శక్తి మహాన్‌

8 May, 2019 01:33 IST|Sakshi

గ్రేట్‌ ఇండియన్‌  సీరియల్స్‌–15 

ఇప్పటి పిల్లలకు అవెంజర్స్‌ అంటే పిచ్చి ఇష్టం. అందులోని వీరోచిత గాథలు, మ్యాజిక్స్‌ని కళ్లార్పకుండా చూస్తారు. అచ్చు ఇలాగే 90ల కాలం నాటి పిల్లలు టీవీలకు అతుక్కుపోయి ఒక వీరోచిత పోరాటయోధుణ్ణి చూశారు. ‘సూపర్‌హీరో..’ అంటూ చప్పట్లతో కేరింతలు కొడుతూ  తామూ శక్తిమాన్‌లా పోజులిచ్చేవారు. ‘శక్తిమాన్‌’ ఇండియన్‌ సీరియల్స్‌లోనే సూపర్‌ హీరో. 1997 నుంచి దాదాపు ఏడున్నరేళ్లపాటు 520 ఎపిసోడ్స్‌తో పిల్లా పెద్దా అనే తేడా లేకుండా ఆకట్టుకుంది. ఈ సీరియల్‌ సృష్టికర్తలు ముఖేష్‌ఖన్నా, దినకర్‌ జైని. ఈ సీరియల్‌ ఒక్క దూరదర్శన్‌లోనే కాదు ఆ తర్వాత కాలంలో ఇతర టీవీ చానెల్స్‌లో అన్ని భాషల్లోనూ ప్రసారమైందంటే శక్తిమాన్‌కున్న శక్తి ఏంటో తెలుసుకోవచ్చు. ప్రొడ్యూసర్‌ ముఖేష్‌ ఖన్నా ఈ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ శక్తిమాన్‌ పాత్ర పోషించారు. దినకర్‌ జైని దర్శకత్వం వహించారు.

కథ ఇలా మొదలు..
పది వేల ఏళ్ల క్రితం ఎటు చూసినా పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, గలగలపారే నదీ నదాలు, సెలయేళ్ల తుళ్లింతలు, ఆరోగ్యకరమైన సకల జీవరాశితో ఈ పుడమి ఎంతో అందంగా ఉండేది. కాలుష్యమన్నదే లేకుండా ప్రకృతి వనరులు ఎంతో స్వచ్ఛంగా ఉండేవి. మహర్షుల నోటినుంచి వెలువడే పవిత్ర వేదనాదాలతో కొండలు, కోనలు పునీతమయ్యేవి. అలాంటిది.. 6వేల ఏళ్ల క్రితం నుంచి భూమి మీద ఎన్నో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. యుద్ధాల వల్ల ప్రకృతి వినాశనం జరుగుతూ వచ్చింది. మనుషుల్లో అన్యాయం పెచ్చుమీరటం వల్ల ఎంతో కీడు జరుగుతూనే ఉంది. వీటన్నింటి నుంచి ప్రకృతిని కాపాడటానికి ఒక మహోన్నత వ్యక్తి కావాలి. ఆ ఒక్కరు ఎవరు?! అనే ప్రశ్నకు హోమవాటిక ముందు కూర్చున్న వ్యక్తి సమాధానంగా కనిపిస్తారు.

ఓంకార్‌ నాద్‌
‘పండిట్‌ గంగాధర్‌ విద్యాధర్‌ మయాధర్‌ ఓంకార నాద శాస్త్రి అనే వ్యక్తి వేదపండితుల ద్వారా తెలుసుకున్న ధ్యానశక్తితో ఓ కొత్త శక్తిని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు మహర్షులూ తమవంతు సహకారం అందించారు. మహాయజ్ఞం తలపెడతాడు ఓంకారనాద శాస్త్రి. భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని.. ఈ పంచమహాభూతాల శక్తితో మనిషిలోని ఏడు చక్రాల అధారంగా కుండలిని శక్తిని వెలికి తీయొచ్చని, ఈ శక్తి ఎంతో మహిమాన్వితమైనదని చెబుతారు పండితులు. కుండలినిని ప్రార్థించిన ఓంకారనాద శాస్త్రి యజ్ఞవాటికలోని అగ్నిలోకి దిగుతాడు. అందులో నుంచి అతని ప్రాణ శక్తి బయటకు వస్తుంది. అది నీటిలో చేరి ఓ అమోఘమైన మనిషి రూపం బయటకు వస్తుంది. ఆ ప్రతీకను స్వీకరించమంటాడు వేదపండితుడు.

