అమ్మాయి ఎప్పుడూ ఒంటరిగా.. పరధ్యానంగా!

6 Dec, 2017 23:41 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌ 

హోమియో కౌన్సెలింగ్స్‌
మా అమ్మాయి వయసు 25 ఏళ్లు. గత ఆర్నెల్లుగా పరధ్యానంగా ఉంటోంది. ఎవరితో సరిగా మాట్లాడటం లేదు. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమెకు  సరైన హోమియో మందు సూచించండి.
– నిరుపమ, గూడూరు

మీరు చెబుతున్న లక్షణాలు డిప్రెషన్‌ వ్యాధిని సూచిస్తున్నాయి. డిప్రెషన్‌ను మనసుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మత. దీనికి గురైన వారు విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్‌లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి పరిపూర్ణ చికిత్స ఉంది.
డిప్రెషన్‌ను 1950–60లలో రెండు రకాలుగా విభజించారు. ఒకటి వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్‌ డిప్రెషన్‌. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని డిప్రెసివ్‌ డిజార్డర్‌గా పేర్కొన్నారు. దీనిలో రకాలు:
∙మేజర్‌ డిప్రెషన్‌: ఇందులో డిప్రెషన్‌ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
∙డిస్థిమిక్‌ డిజార్డర్‌: రోగి తక్కువస్థాయి డిప్రెషన్‌లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్‌ లక్షణాలు కనిపిస్తాయి.
∙సైకియాటిక్‌ డిప్రెషన్‌: డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి.
∙పోస్ట్‌ నేటల్‌ డిప్రెష : మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి.
∙సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిప్రెషన్‌: సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్‌ లక్షణాలు కనిపిస్తుంటుంది.
∙బైపోలార్‌ డిజార్డర్‌: ఈ డిప్రెషన్‌లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్‌ అయిపోతారు.
హోమియో వైద్యవిధానంలో నేట్రమ్‌మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్‌ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్‌ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో) స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

మెడనొప్పి చేతులకు ఎందుకు పాకుతోంది?
నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా మెడనొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి ఇప్పుడు చేతుల వరకూ పాకుతోంది. వేళ్లు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. మందులు వాడుతున్నంత కాలం బాగానే ఉన్నా ఆపేస్తే మాత్రం మళ్లీ నొప్పి వస్తోంది. హోమియో మందులతో ప్రయోజనం ఉంటుందా?
– సంజయ్, హైదరాబాద్‌

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి ఇది సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అనిపిస్తోంది. మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్‌ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. దీనినే సర్వైకల్‌ స్పైనల్‌ ఆర్థరైటిస్‌ అని కూడా అంటారు.
కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్‌లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు.
నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్‌ఆర్, ఎక్స్‌–రే సర్వైకల్‌ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు.
చికిత్స: జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా తగ్గేలా చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండీ, హోమియోకేర్‌
ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

పైల్స్‌ సమస్యకు పరిష్కారం చెప్పండి...
నా వయసు 54 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్‌ అన్నారు. హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – జీవరత్నం, కాకినాడ
చాలా ఇబ్బంది కలిగించే సమస్యల్లో మొలల సమస్య ఒకటి. ఈ సమస్యలో మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి.
మొలల దశలు: గ్రేడ్‌–1 దశలో మొలలు పైకి కనిపించవు.నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది.
గ్రేడ్‌–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి.
గ్రేడ్‌–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి.
గ్రేడ్‌–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు.
కారణాలు: ∙మలబద్దకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి ∙సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ∙మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ∙మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీరు తక్కువగా తాగడం ∙ఎక్కువగా ప్రయాణాలు చేయడం ∙అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ∙మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం.
నివారణ: ∙మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ∙ సమయానికి భోజనం చేయడం ముఖ్యం ∙ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం  ∙నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ∙మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ∙మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్‌ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు.హోమియోలో రోగి వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా మందులు ఇచ్చి వ్యాధిని నయం చేయచ్చు.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ
పాజిటివ్‌ హోమియోపతి,
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు