నా ముఖం చూసి చెప్పు

24 Sep, 2018 03:58 IST|Sakshi

సాహిత్య మరమరాలు

శారీరకంగా చాలా బలహీనంగా కనపడే కాళోజీ అతి ధైర్యశాలి. ఆ ధైర్యం కూడా అతనిలో గల ఆర్ద్ర హృదయ జనితమే. దుర్మార్గాన్నీ అక్రమాన్నీ ఎదురించవలసి వచ్చినప్పుడు వెనుక ముందు ఆలోచించే ఓపిక కాళోజీకి లేదు. 1948లో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకానికి వస్తున్నది. వరంగల్‌ సెంట్రల్‌ జైలులో మేమంతా ఖైదీలుగా వుంటిమి. అప్పుడు బురుజు మీద ఉన్న ఒక సిపాయి రాత్రి ఎనిమిది గంటల సమయంలో మమ్ములందరినీ ఉద్దేశించి ‘‘తుపాకితో వీళ్లను కాల్చి చంపినా పాపం లేదు’’ అని తన అక్కసు వెల్లడించుకొన్నాడు.

కాళోజీ, మిగతా మేమంతా ఆ సమయంలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ వున్నాము. విన్నాము. తక్షణమే కందిల్‌(లాంతరు) తీసుకొని బురుజు దాకా పరుగెత్తి, దీపము వానికి చూపి ‘‘ధైర్యముంటే కాల్చవోయ్‌’’ అని అతనికి సవాలు చేశాడు. వాడెందుకో భయపడి బురుజు దిగి పోయినాడు. నిజంగా మేమంతా చాలా భయపడ్డాము. కాళోజీ చేసిన సాహసం యితరు లెవ్వరూ చేయరు. ఆ సిపాయీ ఉన్మత్తుడై కాల్చి వున్నటై్టతే పరిస్థితి ఏమై వుండేది? ఆ ఆలోచనే కాళోజీ మనస్తత్వానికి విరుద్ధం. ఆ సమయంలో ఆ సిపాయీలో గల దుష్టత్వాన్ని సహించే ఓపిక కాళోజీకి లేదు. కాళోజీ జీవనంలో ఇదే తత్వము ప్రతి సంఘటనలోనూ కనబడుతుంది. 

(‘కాళోజీ యాదిలో’ భండారు చంద్రమౌళేశ్వరరావు ) 

మరిన్ని వార్తలు