అలా వాయు శక్తిని, అపవిత్రాన్ని పవిత్రంగా మార్చే అగ్నిని, భూ శక్తిని, జల శక్తిని, విశ్వశక్తిని యోగుల ద్వారా పొందిన ఓంకారనాద్‌ శక్తిమాన్‌గా ప్రత్యక్షమవుతాడు. సంకల్పంతో సంపూర్ణశక్తిని పొందిన శక్తిమాన్‌ని వేదపండితులు ఆశ్వీర్వదించి, తగు సూచనలు చేస్తారు. మనుషుల్లో ఉండే కామ, క్రోధ, మదమాత్సర్యాలు ఈ లోకంలో ఎంతటి వినాశనాన్ని సృష్టిస్తున్నాయో చెబుతూ అందరిలోనూ పరివర్తన తీసుకురమ్మంటారు. అందుకు అంగీకరించి వారికి నమస్కరించి బయలుదేరుతాడు శక్తిమాన్‌. మహానగరంలో ఓ ఎల్తైన భవనం మీద నుంచుని కింద ఏమేం జరుగుతున్నాయో పరిశీలిస్తుంటాడు శక్తిమాన్‌. 

దోపిడీ నుంచి రక్షణ
బ్యాంక్‌ దోపిడీ చేసిన దుండగులు, అడ్డుపడిన పోలీసులను చావచితక్కొట్టి అక్కడినుంచి తప్పించుకుని పారిపోవడానికి సిద్ధపడతారు. ఇది గమనించిన శక్తిమాన్‌ వారి బారి నుంచి పోలీసులను కాపాడుతాడు. ఇదంతా ఓ స్కూల్‌ పిల్లవాడు చూస్తాడు. ఆ పిల్లవాడిని అడ్డుపెట్టుకొన్న దుండగులు మరింత రెచ్చిపోతారు. కానీ, తనకున్న శక్తితో ఆ ముఠానంతటినీ పట్టుకొని పిల్లవాడిని, బ్యాంకు డబ్బును కాపాడి అక్కణ్ణుంచి అదృశ్యమవుతాడు. శక్తిమాన్‌ అవతారం పని పూర్తికాగానే దానికి పూర్తి భిన్నమైన పాత్రలోకి చేరుతాడు. ‘ముందుకు వచ్చిన వెడల్పాటి దంతాలు, నున్నగా దువ్విన జుట్టు..’తో అమెరికన్‌ కమెడియన్‌ జెర్రీ లెవిస్‌ను తలపిస్తాడు.

లేజర్‌గన్స్‌తో ఎఫెక్ట్స్‌
ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ క్షణాల్లో ప్రత్యక్షమై, వారిని కాపాడుతుంటాడు శక్తిమాన్‌. షూటింగ్‌ మొత్తం లేజర్‌గన్స్, హైఫై గ్యాడ్జెట్స్‌తో ఒక చిన్న ప్రపంచాన్ని బుల్లితెర మీద ఆవిష్కరించారు. ముఖేష్‌ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో శక్తిమాన్‌ గురించి మాట్లాడుతూ ‘మన దేశ పురాణాల్లో  సూపర్‌ హీరోస్‌ అనదగ్గ ఎన్నో శక్తిమంతమైన క్యారెక్టర్స్‌ ఉన్నాయి. వాటి నుంచే శక్తిమాన్‌ జన్మించాడు’ అని చెప్పారు. శక్తిమాన్‌లో సృజనాత్మకమైన విశ్వశక్తి ఉంటుంది. అతను ఎగరగలడు, ఎంతటి ఎత్తునుంచైనా దూకగలడు. అసలు ఈ శక్తిమాన్‌ చేయలేని పని అంటూ ఉండదు. దీంట్లోని స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ చూస్తే నేటి టెర్మినేటర్, అవేంజర్స్‌ వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. ఎలాంటి కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ లేనప్పటికీ ఉన్న వనరులతోనే మ్యాజిక్‌ చేయడం ఈ దర్శక నిర్మాతలకే చెల్లింది. ప్రతీ ఒక్క ఎపిసోడ్‌కి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేశారట. 

