రుచుల రుతువు

20 Mar, 2015 23:02 IST|Sakshi
రుచుల రుతువు

కోకిల... వగరు పాట. వేప... చేదు పూత.
చెరకు... తీపి గడ. చింతపండు... పుల్లటి రసం.
మిర్చి... ఘాటైన ప్రేమ. ఉప్పు... తెల్లటి రుచి.
వసంతం... రుచుల రుతువు.
అన్నిటి మేళవింపులే ఉగాది తాలింపులు.
 
అయ్యంగారి పులిహోర

చింతపండు - 200 గ్రా.; ఎండు మిర్చి - 25; శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; నువ్వుల నూనె - కప్పు; ఉప్పు తగినంత
 
పొడి కోసం: ధనియాలు - 3 టేబుల్ స్పూన్లు; మెంతులు - టీ స్పూను; ఎండు మిర్చి - 15; ఇంగువ - కొద్దిగా
అన్నం కోసం: బియ్యం - 4 కప్పులు; మినప్పప్పు - 3 టీ స్పూన్లు; పల్లీలు - అర కప్పు; జీడిపప్పు - అర కప్పు; కరివేపాకు - ఒక కట్ట; నువ్వుల నూనె - 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి - 3; ఉప్పు - తగినంత

తయారీ:  చింతపండు రెండు కప్పుల వేడి నీళ్లలో సుమారు అరగంటసేపు నానిన తర్వాత, మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మిక్సీ పట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టాలి. (చెత్త వంటివన్నీ పైన ఉండిపోతాయి. అవసరమనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు జత చేసి జల్లెడ పట్టవచ్చు. మిశ్రమం చిక్కగా ఉండాలే కాని పల్చబడిపోకూడదు)   ధనియాలు, మెంతులను విడివిడిగా బాణలిలో నూనె లేకుండా వేయించి, చల్లారాక విడివిడిగానే మెత్తగా పొడి చేయాలి  బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, మినప్పప్పు వరుసగా వేసి వేయించాలి  చింతపండు గుజ్జు జత చే సి బాగా కలిపి నూనె పైకి తేలేవరకు బాగా ఉడికించాలి  మెంతి పొడి జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి  వేరొక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి,  మినప్పప్పు, కరివేపాకు వరుసగా ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించాక, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి దించేయాలి  ఒక పళ్లెంలో అన్నం వేసి పొడిపొడిగా విడదీసి, టీ స్పూను నువ్వుల నూనె వేసి కలిపాక, ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జు, పోపు సామాను వేసి కలపాలి  ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి కలపాలి.
 
మామిడికాయ నువ్వు పప్పు పచ్చడి
 
కావలసినవి: పచ్చి మామిడి కాయలు - 2; నువ్వులు - కప్పు; పచ్చి మిర్చి తరుగు - అర కప్పు; వెల్లుల్లి రేకలు - అర కప్పు; అల్లం తురుము - 2 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఆవాలు - టీ స్పూను; కరివేపాకు - 4 రెమ్మలు; ఎండు మిర్చి - 4; రిఫైన్డ్ ఆయిల్ - 350 మి.లీ.; పసుపు - టీ స్పూను; ఉప్పు - తగినంత

తయారీ:  మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి  బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, పసుపు వేసి బాగా కలిపి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి  వేరొక బాణలిలో నూనె లేకుండా, నువ్వులు వేసి వేయించి చల్లారాక మెత్తగా పొడి చేయాలి  వేయించి ఉంచుకున్న మామిడికాయ ముక్కల మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి  బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు వేసి వేగాక, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి, చివరగా కరివేపాకు వేసి వేయించి తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి  వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యితో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
 
వేప పువ్వు చారు

కావలసినవి: వేప పువ్వు - 3 టేబుల్ స్పూన్లు; చింతపండు - కొద్దిగా; ధనియాల పొడి - పావు టీ స్పూను; ఇంగువ - చిటికెడు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 4; పచ్చి మిర్చి - 2; కొత్తిమీర - కొద్దిగా; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; పసుపు - తగినంత; నూనె - టీ స్పూను
 తయారీ:  వేపపువ్వును శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి  చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి  బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా వేసి వేయించాలి  వేప పువ్వు, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చింతపండు రసం వేసి బాగా కలపాలి  రసం పొంగుతుండగా మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తి మీర వేసి ఒక పొంగు రానిచ్చి దించేయాలి.
 

మరిన్ని వార్తలు