ ఉందురు గాక!’ అని ఈ శ్లోకానికి అర్థం. అదీగాక ఈ ఐదుజంటలూ  ప్రేమించుకుని పెళ్లాడిన వాళ్లే. ఇంతకీ ప్రేమపెళ్లెలా ఉంటుంది, ఎలా ఉండాలి? ఈ పురాణ పాత్రల కథలేం చెబుతున్నాయి...

 - డా.మైలవరపు శ్రీనివాసరావు
 
 గెలిచిన ప్రేమ

 రుక్మిణీ కృష్ణులది ప్రేమవివాహమే. తన శరీరం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు అనే పంచ జ్ఞానేంద్రియాలూ తనవేనంటూ రుక్మిణి కృష్ణునికి తెలియజేసింది. అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా ఆ వర్తమానాన్ని పంపింది. (‘ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రమ్ముల కలిమియేలా..? జన్మమేల ఎన్ని జన్మములకు?...’ అని పోతనామాత్యుడి ‘శ్రీమద్భాగవతం’లో రుక్మిణి అంటుంది). ఆ సందేశంలోని మనఃపూర్వక విధానాన్ని గమనించిన కృష్ణుడు ఆమెను పత్నిగా పరిగ్రహించాడు. భార్యగా కావాలని తీసుకువెళ్లాడు.
 
 ఆ కృతజ్ఞతాభావం ఆమెలో ఉంది కాబట్టే శ్రీకృష్ణుడు ఆ తరువాతి కాలంలో ప్రేమపరీక్షా సమయంలో ఒక్క తులసిదళంతో తూగిపోయాడు. ఇక, రాధాకృష్ణులనే ప్రేయసీప్రియుల్లో రాధ అనే ఆమె కృష్ణుని సర్వాంగాలనూ ఆరాధించే ఆరాధన మూర్తి. అయితే, అక్కడ మనమనుకునే తీరుగా ప్రేమ, పెళ్లి, సంతానమనే ధోరణి కలది కాదు.
 
 నిజమైన ప్రేమ


 పరమశివుడు తపస్సు చేసుకుంటుంటే ఆయన వద్ద  సేవకురాలిగా చేరింది పార్వతి. ఒకరోజు ఆయన దినచర్యని గమనించింది. అంతే! ఆయన చెప్పనవసరం లేకుండా ఏ సమయానికి ఏది అవసరమో అలా సేవ చేయడం ప్రారంభించింది. అప్పటికి ఇద్దరికీ ఏ విధమైన ఆలోచనా లేనేలేదు.
 
మన్మథుడు ప్రేమబాణం వేయగానే శంకరుడామెని మరోదృష్టితో చూశాడు. కర్తవ్యానికి విఘ్నం కలుగుతోందని గమనించి మన్మథుణ్ణి భస్మం చేశాడు. పార్వతికి ఆ విధానం నచ్చింది. ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని దీక్షతో నెరవేర్చుకుంటూన్న వేళ విఘ్నాన్ని కావాలని కలుగజేసినప్పుడు అతణ్ణి క్షమించడం నేరం కాదనే అభిప్రాయంతో శివుణ్ణే వివాహమాడాలని ప్రేమించ ప్రారంభించింది. తలిదండ్రులు కాదన్నా వినలేదు. తపస్సు ప్రారంభించింది.
 
శంకరుడు మాయారూపంలో బ్రహ్మచారిగా వెళ్లాడు. బూడిద బుస్సన్న- ఇల్లు లేనివాడు- శ్మశాన నివాసి- బిచ్చగాడు- రుద్రాక్షధారి- లయకర్త- వాడితో నీకెందుకన్నాడు పార్వతితో. ‘శంకరుణ్ణి గురించి తెలియక నిందిస్తున్న నీ మాటలను వినడం నేర’మంటూ ఆమె వెళ్లిపోబోయింది. అంతే... శంకరుడామె చేతిని పట్టి వివాహం కావాలన్నాడు. ‘నీ ప్రేమతో దాసుణ్ణి కొనుక్కున్నా’వన్నాడు. అంతేకాదు, తల నుండి కాలి వరకూ తనలో సగభాగాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చేశాడు.
 
తల ఆలోచనకి స్థానమైతే, కాలు ఆచరణకి సంకేతం. కాబట్టి ఆలోచన నుండి ఆచరణ వరకూ ఇద్దరం కలిసే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రేమజంట. అంటే... పెళ్లి అయ్యాక కూడా పరస్పరం సహకరించుకుంటే అదే నిజమైన ప్రేమ అని ఈ జంట చెబుతోందన్నమాట.
 
విజయ ప్రేమ

పాలసముద్రం దగ్గరికొచ్చారు దేవతలూ రాక్షసులూ. సముద్రంలో దాగున్న లక్ష్మీదేవి గమనిస్తోంది. తాము పాముకి తలవైపు పట్టుకుని చిలుకుతామన్నారు రాక్షసులు. సరేనన్నాడు శ్రీహరి. కొంతసేపయ్యాక తోకవైపు పట్టుకుంటామన్నారు- తలవైపు నుండి విషం వస్తుంటే ఆ ఘాటుకి తట్టుకోలేక. దానిక్కూడ సరేనన్నాడు నారాయణుడు. ఇంతలో కవ్వంగా ఉన్న మందర పర్వతం కాస్తా సముద్రంలో దిగబడిపోయింది. తాబేలు రూపాన్నెత్తి పర్వతాన్ని నిలబెట్టి పనిని కొనసాగింపజేశాడు విష్ణువు. ఇలా ప్రతి సందర్భంలోనూ తన కార్యసాధన పద్ధతిని నిరూపించుకుంటూ మొత్తానికి అమృతాన్ని సాధించాడు జనార్దనుడు.
 
శ్రీమన్నారాయణుని కార్యదీక్షాదక్షతకి ఆనందపడి ఆయనతో చూపులు కలిపింది లక్ష్మీదేవి! విష్ణువు కూడా లక్ష్మితో చూపుల్ని కలిపాడు. వారికి వివాహమైంది. ఆమెకి నివాసంగా తన వక్షఃస్థలాన్ని ఇచ్చాడు శ్రీహరి. ఆమె శ్రీహరి హృదయం మీదే నివసిస్తూ- ఆయన ఏ ఆలోచనతో ఉన్నాడో గమనిస్తూ సహకారాన్ని అందించడం ఆరంభించింది. ‘రావణుణ్ణి ఎలా వధించాలా?’ అని విష్ణువు ఆలోచిస్తుంటే వేదవతి రూపంతో వెళ్లి రావణునికి మరణ శాపాన్నిచ్చి వచ్చింది లక్ష్మి. అంటే ... పెళ్లయ్యాక కూడ పరస్పరం సహకరించుకోవడం జరిగితే ఆ ప్రేమపెళ్లి విజయవంతమైనట్లేనని భావమన్నమాట. పెళ్లికి ముందూ, పెళ్లికాలంలో, పెళ్లయ్యాక కూడ ఉండేదే ప్రేమ అని భావం!
 

మరిన్ని వార్తలు