విమర్శల మాన్‌
శక్తిమాన్‌ సీరియల్‌ ఎదుర్కొన్నప్పి విమర్శలను నాడు ఏ సీరియల్‌ కూడా ఎదుర్కోలేదని చెప్పవచ్చు. పిల్లలు శక్తిమాన్‌ లాగే భవానాల మీదుగా జంప్‌ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పెద్ద వివాదాస్పదమైంది. ఈ పరిస్థితిని గుర్తించిన సీరియల్‌ నిర్మాతలు ఎవరూ ఇలాంటి సాహసాలకు పూనుకోకూడదని మనవి చేసుకోవాల్సి వచ్చింది. ఈ సీరియల్‌ ద్వారా ఖన్నాకు వచ్చిన పాపులారిటీని తగ్గించడానికే ఇలాంటి రూమర్స్‌ సృష్టించారనే వాదనలూ వచ్చాయి.పిల్లల కామిక్‌ పుస్తకాల్లో శక్తిమాన్‌ కూడా చోటు చేసుకుంది. శక్తిమాన్‌ తరహా కాస్ట్యూమ్స్, స్టికర్స్, బొమ్మలు.. వంటివి కూడా మార్కెట్‌లోకి వచ్చి చేరాయి.

2001లో గుజరాత్‌ భూకంపం వచ్చినప్పుడు ప్రభావిత ప్రాంతాలను శక్తిమాన్‌ కాస్ట్యూమ్స్‌లోనే సందర్శించి అక్కడి ప్రజలకు ఊరటినిచ్చారు ముఖేష్‌ ఖన్నా. మహాభారత్‌లో భీష్ముడిగా నటించి మెప్పించినప్పటికీ ముఖేష్‌ ఖన్నా పేరు ‘శక్తిమాన్‌’గానే ఇప్పటికీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. శక్తిమాన్‌ యానిమేషన్‌ సీరీస్‌ను 2012లో ప్రసారం చేశారు. నిజాన్ని, న్యాయాన్ని శక్తిమాన్‌ బుల్లితెర ద్వారా ప్రేక్షకుల కళ్లకు కట్టాడు. ఈ సీరియల్‌ చూసిన ప్రేక్షకులు తామూ నిజాయితీగా, స్వచ్ఛంగా, పరిశుభ్రంగా, విద్యాసక్తులై, దేశభక్తితో ఉండాలి నిర్ణయించుకునేంత స్థాయిని పెంచింది.
– ఎన్‌.ఆర్‌ 

►అమెరికన్లు సూపర్‌హీరోలను కనిపెట్టా రని అంటారుగాని మన దగ్గర లేకనా? ఆంజనేయుడు, ఘటో త్కచుడు, భీముడు...

►వీరంతా సూపర్‌ హీరోసే కదా. కాని సూపర్‌ మేన్, స్పైడర్‌ మేన్, హీ మేన్‌ వీరే తెలుసు మన పిల్లలకు. వారి ముక్కు పట్టుకుని మన హీరోల వైపు చూసేలా చేసిన సీరియల్‌ ‘శక్తిమాన్‌’. ఇది మన పవర్‌. మన శక్తి. 

మరిన్ని వార్తలు