నోరూరించి ఉసిరితో మెంతి కుర్మా చేయండి ఇలా!

17 Nov, 2023 10:50 IST|Sakshi

కావలసినవి:
ఉసిరి కాయలు – పది
మెంతిఆకు –రెండు కట్టలు
పచ్చిమిర్చి – రెండు
అల్లం – అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు – ఐదు
ఉల్లిపాయలు – రెండు
టొమాటోలు – రెండు
నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు
జీలకర్ర – అర టీస్పూను
సోంపు – అర టీస్పూను
వాము –  టీస్పూను
ఇంగువ – చిటికెడు
పసుపు – అర టీస్పూను
గరం మసాలా – టీస్పూను
ధనియాల పొడి – టీస్పూను
జీలకర్ర – టీస్పూను
కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం: ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఉడికించాలి. ఉడికిన తర్వాత గింజలు తీసేసి, పెద్దసైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిని సన్నగా తరగాలి. మెంతిఆకును కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో నూనెవేసి వేడెక్కనివ్వాలి. నూనె కాగిన తరువాత, మీడియం మంట మీద ఉంచి..జీలకర్ర, సోంపు, వాము వేయాలి. ఇవి చిటపటలాడాక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు మగ్గనియ్యాలి.

ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత టొమాటో ముక్కలు కొద్దిగా నీళ్లుపోసి మూతపెట్టి మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తరువాత మూత తీసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు మగ్గిన తరువాత టొమాటో ముక్కలు చక్కగా మెత్తబడతాయి. ఇప్పుడు మెంతిఆకు తరుగు వేసి కలపాలి. సన్నని మంట మీద కలుపుతూ ఉంటే మెంతిఆకు ఇట్టే మగ్గిపోతుంది మెంతిఆకు మగ్గిన తరువాత గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడులు వేయాలి. వెంటనే ఉసిరికాయ ముక్కలను వేసి మసాలాలు  ముక్కలకు పట్టేలా కలపాలి. చివరిగా రెండు టేబుల్‌ స్పూన్లు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనిస్తే మెంతి ఉసిరి కుర్మా రెడీ. చపాతీ, రోటీ, అన్నం, సలాడ్‌లోకి ఈ కుర్మా మంచి కాంబినేషన్‌. 

(చదవండి:

మరిన్ని వార్తలు