వారి సంక్షేమమే ఊపిరిగా...

8 Mar, 2015 22:33 IST|Sakshi
వారి సంక్షేమమే ఊపిరిగా...

అవిశ్రాంతం : అరవై తర్వాత
ఆయన పోలీస్ శాఖలో డిఎస్పీగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నిరంతర కృషి, కార్యదీక్ష, దక్షతలతో అడిషనల్ ఎస్పీగా, డిఐజీగా... ఐజిగా ఎదిగి విధుల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. అయితే ఈ విశ్రాంతి ఉద్యోగవిధులకే తప్ప, తాను చేస్తున్న పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు కాదంటారాయన. ఎంత ఎదిగినా, తన మూలాలను మరువలేనని, బంజారాల సంక్షేమమే తన జీవిత ధ్యేయంగా కృషి చేస్తున్నానని వివరించారు. ఇప్పుడు ఆయన వయస్సు 74.

ఉద్యోగం కన్నా విశ్రాంత జీవితం ఎన్నో పాఠాలను నేర్పిస్తుందంటున్న ఈ విశ్రాంత పోలీస్ ఉన్నతాధికారి కొర్రా జగన్నాథరావు ఇప్పుడు ఏమి చేస్తున్నారో ఆయన మాట ల్లోనే!
 
‘‘ఎప్పుడూ ఉరుకుల పరుగుల మీద ఉండే విధుల నుంచి ఒక్కసారిగా విశ్రాంతి లభించేసరికి ఉక్కిరిబిక్కిరియ్యాను. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం నాకు బాగా తెలిసిన ఒక మల్టీనేషనల్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో నాలుగేళ్లు పనిచేశాను. ఏ పనికైనా త్వరగా అలవాటుపడిపోయే నా నైజంతో మెల్లగా విధులనుంచి సేవాకార్యక్రమాల వైపుగా దృష్టి కేంద్రీకరించాను.
 
చెక్కుచెదరని జ్ఞాపకాలు... పోలీసు శాఖలో 1963లో డిఎస్పీగా మొదలైన నా ఉద్యోగ జీవితం ఎన్నో అనుభవాలను నేర్పింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాలలో విధులు నిర్వర్తించాను. వాటన్నిటినీ తలుచుకుంటూ కాలక్షేపం చేస్తే ఈ రోజు ఇంత చురుగ్గా ఉండేవాడిని కాదు. పని అనేది వయసుకు కాదు, మనసుకు ఉండాలి. ఖాళీగా ఉన్నామంటే జీవితం ‘ఖాళీ’ అయిపోనట్టే.
 
ఆరోగ్యమే ధీమా... వయసు పైబడుతున్నకొద్దీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కృషి చేయాలి. లేదంటే ఓ మూలన కూర్చోవాల్సిందే. అందుకే, ఉదయాన్నే మూడున్నరకల్లా మేల్కొంటాను. గంటసేపు వాకింగ్, గంటసేపు యోగ సాధన... ఆ తర్వాత అల్పాహారం చేసి 9:30 కల్లా జూబ్లీహిల్స్‌లో ఉన్న మా ఇంటి నుంచి నాంపల్లిలో ఉన్న బంజారా సేవా సమితి కార్యాలయానికి చేరుకుంటాను. సాయంత్రం వరకు అక్కడే గడుపుతాను!

ఎందుకంటే ఎన్ని రిజర్వేషన్లు, మరెన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చినా బంజారా(లంబాడ)లు ఇంకా అట్టడుగుస్థాయిలోనే ఉన్నారు. ఆచార వ్యవరాలు గతి తప్పుతున్నాయి. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బంజారా సంస్కృతికి కొత్త ఊపిరి ఊదడానికి నా వంతుగా ఆలిండియా బంజారా సేవాసంఘ్, సేవాలాల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడి (తెలుగు రాష్ట్రాలలో)గా సేవలు అందిస్తున్నాను.

అందులో భాగంగా బంజారా విద్యార్థుల చదువుల మీద చర్చించడం, వచ్చిన అర్జీలను పరిశీలించి, అర్హత గల వారికి స్కాలర్‌షిప్‌లు మంజూరుచేయడం, ప్రభుత్వ పథకాలు నిరుపేద బంజారాలకు అందించే ఏర్పాట్లు చూస్తుంటాను. ఏడాదికి ఒకసారి ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జరిగే ‘సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల’ ఏర్పాట్లు పర్యవేక్షిస్తాను. నిరక్షరాస్యత కారణంగా బంజారాలలో చోటు చేసుకుంటున్న దుర్వ్యసనాలు, వరకట్నభయంతో  ఆడపిల్లలను దూరం చేసుకోవడం వంటి సమస్యలను ప్రధానంగా తీసుకొని బంజారాల సంక్షేమానికి కృషి చేస్తున్నాను. విధుల్లో ఉన్నప్పుడు చేయలేని పనులను విశ్రాంత  జీవనంలో చేయడానికి కావల్సినంత సమయం ఉంది. దానిని సద్వినియోగం చేయడానికే తపిస్తున్నాను’’ అని వివరించారు జగన్నాథరావు.
- నిర్మలారెడ్డి
ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్

మరిన్ని వార్తలు