పాప ముఖం మీద మచ్చలు.. తగ్గడం ఎలా? 

31 Jul, 2019 09:26 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

మా పాపకు 14 ఏళ్లు. ఏడాది కిందటి నుంచి ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు పోవడానికి ఏం చేయాలి?
– డి. రమాసుందరి, విజయనగరం 

మీ పాపకు ఉన్న కండిషన్‌ నీవస్‌ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్‌ నీవస్‌ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్‌డ్‌ స్పాట్స్‌ ఆన్‌ ద స్కిన్‌) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివీ, చాలా సాధారణంగా కనిపించే మచ్చలు. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్‌ మచ్చ. ఒంటిపై మచ్చలు పుట్టుకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు  10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్‌ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది.

ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా  ఎక్స్‌పోజ్‌ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్‌ బేసల్‌ సెల్‌ కార్సినోమా అనే కండిషన్‌ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతో పాటు జన్యుపరమైన అబ్‌నార్మాలిటీస్‌ చూస్తుంటాం.

అలాంటి వాళ్లకు ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. మీ పాపకు ఉన్న కండిషన్‌తో పైన చెప్పినవాటికి సంబంధం లేదు. మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్‌ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా  క్యాన్సర్‌ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది.

అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ– అంటే బార్డర్‌... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ– అంటే కలర్‌... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ– అంటే డయామీటర్‌... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం)  పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అప్పుడు బయాప్సీ తీసి పరీక్ష చేసి అది హానికరమా కాదా అన్నది వారు నిర్ణయిస్తారు.

ఇక ఇలాంటివి రాకుండా ఉండాలంటే... ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కావడం పూర్తిగా తగ్గించాలి. హానికారక అల్ట్రావాయొలెట్‌ కిరణాలు తాకకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు ఎక్కువ ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌ స్క్రీన్‌ లోషన్స్‌ రాసుకోవాలి. మీ పాపకు ఉన్న మచ్చల్ని అప్పుడప్పుడూ డెర్మటాలజిస్ట్‌తో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి నీవస్‌లు ముఖం మీద ఉండి కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... దీన్ని ఎక్సెషన్‌ థెరపీతో వాటిని తొలగించవచ్చు.  

రంగులతో ఉండే ఆహారాలు తీసుకోవచ్చా? 
మా బాబు బాగా ఆకర్షణీయమైన రంగులు ఉండే స్వీట్లు, ఆహారపదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. వాటినే ఇప్పించమని అడుగుతుంటాడు. అవి  మంచిదేనా?
– ఎమ్‌. శ్రీవాణి, మేదరమెట 

ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్‌ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలు తీసుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే  వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది.

ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అది దీర్ఘకాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడే ప్రిజర్వేటివ్స్‌లో  సన్‌సెట్‌ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్‌ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్‌ ఎల్లో, అల్యూరా రెడ్‌ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణులు (హైపర్‌ యాక్టివిటీ) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్‌ వంటి రసాయనాలు విటమిన్‌ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్‌ కారకం (కార్సినోజెన్‌)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ రసాయనం భవిష్యత్తులో లివర్‌ సిర్రోసిస్‌కు, పార్కిన్‌సన్‌ డిసీజ్‌లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయ్యింది. అందుకే అతిగా రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. 
- డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్‌ పీడియాట్రీషియన్, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు