ఆవుపేడతో అడవికి జీవం

6 Dec, 2017 23:38 IST|Sakshi

ఎండిపోయే చెట్లకు ఆవుపేడ, బంకమట్టితో పునరుజ్జీవనం

ఆసిఫాబాద్‌ ఫారెస్టు అధికారి కొత్త ప్రయోగం

సాక్షి, ఆసిఫాబాద్‌: ఏళ్ల నాటి చెట్టు కళ్ల ముందే కనుమరుగవుతుంటే ఏమి చేయలేక ఇన్నాళ్లు నిరాశపడిన అటవీ అధికారులకు ఓ చక్కటి పరిష్కారం దొరికింది. సహజ సిద్ధంగా ఎటు వంటి ఖర్చు లేకుండా ఆవుపేడ, బంకమట్టి తో ఎండిపోయే చెట్లకు పునర్జీవం పోయడమే ఈ పద్ధతి ప్రత్యేకత. సాధారణంగా అడవి లోని చెట్లను కలప కోసమో లేక అటవీ భూమిని సాగుచేయాలనో స్థానికులు చెట్లను నరికివేస్తారు. కానీ కొన్ని చెట్లు ధృఢంగా ఉంటాయి. వీటిని గొడ్డలితో నరకడం కష్టం. దీంతో చెట్టు కాండానికి గొడ్డలితో గాటు పెట్టి కొద్ది రోజుల తర్వాత వాటంతట అవే ఎండిపోయేలా చేసి అక్కడి భూమిని సాగు చేయడమో లేక ఎండిన కలపను అక్రమంగా తరలించడమో చేసేవారు. అటవీ అధికారు లు ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టడం, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను సస్పెండ్‌ చేయడమో చేసేవారు. కానీ గొడ్డలి గాయలతో ఉన్న చెట్లు మాత్రం నెల రోజుల వ్యవధిలో చూస్తుండగానే ఎండిపోయేవి.

గాటు పెట్టి వదిలివేయడం
అక్రమంగా అడవిలో చెట్లను నరికేవాళ్లు గొడ్డలి వంటి ఆయుధాలతో నరికి వేసి తమకు అనువైన సమయంలో వాటిని తరలిస్తారు. కానీ నారేపి, నల్లమద్ది తదితర జాతులకు చెందిన చెట్లు ధృ«ఢంగా ఉంటాయి. వీటిని గొడ్డలితో నరకడం కొంత కష్టంతో పని. అంతేకాక ఒక వేళ కష్టపడి చెట్టును నరికి వేసిన దానిని మరల ముక్కలుగా చేసి అటవీ ప్రాంతం నుంచి బయటికి తరలించడం మరింత కష్టం. ఎలాగైనా చెట్లను అక్కడి నుంచి తొలగించాలని భావించిన వాళ్లు ముందుగా ఆ చెట్టు కాండం చుట్టూ దాదాపు 10 సెంటీమీటర్ల వరకు గొడ్డలితో ఒక పెద్ద గాటు పెడతారు. దీంతో కాండంపై ఉన్న బెరడు తొలగిపోవడంతో ఆ చెట్టు కొమ్మలపై భాగానికి కింది భాగంలో ఉండే వేరు వ్యవస్థకు పోషక పదార్థాల సరఫరా ఆగిపోతుంది. దీంతో నెల రోజుల్లోనే ఆ చెట్టు పూర్తిగా ఎండిపోతుంది. అప్పుడు చెట్టు మొదలు వద్ద నిప్పు పెట్టడంతో మొత్తం బూడిద అవుతుంది. అలాకాక దుంగలు అవసరముంటే ఎండిన తర్వాత ముక్కలుగా చేసుకుని అక్కడి నుంచి తరలిస్తారు. దీంతో చెట్టు దానంతట అదే కింద పడిపోయి చనిపోయిందనుకునేలా అటవీ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు కొంత మంది ఈ ఎత్తుగడను అనుసరించేవారు. దీనికి విరుగుడుగా ఆసిఫాబాద్‌ డివిజన్‌ అటవీ అధికారి డి.రవీందర్‌గౌడ్‌ ఓ కొత్త పద్ధతిని తెలుసుకుని ఆ చెట్లను బతికించి నిరూపించారు.

ఆవుపేడ, బంక మట్టితో
చెట్టు కాండం చుట్టూ గొడ్డలితో చేసిన గాటును మొదట సున్నితంగా ఎండిన బెరుడు కణాల్ని తొలగించారు. ఆ ప్రాంతాన్ని నునుపుగా చేసి జీవం ఉన్న కణాలకు పైభాగాన్ని కింది భాగాన్ని కలుపుతూ ఆవుపేడ, బంక మట్టిని నీటితో కలిపి చేసిన మిశ్రమాన్ని ఆ గాటు పడిన ప్రాంతంలో అతికించారు. ఇలా కొద్దిరోజుల వరకుపై బెరుడుకు కింది బెరడు ద్వారా పోషక పదార్థాల సరఫరా జరిగి చెట్టుకు మళ్లీ పునరుజ్జీవనం కలిగింది. ఈ పద్ధతిలో గత సెప్టెంబర్‌లో ఆసిఫాబాద్‌ డివిజన్‌ పరిధిలోని దహెగం మండలం రావులపల్లి అడవిలో సుమారు 70పైగా నారేపి, నల్లమద్ది తదితర జాతులకు చెందిన చెట్లకు జీవం పోశారు. ఈ ప్రయోగంతో అటవీశాఖకు ఓ పరిష్కారం దొరికినట్టేనని అటవీ అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు